close

ప్ర‌త్యేక క‌థ‌నం

ప్రముఖుల భద్రతే వారి పరమావిధి 

ప్రచారంలో నేతల వెంట 2 వేల మందికిపైగా కమాండోలు

దిల్లీ: రెండు వేల మందికిపైగా కమాండోలు.. 120 మంది యువ పర్యవేక్షక అధికారులు. వందలాది తుపాకులు.. వేల కొద్దీ బుల్లెట్లు.. కిలోలకొద్దీ బరువుండే భద్రతా సామగ్రి! వీటికి తోడు వందలాది ఫస్ట్‌-ఎయిడ్‌ కిట్లు, అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్‌ సమాచారం!! 


సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్న రాజకీయ ప్రముఖులను కంటికి రెప్పలా కాపాడేందుకు... జాతీయ భద్రతా బలగాలు నిత్యం మోహరిస్తున్న వనరులివి!! 


ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు ప్రత్యేక భద్రతా బృందం (ఎస్పీజీ) రక్షణ కల్పిస్తుండగా... ఎన్‌ఎస్‌జీ, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ వంటి బలగాలు ఇతర నేతల వెంట ఉన్నాయి. 
మరి ప్రచారంలో పాల్గొంటున్న ప్రముఖ నేతలకు ఈ ప్రత్యేక పోలీసులు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు? ఏ దళం ఎంతమంది భద్రతను పర్యవేక్షిస్తోంది? ఓసారి చూద్దామా...

సీఆర్‌పీఎఫ్‌

దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ బలగం- కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌). జడ్‌ ప్లస్‌ శ్రేణికి చెందిన భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, రవిశంకర్‌ ప్రసాద్‌ తదితర 78 మంది వీఐపీలకు భద్రత కల్పిస్తోంది. అమిత్‌షాపై దాడి జరగవచ్చన్న సమాచారం నేపథ్యంలో సహాయ, డిప్యూటీ కమాండెంట్లనూ రంగంలోకి దించింది. ఆయన రోడ్‌ షోలు నిర్వహించే ప్రాంతాల్లో వీరు ముందుగానే అక్కడికి చేరుకుని భద్రత ఏర్పాట్లు చూస్తారు. ఇలా 54 మంది అధికారులను సీఆర్‌పీఎఫ్‌ క్షేత్రస్థాయిలో మోహరించింది. వీరికి స్థానిక బృందాలు సహకరిస్తున్నాయి. ఏకే శ్రేణికి చెందిన అధునాతన తుపాకులు, ఎంపీ5 రైఫిళ్లు, పిస్తోళ్లు, స్కానర్లతో పాటు ప్రత్యేక పరిస్థితుల్లో జనాన్ని అదుపు చేసేందుకు తాళ్లు, కర్రలు కూడా వీరివద్ద సిద్ధంగా ఉంటాయి. నేతల భద్రతను ప్రతి నిమిషం పర్యవేక్షించేందుకు... నొయిడాలోని సీఆర్‌పీఎఫ్‌ కంట్రోల్‌ రూముతో నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయాన్ని అనుసంధానించారు. మొబైల్‌, వైర్‌లెస్‌ సాంకేతికత ద్వారా ఈ రెండు విభాగాల అధికారులు నిత్యం సంభాషించుకుంటారు.

