close

ప్ర‌త్యేక క‌థ‌నం

బంగారు కొండల కోనేటి రాయుడు!

న్యూస్‌టుడే - తిరుమల

భక్తుల కొంగు బంగారంలా విలసిల్లే ఏడు కొండలవాడు.. కైమోడ్చి భక్తులు సమర్పించే బంగారు కానుకల్లో ఓలలాడుతున్నాడు!
ఏడదాగున్నాడొ ఏడు కొండలవాడు.. ఎన్ని మెట్లెక్కినాగానీ కానరాడేమయ్యా అనుకుంటూ.. ఎన్నో రైళ్లు మారి.. ఎన్నెన్నో మైళ్లు దాటి.. కేవలం ఆయన దివ్య మంగళ రూప దర్శనం కోసమే ఒళ్లంతా కళ్లు చేసుకుని వచ్చి.. ఆ తన్మయత్వంలోనే ఒంటి మీదున్నవన్నీ వలిచి స్వామికి సమర్పించుకుంటుంటారు ఎంతోమంది భక్తజనం!
అలాగే మనసంతా భక్తిని నింపుకొని.. ముడుపులు కట్టుకునీ.. మొక్కులు మొక్కుకునీ.. చివరికి స్వామికి అసమానమైన స్వర్ణాభరణాలను కానుకలుగా సమర్పించుకుంటారు మరికొందరు.
ఇలా  భక్తులు నిలువుదోపిడీ, స్వర్ణాభరణాల రూపంలో అర్పించుకుంటున్న బంగారు కానుకలే.. ఆ వెంకన్న సామికి సగటున రోజుకు 2 కేజీలు! అంటే ఏడాదికి దాదాపు 700 కేజీలు!
భక్తులు సమర్పించిన బంగారం ప్రస్తుతం ఏడుకొండల వాడి వద్ద దాదాపు 9,259 కిలోల వరకూ ఉంది!
అంతేకాదు.. ఈ స్వామి బంగారం ‘పిల్లలు’ కూడా పెడుతోంది!
అదేమిటని ఆశ్చర్యపోతున్నారా..? పదండి ఆ కథేమిటో వివరంగా చూద్దాం..

కోనేటి రాయుడిపై కనక వర్షం!

స్వామికి ఉన్న ఈ టన్నులకొద్దీ బంగారాన్ని తితిదే ఎలా నిర్వహిస్తోంది? ఏం చేస్తోంది? వీటిని ఎలా భద్రపరుస్తున్నారు? స్వామి సన్నిధిలో భక్తులు వేసే కానుకలు ఆ తర్వాత ఏ రూపంలో ఎక్కడ భద్రమవుతాయి? ఇవన్నీ ఎంతో ఆసక్తికరమైన ప్రశ్నలే!
ఇటీవల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తమ వద్దనున్న స్వామి బంగారం డిపాజిట్‌ గడువు తీరటంతో 1,381 కిలోల బంగారాన్ని తిరిగి తితిదేకు అప్పగించేందుకు తీసుకువస్తుండగా సరైన భద్రతాపరమైన ప్రమాణాలు పాటించలేదంటూ వార్తలు వెల్లువెత్తాయి. దీనిపై బోలెడంత చర్చా మొదలైంది. ఈ నేపథ్యంలో శ్రీవారి కాంచనాభరణ సంపదలను ఎలా నిర్వహిస్తారన్నది దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గతంలో స్వామివారికి వచ్చే బంగారు కానుకలన్నింటినీ పోగుచేసి ఏడాదికోసారి ముంబయిలోని మింట్‌కు తరలించి.. అక్కడ కరిగించి ‘శ్రీవారి బంగారు డాలర్లు’గా తయారు చేసేవారు. కరిగింపు, డాలర్ల తయారీ ప్రక్రియలో తరుగు పేరిట పసిడి స్వాహా చేస్తున్నట్లు పదేళ్ల కిందట ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ విమర్శలకు స్వస్తి పలుకుతూ బంగారాన్ని డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లోనే భద్రపరిచేలా తితిదే అధికారులు విధాన నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచీ ముడి బంగారాన్ని మింట్‌లో కరిగించి, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తున్నారు. ఇందుకయ్యే వ్యయాన్ని డిపాజిట్‌ తీసుకున్న బ్యాంకే భరించేలా తితిదే ఒప్పందం చేసుకుంటోంది. ఇలా డిపాజిట్‌ చేసిన బంగారానికి వచ్చే వడ్డీని కూడా తితిదే బంగారం రూపంలోనే తీసుకుంటోంది. ఇలా స్వామి బంగారం బ్యాంకుల్లో పిల్లలు పెడుతోంది! తితిదే నుంచి డిపాజిట్‌గా తీసుకున్న బంగారాన్ని బ్యాంకులు వివిధ ఆభరణాల సంస్థలకు ఇచ్చి వ్యాపారం చేస్తాయి. డిపాజిట్‌ కాలపరిమితి ముగిసిన వెంటనే వడ్డీ బంగారంతో సహా తిరిగి చెల్లించేస్తాయి. ఇలా ప్రస్తుతం వివిధ బ్యాంకుల వద్ద దాదాపు 7,325 కిలోల బంగారం నిల్వ ఉంది.

శ్రీనివాసుడు... వజ్రవైఢూర్య, మణిమాణిక్య స్వర్ణాభరణ అలంకృతుడు!!

