close

ప్ర‌త్యేక క‌థ‌నం

దవాఖానాలకు దూప

 మండుటెండల్లో నీటి ఎద్దడి
 మిషన్‌ భగీరథతో కొంతమేరకు ఊరట
పూర్తిస్థాయిలో ఆసుపత్రుల అవసరాలు తీర్చలేని స్థితి
మధ్యాహ్నం తర్వాత మరుగుదొడ్లకు నీళ్లు బంద్‌
తాగునీటి కోసం వెలుపలి కేంద్రాలే ఆధారం
రాత్రయితే ఆ కేంద్రాలూ మూసివేత
సర్కారు ఆసుపత్రుల్లో నీళ్ల కష్టాలు
ఈనాడు - హైదరాబాద్‌ (ఈనాడు యంత్రాంగం సహకారంతో)

ప్రచండ భానుడి ప్రభావం సర్కారు దవాఖానాలపైనా పడుతోంది. నీటి ఎద్దడితో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు, సహాయకులు అవస్థల పాలవుతున్నారు. మిషన్‌ భగీరథ కింద అధిక శాతం ఆసుపత్రులకు నీటి  సరఫరా జరుగుతున్నా.. ఎక్కువ చోట్ల మూణ్నాలుగు రోజులకోసారి నీళ్లు వస్తుండడంతో.. దవాఖానాల్లో పూర్తిస్థాయిలో నీటి అవసరాలను తీర్చలేని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రుల్లో బోర్లు ఉన్నా.. భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. చాలా చోట్ల మధ్యాహ్నం తర్వాత  నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో మరుగుదొడ్లకు వెళ్లాలంటే ముక్కుమూసుకొని దుర్గంధాన్ని భరించాల్సిన దుస్థితి దాపురించింది. ఇక తాగునీటి కోసమైతే ఆసుపత్రుల బయట స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటుచేసిన శిబిరాలే శరణ్యం. సర్కారు ఆసుపత్రుల్లో నీళ్ల కష్టాలపై ‘ఈనాడు’ అందిస్తోన్న క్షేత్రస్థాయి పరిశీలనాత్మక కథనం..

తాగునీటికి ఇబ్బందే

ర్కారు దవాఖానాల్లో నీటి నిల్వ చేసే ట్యాంకులున్నా.. ఈ ట్యాంకుల ద్వారా వార్డుల్లోకి నీరందించేందుకు ఏర్పాట్లుచేసినా.. వీటి ద్వారా సరఫరా చేసే నీటిని తాగే పరిస్థితి దాదాపు ఏ ఆసుపత్రిలోనూ లేదు. రూ.లక్షల వ్యయం పెట్టి ట్యాంకులు నిర్మించినా అత్యధిక ఆసుపత్రుల్లో వాటిని నిరంతరం శుభ్రపర్చడం లేదు. దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ తాగునీటిని వేర్వేరు స్వచ్ఛంద సంస్థలే అందజేస్తున్నాయి. ఈ చలివేంద్రాలను కూడా సాయంత్రం మూసేస్తుండడంతో.. ఆ తర్వాత తాగునీటికి బయటికి పరుగులు పెట్టాల్సిందే! ఇప్పటికే అధిక శాతం ఆసుపత్రుల్లో బోర్లలో నీళ్లు అడుగంటిపోగా.. పురపాలక నీటి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. మధ్యాహ్నం తర్వాత మరుగుదొడ్లకు నీటిని నిలిపివేస్తుండడంతో.. అవి దుర్గంధంతో కంపుకొడుతున్నాయి.

నిజామాబాద్‌

నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి రోజు సుమారు 1500 మంది ఔట్‌ పేషంట్లు వస్తుంటారు. 500 మంది రోగులు ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతారు. రోగులకు సహాయకులుగా మరో 500 మంది ఆసుపత్రిలో ఉంటారు. సుమారు 2500 మంది ఉండే ఈ పెద్దాసుపత్రిలో తాగునీటికి కటకట నెలకొంది. మూడు బోర్లలో ఒకటి మాత్రమే పనిచేస్తోంది. నగరపాలక సంస్థకు చెందిన నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటిశుద్ధి కేంద్రానికి సరఫరా చేసే బోరు కూడా పనిచేయకపోవడంతో పక్కనే ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌ బోరు నీటిని ఉపయోగించుకుంటున్నారు. ఆసుపత్రిలో రూపాయికి లీటరు బాటిల్‌ నింపి ఇచ్చే ప్రైవేటు నీటి కేంద్రం వద్ద రోగులు తాగునీటిని కోనుగోలు చేస్తున్నారు. గుక్కెడు నీటి కోసం రోగుల కుటుంబ సభ్యులు రోజూ పలుసార్లు ఏడంతస్తులు దిగి, ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మరుగుడొడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది.

సంగారెడ్డి
100 పడకల జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గత నెల రోజుల నుంచి తాగునీటి సరఫరా లేకపోవడంతో రోగులు, సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. బయట నుంచి నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. నీటి ఎద్దడి కారణంగా పడకలపై దుప్పట్లు కూడా సరిగ్గా ఉతకడం లేదు.