సీఐఎస్‌ఎఫ్‌

కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) 93 మంది ప్రముఖులకు రక్షణ కల్పిస్తోంది. క్షేత్రస్థాయి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని మరీ నేతలకు రక్షణ కల్పిస్తున్నారీ సిబ్బంది. లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి తలపడుతున్న 12మంది పశ్చిమ బెంగాల్‌ ప్రముఖుల రక్షణ బాధ్యతలను ఈ సంస్థ చూసుకుంటోంది. తమ కమాండో బృందాల అవసరాలను పర్యవేక్షించేందుకు 40 మంది అధికారులను కూడా సీఐఎస్‌ఎఫ్‌ రంగంలోకి దింపింది. భద్రతా సామగ్రితో పాటు, ఆహారం తదితర సదుపాయాలను వీరు కల్పిస్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ (జడ్‌ ప్లస్‌), మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ (జడ్‌), కేంద్ర సహాయమంత్రులు మహేశ్‌శర్మ, మనోజ్‌ సిన్హాలతో పాటు పలువురు భాజపా, తృణమూల్‌ అభ్యర్థులకూ వీరు రక్షణ కల్పిస్తున్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసులను కూడా ఈ సంస్థ నేతల భద్రతకు నియమిస్తుంది. ఇలాంటి బృందాలను ఎస్‌ఎస్‌జీ గ్రూపుగా పిలుస్తుంటారు.

ఎన్‌ఎస్‌జీ

జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) కూడా నేతలకు రక్షణ కల్పిస్తోంది. సంస్థ చరిత్రలోనే తక్కువగా ప్రస్తుతం 13 మంది వీఐపీల భద్రతనే పర్యవేక్షిస్తోంది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ముఖ్యమంత్రులు చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్‌, మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్‌ యాదవ్‌, మాయావతి తదితరుల భద్రతను ఎన్‌ఎస్‌జీ చూస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే తమ సిబ్బందితో సెక్యూరిటీ డ్రిల్స్‌ నిర్వహించింది. ‘బ్లాక్‌ క్యాట్స్‌’గా పిలిచే తమ సిబ్బందికి అత్యాధునిక కమ్యూనికేషన్‌ ఉపకరణాలను, రక్షణ కవచాలను సమకూర్చింది. వీఐపీలు ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లేటప్పుడు... వారు ప్రయాణించే హెలికాప్టర్‌ లేదా విమానం వద్దకు కమాండోలు ముందే చేరుకుని భద్రతను పర్యవేక్షిస్తారు. విడిచివెళ్లే ప్రాంతం (పాయింట్‌ ఏ) వద్ద ఒక బృందం; చేరుకునే ప్రాంతం (పాయింట్‌ బి) వద్ద మరో బృందం భద్రతను పర్యవేక్షిస్తుంది. జనం దాడిచేసినా, బాంబుపేలుళ్ల వంటివి సంభవించినా ప్రముఖులకు అన్ని విధాలా రక్షణ కల్పించేలా ఈ సంస్థ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం విశేషం. 
ఇండో-టిబెటన్‌ పోలీసు బలగాలు కూడా 16 మంది వీఐపీలకు భద్రత కల్పిస్తున్నాయి. జడ్‌ ప్లస్‌ భద్రతా శ్రేణికి చెందిన భాజపా నేత మురళీ మనోహర్‌ జోషి, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి వారి భద్రతను ఈ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.  
కత్తి మీద సాము... 
‘‘ప్రముఖులకు భద్రత కల్పించడం కత్తి మీద సాము లాంటిది. ఏ క్షణం ఎలాంటి రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. భద్రతను పర్యవేక్షించేవారు ప్రతిక్షణం చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఏమరుపాటుగా ఉండి, జరగరానిది జరిగితే... మరో అవకాశమన్నది ఉండదు’’ అని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రముఖులు దేశంలో ఎక్కడికి వెళ్లినా, అక్కడి కమాండోలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తుంటారు. జన సందోహంలో ఎవరైనా నేతలకు హాని తలపెట్టేలా ప్రాంతీయ భాషలో అరుపులు, నినాదాలు చేస్తే స్థానిక కమెండోలు వాటిని అర్థం చేసుకుని తక్షణం భద్రతా వ్యూహాలను అమలుచేస్తారు. నేతలకు ఇతరుల నుంచి హాని కలగకుండా చూడటమే కాదు... దురదృష్టవశాత్తూ వారు ఏదైనా ప్రమాదానికి లోనైనా, ఉన్నట్టుండి నీరసపడినా, కింద పడిపోయినా ప్రథమ చికిత్స అందించేందుకు వీలుగా ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ను నిత్యం తమ వెంట ఉంచుకుంటారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.