* ఆనంద నిలయంలో ఆ వేంకటేశుడి మూలవిరాట్టు అలంకరణకు ఉపయోగించే అతి ముఖ్యమైన ఆభరణాలు.. 120
* ఉత్సవమూర్తులైన శ్రీదేవీభూదేవీ సమేత శ్రీమలయప్పస్వామి అలంకారానికి వినియోగించేవి.. 383
* ఇక ప్రత్యేక వేడుకల్లో స్వామి ఊరేగే రథాలు, వాహనాలన్నీ స్వర్ణమయమే
* ఇలా మూర్తులకు అలంకరించే ఆభరణాలే కాదు.. ప్రస్తుతం తితిదే ఖజానాలోనూ, వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలోనూ ఉన్నది 9 టన్నుల బంగారం!
     ... వీటికి తోడు అనునిత్యం భక్తులు నిలువుదోపిడీ, మొక్కుల్లో భాగంగా భక్తులు హుండీలో వేసే ఆభరణాలు సుమారు 2 కిలోలు. ఇలా ఏటా 700 కిలోల బంగారం స్వామి ఖజానాకు చేరుతోంది!

స్వామి బంగారం పిల్ల‌లు పెట్టేదిలా...

*స్వల్పకాలిక డిపాజిట్‌ కింద మూడేళ్లకు వడ్డీరేటు: 1.75%
*దీర్ఘకాలికం కింద పదేళ్లకు: 2.50%
*వడ్డీగా కూడా తితిదే బంగారాన్నే తీసుకుంటోంది
*10 ఏళ్లలో కేవలం వడ్డీ కింద వచ్చేదే 1800 కిలోలు

నగదా? బంగారమా? ఏది మేలు?

తిరుమలేశుడి బంగారాన్ని విక్రయించి నగదు డిపాజిట్లు చేయడం ద్వారా మరింత వడ్డీ రాబట్టవచ్చని తితిదే ధర్మకర్తల మండలి తాజాగా ఆలోచిస్తోంది. శ్రీవారి పేరిట వివిధ బ్యాంకుల్లో రూ.10 వేల కోట్ల డిపాజిట్లున్నాయి. వీటిపై ఏటా రూ.845 కోట్ల వడ్డీ వస్తోంది. స్వామి వారికి హుండీ ఆదాయం తర్వాత వడ్డీ ద్వారా వచ్చే ఆదాయమే కీలకం. తితిదే ధర్మకర్తల మండలి ఆర్థిక ఉపసంఘంలోని సభ్యులు రమేష్‌బాబు, నూతలపాటి శ్రీకృష్ణ, అశోక్‌రెడ్డి ఇటీవల తీసుకున్న చర్యల ఫలితంగా వడ్డీ రేటు 2% పెరిగి రూ.120 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతోంది. లోగడ 6.5% వడ్డీ రేటు ఉండగా బ్యాంకుల మధ్య పోటీతత్వాన్ని పెంచి ఫలితాన్ని సాధించారు.

డబ్బుగా మారిస్తే..
రిజర్వు బ్యాంకు ప్రవేశపెట్టిన ‘బంగారం ద్రవ్యనిధి’ పథకం కింద తితిదే బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తోంది. నగదు డిపాజిట్లపై వడ్డీ రేటు  8.5 శాతం ఉండగా, బంగారంపై మాత్రం 2.50 శాతమే వస్తోంది. దీనివల్ల బంగారం రూపంలో డిపాజిట్‌ చేసేకంటే నగదు రూపంలో నిల్వ చేస్తే మరింత అదనపు ఆదాయం చేకూరుతుందన్న ఆలోచన ఇటీవలికాలంలో తరచుగా వినిపిస్తోంది. 8 టన్నుల బంగారాన్ని విక్రయించి తద్వారా వచ్చే నగదును డిపాజిట్‌ చేస్తే వడ్డీ రేటు వ్యత్యాసం రూపంలో దాదాపు రూ.300 కోట్లు అదనంగా సమకూరుతుందని మండలి ఉపసంఘం అంచనా వేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగానే పీఎన్‌బీ నుంచి 1,381 కిలోల బంగారాన్ని డిపాజిట్‌ కాలపరిమితి ముగిసిన వెంటనే వెనక్కి తీసుకుంది. అయితే ఈ ప్రతిపాదనపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని,   ఏ రకంగానూ తొందరపడకూడదనే అభిప్రాయపడుతోంది.

తాజా వివాదం ఇలా!

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో మూడేళ్ల కిందట 1,311 కిలోల బంగారాన్ని డిపాజిట్‌ చేయగా వడ్డీ రూపేణా మరో 70 కిలోలు కలిపి మొత్తంగా 1,381 కిలోలయ్యాయి. దీన్ని తితిదేకు తిరిగి ఇచ్చేందుకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఓ ఏజెన్సీ ద్వారా స్విట్జర్లాండ్‌లో బంగారాన్ని కొంది. పీఎన్‌బీ ఒప్పందం ప్రకారం స్విస్‌ సంస్థ ముడి బంగారాన్ని జాగ్రత్తగా తరలించాలి. అది సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం, చెన్నై నుంచి తిరుపతికి తరలించే క్రమంలో తమిళనాడులో ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకోవటం, తర్వాత రికార్డులు సరిచూసుకొని తిరిగి అప్పగించడం తెలిసిందే. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేటప్పుడే తిరిగి చెల్లించే సమయంలో తరలింపు, భద్రతకయ్యే వ్యయాన్ని మినహాయించుకునేలా నిబంధనలున్నాయి. పీఎన్‌బీ అధికారులు దీనికి అనుగుణంగా వ్యవహరించకపోవడంతో వివాదం రాజుకుందని తితిదే వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.