close

ప్ర‌త్యేక క‌థ‌నం

భద్రతకు బాటలు వేద్దాం!

పట్టణ రహదారులకు పునరాకృతి అత్యవసరం
రోడ్డు వెడల్పు 40 అడుగులు ఉంటే ఫుట్‌పాత్‌లు అనివార్యం
పటిష్ట ప్రణాళికతో  భద్రతకు భరోసా
రోడ్డు ప్రమాదాలను నివారించే వీలు
మృతుల సంఖ్య గణనీయంగా తగ్గించే అవకాశం
వాయు కాలుష్య మరణాలనూ తగ్గించవచ్చు
జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ మార్గదర్శకాలు
చెన్నై, పుణెలను ఆదర్శంగా తీసుకోవాలని ఇతర నగరాలకు సూచన
ఈనాడు - హైదరాబాద్‌

మనం నిత్యం ప్రయాణిస్తున్నవి మెరుగైన రహదారులేనా? అసలు వాటికి రోడ్లకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా? తారు, కంకర కలిపి.. లేదంటే కాంక్రీటు పరిచేస్తే రోడ్డు అయిపోతుందా? నిత్యం ఎంతోమందిని బలిగొంటున్న మన రహదారులను మెరుగుపరచాలంటే ఏంచేయాలి? ఈ అంశాలన్నింటినీ అధ్యయనం చేసిన జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. వాటి వివరాలేంటో చూద్దామా...

దేశంలోని పట్టణాల్లో రహదారుల నిర్వహణలో స్పష్టమైన విధానం అమలు కావడం లేదు. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయమూ లేదు. అడ్డగోలు విద్యుత్‌ స్తంభాలు, హెచ్చరికలు లేని రహదారులు, ఫుట్‌పాత్‌లు నిర్మించడంలో కనీస ప్రమాణాలు పాటించకపోవడం, ఉన్న వాటిని రోడ్లలో కలిపేయడం, ఆక్రమించుకోవడం వంటివి ప్రజల భద్రతకు సవాళ్లు విసురుతున్నాయి. పాదచారులు కనీసం 100 మీటర్ల దూరం ఆటంకం లేని ప్రయాణాన్ని సాగించలేని పరిస్థితికి కారణమవుతున్నాయి. ఇక సైకిళ్లపై ప్రయాణం దుర్లభమే. ఇవన్నీ రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఆయా సమస్యలను విశ్లేషించిన జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ (ఎన్‌ఐయూఏ) నగరాల రోడ్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ‘పరిపూర్ణ రోడ్లు, వీధుల’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దేశంలోని అన్ని నగరాల్లో ప్రజలు మోటారు వాహన రహిత ప్రయాణం సాగించేలా రోడ్లను పునర్నిర్మించడం, అన్ని వర్గాలకు అనువుగా వాటిని తీర్చిదిద్దడం దాని ప్రధాన లక్ష్యం. అందుకు అనుగుణంగా ఆ సంస్థ సమగ్రమైన సూచనలు చేసింది.

ఇప్పటికే చెన్నై, పుణె నగరాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని అందరూ అనుసరించాలని మార్గదర్శనం చేసింది. తద్వారా రోడ్డు ప్రమాదాలను 35 శాతం వరకు తగ్గించేందుకు అవకాశముందని వివరించింది. ఈ మేరకు ఈ నెలాఖరులోగా ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరింది. ప్రాజెక్టులు అమలు చేసిన తరువాత వాటి నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను అంచనా వేస్తూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని పేర్కొంది.

