close

ప్ర‌త్యేక క‌థ‌నం

నిప్పుల్లో ఆరోగ్యం 

పెరిగిన వడగాలుల తీవ్రత 
వడదెబ్బ తాకిడికి ఆరోగ్యం అతలాకుతలం 
చల్లపూట ప్రయాణాలే మేలు 
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల్లో అప్రమత్తత అవసరం 
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణలో భానుడు చెలరేగిపోతున్నాడు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. రోజురోజుకూ వేడి గాలుల తీవ్రత పెరుగుతోంది. ఖమ్మం, రామగుండం వంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటి నమోదవగా.. జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ తదితర  ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటింది. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిందంటే.. ఎండ తీవ్రత ప్రమాదకరంగా మారిందని అర్థం. వడదెబ్బ తాకిడికి నల్గొండలో ఒకేరోజు ఏడుగురు మృత్యువాతపడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ  ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. వడదెబ్బకు గురికాకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో పేర్కొంటూ ప్రచార ప్రకటననూ విడుదల చేసింది.

వడదెబ్బ లక్షణాలు 
* తలనొప్పి 
*  తల తిరగడం 
* తీవ్రమైన జ్వరం కలిగి ఉండడం 
* చర్మం పొడిబారడం 
*  నిస్సత్తువ 
* వాంతులు, విరేచనాలు 
* మూర్ఛ 
* పాక్షిక లేదా పూర్తిగా అపస్మారక స్థితి

నిస్సత్త తొలి హెచ్చరిక 
* వేసవి వేడికి ఒంట్లో నుంచి నీరు చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్లిపోతుంది. 
* నీటితో పాటు ఖనిజాలు, లవణాలు కూడా పోతాయి. దీంతో నిస్సత్తువ ఆవహిస్తుంది. దీన్నే వైద్య పరిభాషలో ‘డీహైడ్రేషన్‌’ అంటారు. ఇదే తొలి ప్రమాద హెచ్చరిక. 
* ఈ పరిస్థితుల్లో అత్యవసరంగా శరీరంలో నీటిని, లవణాలను భర్తీ చేయాలి.

ఏమిటీ వడదెబ్బ? 
* ఎండవేడికి గురైతే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. వేడిని చెమట రూపంలో 
బయటకు పంపించే మార్గాలు మూసుకుపోతాయి. 
* ఫలితంగా శరీరంలో వేడి అంతకంతకూ పెరిగిపోయి.. కుప్పకూలిపోతారు. ఇది అత్యవసరంగా వైద్య చికిత్స అందించాల్సిన పరిస్థితి.

తక్షణం ఏంచేయాలి? 
* వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశంలోకి చేర్చాలి. 
* కాళ్లకింద దిండును ఉంచాలి. 
* ద్రావకాలు తాగించాలి.

ఎవరిలో ఎక్కువ ప్రమాదం? 
* ఐదేళ్ల లోపు పిల్లలు 
* 6 5 ఏళ్లు పైబడిన వృద్ధులు 
* గర్భిణులు, బాలింతలు 
* దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు 
* వేడికి దగ్గరగా పనిచేసేవారు 
* ఎండలో పనిచేసే కార్మికులు, ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు వడదెబ్బకు గురైనప్పుడు.. 
* బాధితుడిని వెంటనే నీడపట్టున, చల్లని ప్రదేశంలోకి చేర్చాలి. 
* దుస్తులు విప్పి, గాలి బాగా ఆడే ప్రదేశంలో ఉంచాలి. 
* శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కాబట్టి.. సాధారణ ఉష్ణోగ్రత వచ్చేవరకూ తడిగుడ్డతో తుడుస్తూ ఉండాలి. 
* సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. 
* నొప్పి మాత్రలు, పారాసిటమాల్‌ వంటి ఔషధాల వల్ల వడదెబ్బకు గురైన వారిలో ఆరోగ్యం మరింత ప్రమాదకరంగా మారుతుంది. 
* అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో జ్వరం తగ్గించే మాత్రలను ఇవ్వకూడదు.

ముందస్తు జాగ్రత్తలు 
* ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఆ సమయంలో పిల్లలను బయట ఆడుకోనివ్వొద్దు. 
* బాగా ముదురు రంగు దుస్తులు ధరించకూడదు. 
* వదులుగా ఉండే నూలు, తెలుపు, లేత రంగు దుస్తులు ధరించాలి. 
* ఎండవేడిలో ఎక్కువసేపు పని చేయకూడదు. మధ్య మధ్యలో చల్లని ప్రదేశంలో సేద తీరుతూ పనిచేయాలి. 
* ఎండాకాలంలో ఇంట్లో ఉన్నా సరే.. నీళ్లు బాగా తాగాలి. 
* బయటకు వెళ్లినప్పుడు వెంట తాగునీరు తీసుకెళ్లాలి. 
* మూత్రం పచ్చగా వస్తుంటే.. ఒంట్లో నీళ్లు తగ్గిపోయాయని గుర్తించాలి. 
* తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి లేదా రుమాలు చుట్టుకోవాలి. 
* ఇంట్లో గాలి బాగా ఆడేట్లు చూడాలి. 
* కిటికీలకు అడ్డంగా దుప్పట్లు వంటివి కట్టి, నీళ్లు చల్లుతూ ఉండడం వల్ల గది వాతావరణం చల్లబడడానికి అవకాశం ఉంటుంది. 
* శీతల పానీయాలు తాగడం వల్ల దాహం తగ్గకపోగా.. మరింతగా పెరుగుతుంది. అందువల్ల శీతల పానీయాలు అస్సలు తాగొద్దు.కాఫీ, టీలు అధిక వేడిమి సమయంలో సేవించడం మంచిది కాదు. 
* పలచని మజ్జిగ, గ్లూకోజు నీరు లేదా చిటికెడు ఉప్పు, చెంచాడు పంచదారను ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలి. 
* ఎండలో నిలిపిఉంచిన కారులో చిన్న పిల్లలను, వృద్ధులను, అనారోగ్యంతో ఉన్నవారిని  ఎక్కువసేపు ఉంచకూడదు.


