close

ప్ర‌త్యేక క‌థ‌నం

శత్రువుకు శత్రువు మిత్రుడు

వైరాన్ని బట్టి పార్టీల వ్యూహం
బెంగాల్‌లో భాజపాకు వామపక్ష శ్రేణుల మద్దతు?
మమతను దెబ్బతీయడమే లక్ష్యం
యూపీలో బీఎస్పీని నష్టపరిచేందుకు ఎస్పీకి కాంగ్రెస్‌ సాయం
రాజీవ్‌ రాజన్‌, ఈనాడు - దిల్లీ

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరు. తమ పార్టీ మనుగడ, ప్రయోజనాల కోసం ఇతర రాజకీయపక్షాల ప్రయోజనాలను దెబ్బతీయడానికి రాజకీయ పార్టీలు వైరిపక్షాలతో చేతులు కలపడం సర్వసాధారణం. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్‌లో తమ ఉమ్మడి శత్రువైన మమతా బెనర్జీని నష్టపరిచేందుకు భాజపా, వామపక్షాలు క్షేత్రస్థాయిలో సహకరించుకుంటున్నాయి. కాషాయ పార్టీపై కత్తులు దూసే కమ్యూనిస్టులు ఇలా సహకరించడం విశ్లేషకుల్ని విస్మయపరుస్తోంది. మరోపక్క ఉత్తర్‌ప్రదేశ్‌లో తమ పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారిన బహుజన్‌ సమాజ్‌పార్టీ(బీఎస్పీ)ని బలహీనపరచేందుకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి కాంగ్రెస్‌ పరోక్షంగా సహకరిస్తోంది. దీనిపై ఎస్పీ మిత్రపక్షం బీఎస్పీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది.

భాజపాకు అయాచిత వరం
పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భాజపాకు కొన్ని నియోజకవర్గాల్లో సీపీఎం కార్యకర్తలు మద్దతిస్తుండడం కాషాయదళానికి అయాచిత వరంగా మారింది. ఈ రెండు పార్టీలకు ఉమ్మడి శత్రువు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ కావడం దీనికి కారణంగా ఉంది. నిజానికి పశ్చిమబెంగాల్‌లో కిందస్థాయి వామపక్ష శ్రేణులు అధికార పక్షం వేధింపులతో విసుగు చెందిపోయారు. దీంతో వారు మమతకు గట్టి ఝలక్‌ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎదుగుతున్న కమలనాథులకు సహకరించేందుకు సిద్ధమయ్యారు.

అలిఖిత ఒప్పందం
ఉత్తర కోల్‌కతా నియోజకవర్గంలో 1,862 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. ఇక్కడ తృణమూల్‌ తరఫున సుదీప్‌ బందోపాధ్యాయ బరిలో ఉన్నారు. భాజపా తరఫున రాహుల్‌ సిన్హా పోటీ చేస్తున్నారు. బందోపాధ్యాయను ఇంటికి సాగనంపుతామంటున్న భాజపాకు ఇక్కడ గల కార్యకర్తల సంఖ్య సుమారు 500. ఈ నేపథ్యంలో భాజపాకు సహకరించేందుకు సీపీఎం శ్రేణులు ముందుకు రాగా కాషాయదళం సరేనంది. భాజపా పోలింగ్‌ వ్యవహారకర్తలు వారితో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ నినాదాలు లేకుండా, నిశ్శబ్దంగా ఇంటింటి ప్రచారాలపై వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల రోజున భాజపాకు ఏజెంట్లు లేని బూత్‌ల్లో నిఘా నిమిత్తం 2 పక్షాల మధ్య అలిఖిత ఒప్పందం కుదిరింది.

ఆత్మహత్యా సదృశం
బెంగాల్‌లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై సీపీఎం అగ్రనాయకుల్లో కొందరు కలవరపాటుకు గురవుతున్నారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్‌లో ప్రచారం సందర్భంగా ఆయన పార్టీకి పంపిన సందేశంలో ‘‘తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి భాజపాను ఎంచుకునే తప్పు చేయ్యొద్దు. త్రిపురలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వారికి మద్దతు పలకడం భయంకరమైన తప్పిదం. అది ఆత్మహత్యాసదృశం’’ అని హెచ్చరించారు.

మమత హెచ్చరికలు
సీపీఎం సహకారం భాజపాకు అందుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ తన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. ‘‘సీపీఎం కార్యకర్తలు మన శత్రువులకు సహకరిస్తున్నారు. అత్యంత జాగ్రత్తతో వ్యవహరించండి’’అని ఆమె తన ర్యాలీల్లో టీఎంసీ కార్యకర్తలనుద్దేశించి పేర్కొంటున్నారు.


యూపీలో ఎస్పీకి కాంగ్రెస్‌ సాయం!