గాంధీ ఆసుపత్రి

గాంధీ ఆసుపత్రిలో మంచినీటి కోసం ఇన్‌పేషెంట్‌ బ్లాక్‌పై ఆరు పైట్యాంకులను ఏర్పాటుచేశారు. మిగతా ప్రాంతాల్లో ఐదువేల లీటర్ల సామర్థ్యం కలిగిన 18 సింటెక్స్‌ ట్యాంకులను కూడా ఏర్పాటుచేశారు. వీటి ద్వారా ఓపీ, ఇన్‌పేషెంట్‌ వార్డులతోపాటు మిగతా ప్రాంతాలకు మంచినీరు సరఫరా జరిగేలా నల్లాలను ఏర్పాటుచేశారు. అయితే వీటిని కొందరు తరచూ ఎత్తుకెళ్తుండటంతో వాటి నుంచి సరఫరాను మూసివేశారు. ప్రత్యామ్నాయంగా ప్రతి అంతస్తులో వాటర్‌ఫిల్టర్‌ను ఏర్పాటుచేశారు. వీటిలోనూ అత్యధికం పనిచేయడంలేదు. ఓ స్వచ్ఛంద సంస్థ వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటుచేసింది. ఎనిమిది అంతస్తులతో పాటు, అత్యవసర విభాగంలో ఉండే రోగుల కోసం ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నారు. నిత్యం వచ్చే వేలాదిమందికి అది ఏమాత్రం సరిపోవడంలేదు.

జనగామ

దాదాపుగా రూ.25 కోట్ల వ్యయంతో జనగామలో ప్రారంభించిన 150 పడకల స్థాయి మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో నీటి కరవు ఏర్పడింది. జనగామ పట్ణణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో చంపక్‌హిల్స్‌ గుట్టల మధ్య నిర్మించిన ఈ ఆసుపత్రిలో బోరు బావులు తవ్వినా నీరు పడటం లేదు. దీంతో ఆసుపత్రికి మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అయితే ఒక్కో రోజు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ఆసుపత్రిలో నీటి ఎద్దడి నెలకొంటోంది. తాగునీటి కోసం రోగులు నీటి సీసాలను కొనుగోలు చేస్తున్నారు. ఆసుపత్రికి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసరమడ్ల గ్రామం నుంచి బోరు బావుల ద్వారా ప్రత్యేక పైప్‌లైన్‌ వేస్తేనే శాశ్వతంగా నీటి ఎద్దడి తీరే అవకాశం ఉంది.  ఈ ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్‌కు అందించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

నల్గొండ

నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నిత్యం 550 నుంచి 650మంది వరకు ఇన్‌పేషంట్లు ఉంటారు. వీరితో పాటు రోజూ 450 మంది ఓపీ రోగులకు వైద్యసేవలు అందుతున్నాయి. ఆసుపత్రిలో రెండు బోరుబావులున్నాయి. వాటి నుంచి వచ్చే నీటిని మౌలిక వసతులకు, రోగుల ఇతర అవసరాలకు వాడుతున్నారు. జిల్లా ఆసుపత్రుల్లో కొద్ది రోజుల క్రితం వరకు జలధార వద్ద రూ.1కి లీటరు సరఫరా చేసేవారు. నీటి కొరత కారణంగా జలధారను మూసివేశారు. క్యాజువాలిటీలోని వాటర్‌ ఫిల్టర్‌ చిన్నపాటిమరమ్మతులుచేయక మూలనపడింది. తాగునీటి ట్యాంకుకు నీరు సరఫరా చేయని కారణంగా వృథాగా మారింది. దీంతో రోగులు దుకాణాల్లో రూ.5 చెల్లించి లీటరు నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. సూర్యాపేటలో 350 మంది ఐపీ రోగులు, 300 మందికి పైగా ఓపీ రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి. ఇక్కడ కూడా ఏ స్థాయిలో తాగునీరు, మౌలిక వసతులకు ఉపయోగించే నీరు 50 శాతానికి మించి సరిపోవడం లేదు. ఇక్కడ ఓపీ సేవల సమయాల్లో మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు.

ఆదిలాబాద్‌

నిత్యం 600 మంది రోగులు చికిత్స పొందే రిమ్స్‌ వచ్చిపోయే సహాయకులు, బయటి రోగులతో కలిపి దాదాపు రోజూ 2 వేల మందితో కిటకిటలాడుతుంటోంది. ఆసుపత్రి ఆవరణలో 17 బోరు బావులున్నప్పటికీ..అయిదు మాత్రమే నీటిని అందిస్తున్నాయి. ప్రస్తుతం పురపాలక సంఘం వారు రోజూ లక్షన్నర లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో అల్‌మెవా మైనారిటీ సంస్థ ఏర్పాటుచేసిన నీటి శుద్ధ పరికరంపైనే రోగులు, సహాయకులు ఆధారపడాల్సి వస్తోంది. అత్యవసర విభాగం ముందు చలివేంద్రాన్ని ఏర్పాటుచేసినా.. మధ్యాహ్నం వరకు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. కేవలం అక్కడే దాహం తీర్చుకోవటానికి నీళ్లను అందిస్తున్నారు. రోగుల కోసం సీసాల్లో తీసుకెళ్లటానికి నిరాకరిస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బయటినుంచి తాగునీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది.

నీటి ఎద్దడిపై సమీక్షించాం
బోధనాసుపత్రుల్లో నీటి కొరత లేకుండా ఇప్పటికే చర్యలు తీసుకొన్నాం. వేసవిలో నీటిఎద్దడిని ఎదుర్కోవడంపై సమీక్ష నిర్వహించాం. ఉస్మానియాలో ఇటీవలే నీటిశుద్ధి పరికరాన్ని కొత్తగా ఏర్పాటుచేశాం. కొన్ని ఆసుపత్రుల్లో మరమ్మతులకు గురైన వాటిని బాగుచేయించాం. రోగులకు, సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లుచేయాలని ఆదేశాలు జారీచేశాం. మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో కొందరు నీటిని వృథాగా వదిలేస్తున్నారు. ఈ విషయంలో రోగులు, సహాయకులు కూడా
పొదుపుగా వాడుకొని సహకరించాలి.

-డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, వైద్యవిద్య సంచాలకులు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.