close

ప్ర‌త్యేక క‌థ‌నం

కల్యాణలక్ష్మికి అడ్డంకులు 

నిలిచిన 55 వేల దరఖాస్తులు 
ఎమ్మెల్యేల వద్ద 14వేల అర్జీలు 
ఈనాడు - హైదరాబాద్‌

పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన ‘కల్యాణలక్ష్మి’ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నెమ్మదించింది. వరుస ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ యంత్రాంగం కీలకం కావడంతో... సిబ్బంది అందుబాటులో లేక భారీ సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోయాయి. గత మూడునెలలుగా దాదాపు 55 వేల దరఖాస్తులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ నిధుల మంజూరు ఆదేశాలు ఇటీవల వెలువడ్డాయి. ఈ దరఖాస్తుల పరిష్కారానికి దాదాపు రూ.550కోట్ల వరకు అవసరమని అంచనా.

రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద దరఖాస్తు చేసుకుని వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ముహూర్తాల సీజన్‌ కావడంతో పెళ్లికి ముందుగానే రూ.1,00,116 ఆర్థిక సహాయం అందితే ఖర్చులకు ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. జిల్లాల్లో ఇప్పటికే అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేశారు. కల్యాణలక్ష్మి దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించి, వివాహ సమయానికి సహాయం అందించాలన్న లక్ష్యం  నెరవేరడం లేదు. అసెంబ్లీ ఎన్నికల నియమావళి ముగిసిన వెంటనే కొన్నింటిని పరిష్కరించారు. దరఖాస్తులను పరిష్కరించాల్సిన రెవెన్యూ సిబ్బంది ఆ తరువాత పంచాయతీ, పార్లమెంటు, పరిషత్‌ ఎన్నికల విధుల్లో మునిగిపోయారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాల పరిధిలో 25వేలకు పైగా అపరిష్కృతంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గ్రామరెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా ఉన్నారు.

ఎమ్మెల్యేల కార్యాలయాల్లో.. 
రెవెన్యూ కార్యాలయాల పరిశీలన పూర్తయిన అనంతరం అర్హత కలిగిన దరఖాస్తులు తదుపరి ఆమోదం కోసం ఎమ్మెల్యేల కార్యాలయాల్లో నిలిచిపోయాయి. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు సహాయం అందించాలంటే ఎమ్మెల్యే సమ్మతి తప్పనిసరి. ప్రస్తుతం వీరివద్ద దాదాపు 14వేలకు పైగా దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. పరిషత్‌, పార్లమెంటు ఎన్నికల నియమావళి ముగిసే వరకు వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అధికారవర్గాలు భావిస్తున్నాయి. 2019-20 ఏడాదికి దరఖాస్తులు వస్తున్నాయి. గత బకాయిలతో పాటు కొత్త ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తు చేసిన వారికి నిధులు కావాల్సి ఉంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద సంక్షేమ శాఖలకు నిధుల మంజూరు ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఈ నిధులు ఇంకా సంక్షేమశాఖల ఖాతాల్లోకి రాలేదు. అవి అందుబాటులోకి వస్తే ఆర్డీవోల వద్ద ఉన్న 15వేలకు పైగా దరఖాస్తులకు మోక్షం కలుగుతుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.