close

ప్ర‌త్యేక క‌థ‌నం

మిత్రులే కీలకం?

ఏ కూటమి కొలువుదీరినా మిత్రపక్షాల మద్దతు అనివార్యం 
సొంతంగానే గెలుస్తామని భాజపా విశ్వాసం 
ఎన్డీయే కొట్టుకుపోవడం ఖాయమంటున్న విపక్షాలు 
కూటములను కాపాడుకుంటూనే కొత్త మిత్రులను వెతుక్కుంటున్న ప్రధాన పార్టీలు 
ఈనాడు, దిల్లీ

కేంద్రంలో ఎవరిది అధికారమన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు మాత్రం గెలుపు తమదంటే తమదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. భాజపా ఓ అడుగు ముందుకేసి నూటికి నూరుపాళ్లు తమదే ప్రభుత్వమని ధీమాగా చెబుతోంది. తమ కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయని సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తోంది. పైకి ఈ మాటలు అంటున్నా... కూటమిలో ఉన్నవారు చేజారిపోకుండా జాగ్రత్త పడుతూ, కొత్త మిత్రులను వెతుక్కొనే పనిలో కమలనాథులు నిమగ్నమైనట్టు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ మిత్రుల్లోనూ ఇలాంటి విశ్వాసమే వ్యక్తమవుతోంది. ఫలితాలు వెలువడటానికన్నా ముందే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని, కలిసొచ్చే మిత్రులను దానికి ఆహ్వానించి కూటమిని పదిలం చేసుకునే పనిలో ఆ పార్టీ ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద ప్రస్తుత పరిస్థితిని చూస్తే.ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో ‘మిత్రులు’ కీలకపాత్ర పోషిస్తారనే వాతావరణం కనిపిస్తోంది. 
పూర్తి నమ్మకంతో భాజపా 
గతసారి కంటే ఎక్కువ మెజార్టీతో ఈసారి తాము దిల్లీ పగ్గాలు చేపట్టడం ఖాయమంటోంది భాజపా! మోదీకి సరితూగే నాయకుడు ప్రతిపక్షంలో లేకపోవడమే తమ బలమని, అదే ఊహించని ఫలితాలను తెచ్చిపెడుతుందని కమలనాథులు నమ్ముతున్నారు. హిందీ రాష్ట్రాల్లో తమకు మంచి పట్టుందనీ... యువత, మధ్యతరగతి ప్రజలు ప్రధానిగా మోదీనే మళ్లీ
కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. దేశానికి ఆయన ఇచ్చిన బలమైన నాయకత్వం, సమర్థ పాలన, జాతీయ భద్రత విషయంలో రాజీపడని వైఖరి తమకు కలిసొస్తాయన్నది వారి విశ్లేషణ. ‘‘ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకత కారణంగా మా బలం 240-250 మధ్య నిలిచిపోవచ్చని ఎన్నికల ప్రారంభ రోజుల్లో అనుకున్నాం. క్షేత్రస్థాయి పరిస్థితులను చూసిన తర్వాత ఆ సంఖ్య 300కి మించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి’’ అని భాజపా నేతలు చెబుతున్నారు. హిందీ బెల్ట్‌లో పట్టును యథాతథంగా నిలుపుకోవడంతోపాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించడం తమ నంబరు పెరగడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉండటం; కాంగ్రెస్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పెరగకపోవడం; ఉత్తర్‌ప్రదేశ్‌ మినహా మరెక్కడా ప్రతిపక్షాలు బలమైన కూటమి కట్టలేకపోవడం కాషాయదళం బలపడటానికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. బిహార్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కూటమి కట్టినా... అంతర్గత కుమ్ములాటలతో అవి పలుచనైపోయాయని అంటున్నారు. 
అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మోదీ సామాజిక సమీకరణాల లెక్కలను పటాపంచలు చేశారని, దీనివల్ల భాజపాకు కొత్త ఓటర్లు చేరువై గతం కంటే ఎక్కువ మెజార్టీ సాధించడానికి దోహదం చేయబోతున్నారని అంటున్నారు. చతికిలపడిన కొన్ని రాజకీయ పార్టీలు భాజపావైపు చేరుతున్నాయని, పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టు సానుభూతిపరులంతా భాజపావైపు చేరడమే ఇందుకు ఉదాహరణ అని చెబుతున్నారు. సొంత బలమున్నా జేడీయూ శివసేన, ఎల్‌జేపీ, అప్నాదళ్‌ వంటి మిత్రపక్షాలతో కలిసి సౌకర్యవంతమైన మెజార్టీతో కేంద్రంలో అధికారం చేపట్టడం ఖాయమంటున్నారు. 
ఇలాగైతే ఇంకేం గెలుస్తారు? 
ఇప్పటివరకూ పూర్తయిన ఎన్నికల సరళిని బట్టి భాజపా ఓటమి ఖాయమని, ఆ పార్టీ నాయకత్వం కూడా ఈ నిర్ణయానికి వచ్చేసిందని భాజపాను వ్యతిరేకిస్తున్న ఎన్డీయేతర పక్షాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే మోదీ నిస్పృహతో ప్రతిపక్షాలు, చనిపోయిన వారిపైనా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఉదహరిస్తున్నారు. తమకు ఈసారి అధికారయోగం ఉందా? లేదా? చెప్పమని భాజపా ముఖ్యనేత ఒకరు జ్యోతిష్యులను కూడా సంప్రదిస్తుండటమే వారిలోని భయాన్ని సూచిస్తున్నట్లు చెబుతున్నారు. 
ప్రతిపక్షాల మరికొన్ని వాదనలు ఎలా ఉన్నాయంటే... 
మోదీ తన ప్రభుత్వం చేసిందేంటో చెప్పుకొనే ధైర్యంలేక... కేవలం పాకిస్థాన్‌ బూచిని చూపి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 
ఆర్‌ఎస్‌ఎస్‌ అంతర్గత వర్గాలు కూడా భాజపా మార్కు 180కి మించదన్న నిర్ణయానికి వచ్చేశాయి. అందుకే ఇప్పట్నుంచే కొత్త మిత్రులను దరిచేర్చుకొనే పనిలో వారు నిమగ్నమయ్యారు. 
రాజస్థాన్‌లో 20 ఏళ్ల ఫలితాలను విశ్లేషిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీయే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. ఇదే తీరున కాంగ్రెస్‌ అక్కడ సగానికిపైగా సీట్లు దక్కించుకుంటుంది. 
మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌దే పైచేయి అవుతుంది. ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, కేరళల్లో కాంగ్రెస్‌ స్వీప్‌ చేస్తుంది. తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో మిత్రపక్షాలతో కలిసి హస్తం పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుంది. బిహార్‌లో ఇదివరకటిలా ఓట్లు చీలిపోయే పరిస్థితి లేదు. 
2014లో మోదీ గాలి వీచిందని చెప్పుకొంటున్నా... అప్పట్లో భాజపాకు వచ్చినవి కేవలం 31% ఓట్లే. అప్పుడు విపక్షాలన్నీ విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి కాషాయపార్టీ లాభపడింది. ఈసారి అన్ని రాష్ట్రాల్లో ఎన్డీయేతర పక్షాలు దాదాపు కూటమిగా ఏర్పడ్డాయి. 
ఎన్డీయే అనాలోచిత నిర్ణయాలు, అనుసరిస్తున్న వైఖరి వల్ల మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు భాజపాకు దూరమైపోయారు. ఆ పార్టీని ఓడించాలన్న కసితో ఉన్నారు. మోదీ వినిపిస్తున్న బాలాకోట్‌ మెరుపు దాడుల అంశం ప్రజల్లోకి వెళ్లలేదు. 
బిజద, తెరాస, వైకాపా అటేనా..? 
