close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఎన్నికల కోడ్‌ ఏం చెబుతోంది?

నియమావళి అమలులో ఉన్నప్పుడు అధికారులు ఏం చేయాలి!
ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు ఎవరికి జవాబుదారీగా ఉండాలి?
ఏ పనులు చేయాలి?
ఏం చేయకూడదు?
ఈనాడు - అమరావతి

...ఈ అంశాలపై సవాలక్ష సందేహాలు. చాలా మంది అధికారులకే వీటిపై స్పష్టత లేదు. కోడ్‌ను బూచిగా చూపించి అవసరమైన పనులను వాయిదా వేస్తూ వచ్చారు. ప్రజలకు మంచినీటి సరఫరా వంటి తక్షణ అవసరాలకు సంబంధించిన అంశాలపైనా మీనమేషాలు లెక్కించే పరిస్థితి..! వ్యవసాయం, కరవు పరిస్థితులపై  మంత్రి సమీక్ష నిర్వహిస్తానంటే ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరు కాలేదు. మంత్రిని కలసి తాజా పరిస్థితుల్ని వివరించడం కోడ్‌ ఉల్లంఘన కిందకు రాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పాకే అధికారులు మంత్రి సమీక్షకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌కి ముందు, పోలింగ్‌కి, ఓట్ల లెక్కింపునకు మధ్య కాలంలోనూ అదే కోడ్‌ వర్తిస్తుందా?
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది. కోడ్‌ అమలు విషయంలో ఇటీవల కాలంలో ఎన్నో వివాదాలు, సందేహాలు చుట్టుముట్టాయి. సమీక్షలు, సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న వ్యవహారాలు పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ దశలో కోడ్‌ అమలు తీరు.. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు మధ్య ఉన్న నిబంధనలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. పోలింగ్‌కి ముందూ, తర్వాతా కోడ్‌  ఒకే రకంగా ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.

ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది. మళ్లీ ఓట్ల లెక్కింపుతో సహా ఎన్నికలకు సంబంధించిన అధికారిక ప్రక్రియలన్నీ పూర్తయ్యే వరకు కోడ్‌ అమల్లో ఉంటుంది. ఈ ఎన్నికలకు సంబంధించి  ఎన్నికల కోడ్‌ ఈ నెల 27 వరకు అమల్లో ఉంటుంది. ఎన్నికల ప్రవర్త నియమావళికి సంబంధించి పోలింగ్‌ తేదీ వరకు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో, ఆ తర్వాత కూడా కోడ్‌ అమల్లో ఉన్నంత కాలం అవే నిబంధనలు వర్తిస్తాయి. పోలింగ్‌ అనంతరం మంత్రులు జిల్లాల పర్యటనల్లో అధికారులు పాల్గొనేందుకు, క్షేత్రస్థాయిలో జరిగే పనులపై సమీక్షలు నిర్వహించేందుకు 2009లో ఎన్నికల సంఘం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. వాటిని రద్దు చేస్తూ 2017లో మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది.


అధికారుల ప్రవర్తనకు నియమావళి ఇదీ..!
కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు అధికారులకు వర్తించే నియమాలు

* ప్రభుత్వ అధికారులంతా ఎన్నికల సంఘం పరిధిలోనే పనిచేయాలి. నిష్పాక్షికంగా, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి విధులు నిర్వహించాలి.
* ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు అనుకూలంగా పనిచేయకూడదు. వారి తరపున ప్రచారం చేయకూడదు. ఓటర్లను ప్రభావితం చేయకూడదు.
* రాజకీయ నాయకులతో అధికారులు వ్యక్తిగత సమావేశాలు కూడా నిర్వహించకూడదు.
* మంత్రులు గానీ, ప్రజాప్రతినిధులుగానీ అధికారుల్ని అధికారిక సమావేశాలకు తప్ప, మరే ఇతర సమావేశాలకు పిలవకూడదు.
* ముఖ్యమంత్రికి, మంత్రులకు భద్రతాపరమైన అంశాలపై తప్పనిసరిగా వివరించాల్సిన పరిస్థితి వస్తే, హోం శాఖ కార్యదర్శి లేదా ప్రధాన కార్యదర్శి మాత్రమే బ్రీఫ్‌ చేయాలి. అలాంటి సమావేశాల్లో  పోలీసు అధికారులు పాల్గొనాల్సిన అవసరం ఉంటే, వారికి ప్రధాన కార్యదర్శి లేదా హోం శాఖ కార్యదర్శి మాత్రమే సూచించాలి.
* కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించకూడదు. అధికారులు వాటిలో పాల్గొనకూడదు.
* ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసరమనుకుంటే ముఖ్యమంత్రిగానీ, మంత్రిగానీ కొన్ని నిబంధనలకు లోబడి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించవచ్చు. దీనికి ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి. సంబంధిత జిల్లా కలెక్టర్లు, సహాయక చర్యల పర్యవేక్షణకు ఇన్‌ఛార్జులుగా నియమించిన సీనియర్‌ అధికారులు మాత్రమే ఈ సమావేశాలకు హాజరుకావాలి. సహాయ, పునరావాస చర్యల గురించి తప్ప మరే ఇతర అంశాలూ ఇక్కడ చర్చించకూడదు.
* మంత్రుల వ్యక్తిగత పర్యటనల్లో వారి ప్రైవేటు సిబ్బందిగా ఉన్న ప్రభుత్వ అధికారులు పాల్గొనకూడదు.
* ఎన్నికల ప్రకటన వెలువడ్డాక కేంద్ర, రాష్ట్ర మంత్రులెవరూ ఎన్నికల విధుల్లో ఉన్న ఏ అధికారినీ అధికారిక చర్చల కోసం పిలవకూడదు.
* మంత్రులు వ్యక్తిగత పర్యటనల నిమిత్తం నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ వెళ్లి వారిని కలవకూడదు.
* మంత్రుల ఎన్నికల ప్రచారంలో అధికారులు ఎవరూ పాల్గొనకూడదు.


