close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆరోగ్యానికి రెడ్‌ సిగ్నల్‌

తీవ్రమైన ఎండలో తప్పని విధులు

పైన ఎండ మండిపోతోంది. కింద రోడ్డు కాలిపోతోంది. అదేపనిగా వీస్తున్న వడగాలి ఒళ్లంతా దహించి వేస్తోంది. అయినా కాలు కదపకూడదు. కన్ను మలపకూడదు. అర నిమిషం ఎర్ర సిగ్నల్‌ పడితేనే ఎండలో రోడ్డుమీద వేడి తట్టుకోలేక అల్లాడిపోతాం.. కానీ వారు గంటలపాటు అలా నిలబడాల్సిందే. ట్రాఫిక్‌ విధులు నిర్వర్తించాల్సిందే. రికార్డులు సృష్టిస్తున్న ఎండలకు జనమంతా ఠారెత్తిపోతుంటే ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం జనజీవన స్రవంతి సాఫీగా సాగిపోయేలా.. రాజీ పడకుండా విధులను నిర్వర్తిస్తున్నారు.

ఈనాడు - హైదరాబాద్‌

మామూలు రోజుల్లో పరిస్థితి ఎలా ఉన్నా వేసవికాలం ట్రాఫిక్‌ విధులు నిర్వర్తించడం నిజంగా సవాలే.. గత కొద్దిరోజులుగా విపరీతంగా పెరిగిపోతున్న ఎండల దెబ్బకి జనం కాలు బయట పెట్టేందుకే జంకుతున్నారు. ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లేందుకే ఆపసోపాలు పడుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం గంటల తరబడి నడిరోడ్డుపై నిలబడి ఉంటున్నారు. అసాంఘిక శక్తులతో పోరాడాల్సిన పోలీసులు.. వేసవి వచ్చిందంటే ఎండలతోనూ తలపడాల్సి వస్తోంది. 40 డిగ్రీలు దాటుతున్న ఎండ దెబ్బకి చర్మం చుర్రుమంటోంది. దీనికి వడగాలులు కూడా తోడవడంతో వాతావరణమంతా వేడెక్కుతోంది. మామూలు ఉష్ణోగ్రత కంటే రోడ్డుమీద 1.5 డిగ్రీలు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు ఉంటే ఏదైనా రోడ్డుమీద దీన్ని లెక్కించినప్పుడు 45.5 డిగ్రీలు ఉంటుంది. ఎండకు వేడెక్కిన రోడ్డునుంచి వెలువడే అదనపు వేడే ఇందుకు కారణం. ఇన్ని విపత్కర పరిస్థితుల మధ్య గంటల తరబడి నిలబడే ఉండటంతో ట్రాఫిక్‌ సిబ్బంది ఆరోగ్యంపై వేసవి తీవ్ర ప్రభావం చూపుతోంది.

కాలుష్యం దెబ్బ 
ట్రాఫిక్‌ పోలీసులు ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య కాలుష్యం. ఉదయం 6 గంటలకు విధుల్లోకి వచ్చేవారు మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం 2 కు వచ్చేవారు రాత్రి 8 వరకు రోడ్లపైనే ఉంటారు. అంటే.. గంటలపాటు ట్రాఫిక్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తూనే ఉంటారు. సాధారణంగా ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు (ఉదయం, సాయంత్రం వేళల్లో) ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఏ షిప్టులో ఉన్నప్పటికీ అధిక రద్దీవల్ల కాలుష్యంకాటుకు గురికాక తప్పదు. దీని బారినుంచి తప్పించేందుకు సిబ్బందికి అధికారులు మాస్కులు అందించినా దానివల్ల ఒనగూరుతున్న ఫలితం నామమాత్రమే.

వారాంతపు సెలవులివ్వాలి 

వేసవికాలంలో ట్రాఫిక్‌ విధులు నిర్వర్తించడం చాలా కష్టం. గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి రావడం వల్ల ఎండ వేడిమికి సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ట్రాఫిక్‌ పోలీసులకయినా వారాంతపు సెలవులు ఇవ్వాలి. తద్వారా వారికి కొంత విశ్రాంతి లభిస్తుంది. 45 ఏళ్లు దాటిన వారికి ట్రాఫిక్‌ విధులు అప్పగించకపోవడమే మేలు.

- గోపిరెడ్డి, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు

జాగ్రత్తలు తీసుకుంటున్నాం 

వేసవిలో ఎదురయ్యే సమస్యల దృష్ట్యా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్‌ విదుల్లో పాల్గొనే సిబ్బందికి చల్లటినీరు, మజ్జిగ, గ్లూకోజ్‌ అందిస్తున్నాం. కాలుష్యం నుంచి కాపాడేందుకు మాస్కులు, ఎండ తీవ్రత ప్రభావం కళ్లపై పడకుండా ఉండేలా నల్ల కళ్లద్దాలు కూడా అందజేస్తున్నాం. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం.

- అనిల్‌కుమార్‌, అదనపు కమిషనర్‌, (ట్రాఫిక్‌), హైదరాబాద్‌

నిద్ర పట్టడంలేదు 

ఎండ, వడగాలుల ప్రభావం వల్ల.. విధుల నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత చాలా సేపటి వరకూ నిద్రపట్టడంలేదు. మళ్లీ తెల్లవారుజామునే మెలకువ వస్తోంది. ఎండ ప్రభావం నుంచి రక్షించుకునేందుకు మజ్జిగ, చల్లటి నీళ్లు వంటివి ఇస్తున్నప్పటికీ వాటివల్ల పూర్తి ఉపశమనం కలగడంలేదు.

- రమేష్‌, ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

వేసవిలో ట్రాఫిక్‌ పోలీసులకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు 

అధిక చెమట 
అధిక దాహం 
నోరు తడారిపోవడం 
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 
తలనొప్పి 
కడుపులో మంట 
ఆకలి మందగించడం 
కళ్ల మంటలు, ఎర్రబారడం 
వడదెబ్బ ముప్పు 
విశాలమైన రోడ్లయితే ఎండకు వేడెక్కి వాటి మీదుగా వీచే గాలి మరింత వేడిగా ఉంటుంది. ట్రాఫిక్‌ సిబ్బంది రోడ్ల మధ్యలో నీడ ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఈ వడగాలుల బాధ తప్పించుకునే మార్గం ఉండదు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.