పూర్తిస్థాయి మెజార్టీ రాకపోతే ఏం చేయాలన్నదానిపై ఎన్డీయే అంతర్గత కసరత్తు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే మోదీ ఫొని తుపానును అడ్డుపెట్టుకొని బిజు జనతాదళ్‌ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను మచ్చిక చేసుకొనే ప్రయత్నం మొదలుపెట్టారన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఒడిశాకు అదనపు సాయాన్ని ప్రకటించడం, నవీన్‌ పట్నాయక్‌ పనితీరును ప్రశంసించడం వంటివన్నీ ఇందులో భాగమేనని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు కూడా భాజపా కూటమికి ఉంటుందన్న భావన దిల్లీ రాజకీయవర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది. 
భాజపా మెజార్టీకి దూరంగా నిలిస్తే 
భాజపా నంబరు 150కి అటూఇటూగా ఆగిపోతే.. నీతీశ్‌కుమార్‌, రాంవిలాస్‌ పాస్వాన్‌ వంటి ఎన్డీయే మిత్రులు బయటికొచ్చి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటులో పాలుపంచుకోవచ్చన్న అంచనా ఉంది. శివసేన కూడా ఇదే పంథాను అనుసరించే వీలుందంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న నానుడిని నిజంచేస్తూ ఫలితాల తర్వాత రాజకీయ పార్టీలు కొత్త ఎత్తులను తెరపైకి తేవడం ఖాయమన్న అభిప్రాయం దిల్లీలో వ్యక్తమవుతోంది. ఓవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాంగ్రెస్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు జాతీయ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మమతాబెనర్జీ, మాయావతి వంటివారు ఫలితాల తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని, వారి ఎత్తులను ఎవరూ కనిపెట్టలేరని చెబుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసిన డీఎంకే... చివరికి ఎన్డీయేవైపు మొగ్గుచూపినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. 
ఎన్డీయేకు మెజార్టీ రానిపక్షంలో ఆర్‌ఎస్‌ఎస్‌ జోక్యం చేసుకుని... ప్రధాని పీఠం నుంచి మోదీని దూరంగా పెట్టి, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ వంటి వారిని తెరపైకి తీసుకురావచ్చు. అలాగైతే విపక్ష కూటమిలో ఉన్న పార్టీలు భాజపాకు మద్దతివ్వడానికి ముందుకొస్తాయన్న అభిప్రాయముంది. దీన్ని పసిగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంటి నేతలు... భాజపాకు ఎవరూ దొరక్కుండా ముందుగానే వ్యూహరచన చేసుకోవాలని మిత్రపక్షాలకు సూచిస్తున్నారు.

భాజపాకు 180 వరకు వస్తే...

ప్పుడున్న శివసేన, జేడీయూ, శిరోమణి అకాలీదళ్‌, అన్నాడీఎంకే మద్దతు భాజపాకు ఉంటుంది. తటస్థంగా ఉన్న బిజు జనతాదళ్‌, తెరాస, వైకాపాల మద్దతునూ భాజపా కూడగట్టుకోవచ్చు. మాయావతి, శరద్‌పవార్‌ వంటి వారినీ ముగ్గులోకి దింపడానికి ప్రయత్నాలు జరుగుతాయి. లౌకికవాదానికి కట్టుబడిన ఈ పార్టీలు భాజపా వైపు మొగ్గుచూపే అవకాశాలు మాత్రం తక్కువే.

కాంగ్రెస్‌ 140 వరకూ సాధిస్తే...

దే జరిగితే భాజపాయేతర కూటమి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలుంటాయి. అయితే మరో 140 వరకూ సీట్లను హస్తం పార్టీ కూడగట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆ పార్టీ ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. 1. మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ మద్దతిస్తే కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. 2. ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మద్దతివ్వడం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.