ఎన్‌ఐయూఏ ప్రధాన సూచనలివి

* రోడ్ల వెడల్పు ఆధారంగా ఫుట్‌పాత్‌లు, సైక్లిస్టు మార్గాలు నిర్మించి పచ్చదనం పెంపొందించాలి.
* రోడ్డు వెడల్పు 40 అడుగులు దాటితే కచ్చితంగా కనీసం 6-14 అడుగుల వెడల్పుతో ఫుట్‌పాత్‌ నిర్మించాలి. వెడల్పు పెరిగిన కొద్దీ దాన్ని విస్తరిస్తూ పోవాలి.
* ఉపరితల కేబుల్‌ వ్యవస్థను భూగర్భానికి మార్చాలి. తాగునీటి సరఫరా, విద్యుత్తు, కేబుల్‌, మురుగునీటి పారుదలకు వేర్వేరు మార్గాలు ఉండాలి.
* రోడ్లలో ఫుట్‌పాత్‌, పార్కింగ్‌ బే, సైకిల్‌ ట్రాక్‌, బఫర్‌జోన్‌, విక్రయ జోన్లు ఉండాలి. పాదచారులు, వాహనదారులు రోడ్డు దాటేందుకు వీలుగా క్రాసింగ్‌లు, సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలి.
* నగర పరిధిలో వాహనాల వేగాన్ని గంటకు 30 కి.మీ.లకు తగ్గించాలి.
* వీధుల వెంట తగినన్ని వీధి దీపాలు ఉండాలి.
* రోడ్లపై దివ్యాంగులు స్వేచ్ఛగా వెళ్లేలా సదుపాయాలుండాలి.
* రోడ్డు వెంట పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాట్లు చేయడంతోపాటు..ప్రజలు కబుర్లు చెప్పుకునేందుకు వీలుగా బెంచీల వంటివీ ఉండాలి.
* అత్యంత రద్దీ రోడ్లలో పార్కింగ్‌ నిషేధించాలి.
* అన్ని రోడ్లలో కచ్చితంగా క్రాసింగ్‌లు నిర్మించాలి.
* వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సబ్‌వే, ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతాల్లో కాలినడక వంతెనలు ఉండాలి. వీలైనంత వరకు రోడ్డు ఉపరితలం నుంచి క్రాసింగ్‌ల ద్వారా వాటిని దాటాలి.

చెన్నై మారుతోంది

చెన్నై నగర పాలక సంస్థ నగరంలోని 75 కి.మీ వీధులు, రహదారులను ఎన్‌ఐయూఏ మార్గదర్శకాలకు అనుగుణంగా పునర్నిర్మించింది. పాదచారులు, సైక్లిస్టులు రోడ్లపై భద్రంగా తిరిగేలా వాటిని తీర్చిదిద్దింది. నగరంలోని 80 శాతం వీధుల్లో ఫుట్‌పాత్‌లను నిర్మించి, పాదచారులు, సైక్లిస్టుల మరణాలు తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆయా పనులకే నగర బడ్జెట్‌లో 60 శాతం నిధులను ఖర్చు చేస్తోంది. పాఠశాలల జోన్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసింది.

మార్పొచ్చింది
చెన్నై నగరంలోని 900 మీటర్ల పొడవైన హర్రింగ్‌టన్‌ రోడ్డులో తొమ్మిది పాఠశాలలు, రెండు ఆడిటోరియంలు, రెస్టారెంట్లు ఉన్నాయి. పాఠశాల చిన్నారులతో ఆ ప్రాంతం రద్దీగా మారి, ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యేవి. ఫుట్‌పాత్‌ల నిర్మాణం తరువాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది.
* 750 మీటర్ల పొడవైన రాధాకృష్ణ రోడ్డు సమీపంలోని ప్రధాన రోడ్డుకు బైపాస్‌గా ఉపయోగించేవారు. పాదచారులకు మార్గం లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగేవి. ఈ వీధిలో ఫుట్‌పాత్‌ వెడల్పు చేయడంతో ఆ మార్గం ప్రజలు నడిచేందుకు అనువుగా మారింది.

పుణెలో మార్పు మొదలైంది

ప్రజలు సైకిళ్లపై తిరిగేలా పుణె నగర రోడ్లను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆ నగర పాలిక ప్రణాళిక రూపొందించింది. యుద్ధ ప్రాతిపదికన 100 కి.మీ వీధులను స్మార్ట్‌ సిటీకి అనుకూలంగా మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే 27 కి.మీ దూరం రహదారి పునరాకృతి పూర్తయింది. మరో 18 కి.మీ పరిధిలో పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా 1.6 కి.మీ ఆంధ్‌ డీపీ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.22 కోట్లు, జంగలి మహరాజ్‌ రోడ్డులో 1.87 కి.మీ మార్గాన్ని సైక్లిస్టు, పాదచారులకు అనుకూలంగా మార్చే ప్రాజెక్టును రూ.20 కోట్లు ఖర్చు చేసింది. పునరాకృతి చేసిన రహదారుల్లో సైకిల్‌ ట్రాక్‌లు, ప్రజలు కూర్చునేలా ఏర్పాట్లు, వీధి వ్యాపారం, బస్టాపులు, క్రమపద్ధతిలో పార్కింగ్‌ తదితర ఏర్పాట్లు సమకూర్చింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.