త్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌-బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)ల మధ్య ప్రేమ-ద్వేషం తరహా ఎత్తులు-పై ఎత్తులు చోటు చేసుకుంటున్నాయి. వివిధ లోక్‌సభ స్థానాల్లో ఎస్పీకి లోపాయికారిగా కాంగ్రెస్‌ సహకరిస్తూ, బీఎస్పీకి నష్టం కలిగిస్తోంది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు యూపీ వెలుపలి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు బీఎస్పీ గండి కొడుతోంది. ఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో బలహీన అభ్యర్థుల్ని కాంగ్రెస్‌ నిలబెట్టింది. అదే బీఎస్పీ అభ్యర్థులు బలంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్‌ బలమైనవారినే నిలబెట్టింది. దళితులు, ముస్లింల ఓట్లకు కోత పెట్టడం దీని ఉద్దేశం. ఈ పరిణామాన్ని ఏనుగు పార్టీ వెంటనే పసిగట్టి.. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, హరియాణా, పంజాబ్‌లలో కాంగ్రెస్‌పై బలమైన అభ్యర్థుల్ని బరిలో దింపింది. వీరు గెలుస్తారా లేదా అనేదాని కంటే కాంగ్రెస్‌ ఓట్లను కొల్లగొట్టేలా చూడడం బీఎస్పీ వ్యూహంగా కనిపిస్తోంది.

* పెద్దగా ఎవరికీ తెలియని డాలీశర్మ, హరేంద్ర అగర్వాల్‌లను గాజియాబాద్‌, మేరఠ్‌లలో ఎంపీ అభ్యర్థులుగా కాంగ్రెస్‌ నిలబెట్టింది. మొరాదాబాద్‌లోనూ ఇంతే. బీఎస్పీ-ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానాలు ఎస్పీకి వెళ్లాయి. వీటిల్లో ఎస్పీకి కాంగ్రెస్‌ పరోక్ష మద్దతు ఉంది.
* బిజ్నోర్‌లో బీఎస్పీ బహిష్కృత నేత నసీముద్దీన్‌ సిద్దిఖీని, శహరన్‌పుర్‌లో పీసీసీ ఉపాధ్యక్షుడు ఇమ్రాన్‌ మసూద్‌ను కాంగ్రెస్‌ నిలబెట్టింది. ఈ రెండు చోట్లా బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆగ్రాలోనూ బీఎస్పీకి కాంగ్రెస్‌ గట్టి పోటీనిస్తోంది. నగీనాలోనూ ఇలాంటి పరిస్థితే.

భాజపా కంటే కాంగ్రెస్సే ముప్పు
బీఎస్పీ ఆధిపత్యాన్ని తగ్గించగలిగితేనే కాంగ్రెస్‌కు యూపీలో మనుగడ ఉంటుందని, అందుకే భాజపా కంటే కాంగ్రెస్‌ అంటేనే మాయావతికి ఎక్కువ అయిష్టమని బీఎస్పీ నేత ఒకరు విశ్లేషించారు. ఎస్పీ తీరు దీనికి పూర్తి విరుద్ధం. యాదవులు, ముస్లింలు, రాజ్‌పుత్‌లలో మంచి బలం ఈ పార్టీకి ఉంది. బ్రాహ్మణులు, ముస్లింలు, దళితుల్లో పట్టు ఉన్న కాంగ్రెస్‌తో జట్టు కట్టడం సౌఖ్యమనేది ఎస్పీ భావన.


మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలోనూ..

తంలో మావోయిస్టులకు ప్రాబల్యం గల జంగల్‌మహల్‌ ప్రాంతంలో వామపక్ష కూటమికి గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ప్రస్తుతం ఇదంతా భాజపాకు మళ్లుతోంది. ఈ ప్రాంతంలోని ఝార్‌గ్రామ్‌, మేదినీపుర్‌ లోక్‌సభ స్థానాలు వామపక్షాలకు కంచుకోటలుగా ఉండేవి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండింటిని తృణమూల్‌ కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆ స్థానాల్లోని ప్రజల్లో అధికార పార్టీపై పెద్ద ఎత్తున అసంతృప్తి నెలకొంది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు విధేయంగా ఉన్నవారికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇలా అసంతృప్తికి లోనైన ఓటర్లంతా గడచిన రెండేళ్లుగా భాజపా దిశగా మళ్లుతున్నారు. ‘‘ఈ పరిస్థితి(కమ్యూనిస్టుల ఓట్లు భాజపాకు మళ్లడం) విషాదకరమైనదే. కానీ వాస్తవం’’ అని ఝార్‌గ్రామ్‌ జిల్లాలోని లాల్‌గఢ్‌ గ్రామానికి చెందిన ఒకప్పటి సీపీఐ(ఎంఎల్‌) మద్దతుదారు మొహిషో మహతో పేర్కొన్నారు. శత్రువు శత్రువు మిత్రుడు అని, అందుకే తానూ భాజపాకే ఓటు వేస్తానని స్పష్టం చేశారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.