  భార్య లేదా భర్త పోటీ చేస్తుంటే?

* ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల భార్య/భర్తలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నా, రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్నా సంబంధిత అధికారులు ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు వారి హెడ్‌క్వార్టర్స్‌ని విడిచి వెళ్లకూడదు. సెలవు మీద గానీ, ఆన్‌టూర్‌ మీదగానీ వెళ్లేందుకు వీల్లేదు.
* అధికారులు హెడ్‌క్వార్టర్స్‌ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే, ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకున్న తర్వాతే వెళ్లాలి. వారి భార్య/భర్తకు సంబంధించిన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనబోమన్న స్పష్టమైన హామీ ఇవ్వాలి.


ఇవి చేయవచ్చు..!

* ఎన్నికల విధులతో సంబంధం లేని అధికారులు సంబంధిత శాఖల మంత్రుల్ని కలసి తాజా పరిణామాల్ని వివరించడం, వారి సలహాలు తీసుకోవడం కోడ్‌ ఉల్లంఘన కిందకు రాదు. ఆ సమావేశాల్లో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం వీల్లేదు.
* అన్ని రకాల అనుమతులు ముందే తీసుకుని, ఇప్పటికే ప్రారంభించిన పనుల్ని అధికారులు కొనసాగించవచ్చు.
* ఎన్నికల కోడ్‌ వెలువడటానికి ముందే పేర్లతో సహా లబ్ధిదారుల్ని ఎంపిక చేసిన పథకాల్ని కొనసాగించవచ్చు.
* ముఖ్యమంత్రి/ప్రధాన మంత్రి సహాయనిధి నుంచి నేరుగా ఆస్పత్రులకు చెల్లింపులు జరపవచ్చు. రోగులకు (లబ్ధిదారులకు) మాత్రం నేరుగా ఇవ్వకూడదు.
* అప్పటికే దాదాపు పూర్తయిన మౌలిక వసతుల ప్రాజెక్టులు వంటి వాటిని ఎన్నికల కోడ్‌ నెపంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకుండా నిలిపి వేయాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా వాటిని అధికారులే ప్రారంభించవచ్చు. ఎలాంటి అట్టహాసం, సభలు లేకుండా సాదాసీదాగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి.
* ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయ, పునరావాస కార్యక్రమాలు నిర్వహించవచ్చు. దీని వల్ల జరిగే నష్టాన్ని తగ్గించేందుకు చెరువు గట్లు, కాలువలకు మరమ్మతులు వంటివి ఈసీ అనుమతితో చేపట్టవచ్చు.
* ఏ ప్రాంతాన్నైనా కరవు లేదా వరద ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలంటే ఈసీ అనుమతి తీసుకోవాలి. కొత్తగా మరిన్ని ప్రాంతాలను చేర్చాలన్నా ఈసీ అనుమతి తప్పనిసరి.


ఇవి చేయకూడదు..!

* అధికారులు విచక్షణాధికారంతో చెల్లింపులు చేయరాదు.
* ఆర్థిక పరమైన హామీలివ్వడం, వెసులుబాట్లు కల్పించడం చేయకూడదు
* రహదారుల నిర్మాణం, తాగునీటి ప్రాజెక్టులు వంటి కొత్త హామీలేవీ ఇవ్వకూడదు.
* ప్రభుత్వంలోను, ప్రభుత్వరంగ సంస్థల్లోనూ కొత్త నియామకాలు చేపట్టకూడదు. పదోన్నతులు ఇవ్వకూడదు.
* అమల్లో ఉన్న ఏదైనా ప్రాజెక్టు, పథకం, కార్యక్రమం పరిధిని విస్తరించకూడదు. ఎవరికీ భూముల కేటాయింపులు చేయకూడదు.
* ఎవరితోనూ ఎంఓయూలు కుదుర్చుకోకూడదు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.