ఇన్సులిన్‌ భద్రత ముఖ్యం 

నీరు తగినంతగా తీసుకోకపోతే మధుమేహుల్లో రక్తం చిక్కబడుతుంది. అతిమూత్ర సమస్య వల్ల కూడా ఒంట్లోంచి నీరు వెళ్లిపోతుంది. రక్తంలో గ్లూకోజ్‌ 250 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా 15 ఏళ్ల లోపు, 65 ఏళ్ల పైబడిన మధుమేహుల్లో ఇది ప్రమాదకరంగా మారుతుంది. మధుమేహులు ఎండాకాలం కనీసం 3-5 లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. గుండె, మూత్రపిండాలు, కాలేయ సమస్యలతో బాధపడుతున్నవారు ఒకేసారి ఎక్కువగా.. అంటే 3, 4  లీటర్ల నీటిని తాగొద్దు. ఇన్సులిన్‌ను 25 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువగా ఉండే వేడి ప్రదేశాల్లో భద్రపర్చకూడదు. దుస్తుల మధ్యలో అస్సలు పెట్టొద్దు. రిఫ్రిజిరేటర్‌ అందుబాటులో లేకపోతే.. పొడిగా ఉండే చిన్నమట్టి కుండను ఇసుకపై ఉంచి, ఆ కుండలో ఇన్సులిన్‌ను భద్రపర్చాలి. ఇసుకను తడుపుతూ ఉండాలి. ఉదాహరణకు పాతకాలంలో అల్లం భద్రపర్చినట్లుగా. గ్లూకోజ్‌ పరీక్షలు చేయించుకుంటూ.. వైద్యుని సలహా మేరకు డోసులు మార్చుకోవాలి.

 డాక్టర్‌ పీవీ రావు, మధుమేహ నిపుణులు

 


బీపీ మాత్రలు సరిచూసుకోవాలి 

అధిక రక్తపోటుకు వాడే కొన్నిరకాల మాత్రలకు ఒంట్లో నీరు తగ్గించే గుణం ఉంటుంది. ఇలాంటప్పుడు రక్తంలో నీళ్లు, సోడియం తక్కువైతే ‘డీహైడ్రేషన్‌’కు గురయ్యే అవకాశం ఉంటుంది. వైద్యుల సలహా మేరకు ఈ రకం మందుల మోతాదులను సరిచేసుకోవాలి. మానసిక చికిత్స, పార్కిన్‌సన్‌ వంటి నాడీ సంబంధ వ్యాధుల్లో ఉపయోగించే కొన్ని రకాల మందుల వల్ల చెమట పట్టే గుణం తగ్గిపోతుంది. ఫలితంగా ఎండలో వెళ్లినప్పుడు వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. ఎండాకాలంలో రక్తనాళాలు ఉబ్బి, రక్తపోటు పడిపోతుంది. ఫలితంగా మెదడుకు రక్తప్రసరణ ఒక్కసారిగా తగ్గి ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయే అవకాశముంటుంది. అందువల్ల బయటకు వెళ్లేముందు, వెళ్లాక కూడా తరచూ ఓఆర్‌ఎస్‌ ద్రావణాలు, మజ్జిగను తీసుకుంటూ ఉండాలి.

-డాక్టర్‌ ఎంవీ రావు, జనరల్‌ ఫిజీషియన్‌

 


చర్మ సంరక్షణ ప్రధానం 

ఎండాకాలంలో చర్మంపై చెమట పేరుకుపోయి ఉండడంతో బ్యాక్టీరియా చర్మం లోపలికి చేరి చీముపొక్కులు, సెగ్గడ్డల రూపంలో విరుచుకుపడుతుంటాయి. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు చంకలు, గజ్జల్లో చేరి తామర వస్తుంది. అందుకే ఆ ప్రదేశాల్లో పొడిగా ఉంచుకోవాలి. మధుమేహులు కాలి వేళ్ల మధ్య కూడా తడి లేకుండా చూసుకోవాలి. పౌడర్‌ను ఉపయోగించాలి. ఎండలో తిరిగితే ముఖంపై నల్లమచ్చలు, చర్మం ఎర్రబడటం, పొక్కులు, దురద వంటి సమస్యలు వస్తాయి. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, బయటకు వెళ్లినప్పుడు చర్మానికి రక్షణనిచ్చే లేపనాలు (సన్‌స్క్రీన్‌ లోషన్లు) ఉపయోగించడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

-డాక్టర్‌ పార్థసారథిÅ, చర్మవ్యాధి చికిత్స  నిపుణులు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.