close

ప్ర‌త్యేక క‌థ‌నం

మూడేళ్లలో మూసీ ప్రక్షాళన

అదే బాటలో మంజీర, నక్కవాగు
కార్యాచరణ ప్రణాళిక ఖరారు
జూన్‌ నుంచి అమలు
2022 లక్ష్యం
ఈనాడు - హైదరాబాద్‌

కాలుష్యం బారిన పడిన నదీ తీరప్రాంతాలను పునరుజ్జీవింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మూడు నదులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికకు ఇటీవల కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు-సీపీసీబీ) ఆమోదం లభించింది. జూన్‌ నుంచి అమలుచేయనున్నట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి జాతీయ హరిత న్యాయస్థానాని(నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌-ఎన్జీటీ)కి స్పష్టం చేసింది. కాలుష్య తీవ్రత అత్యధికంగా ఉన్న మూసీ నదితో పాటు నక్కవాగు, మంజీరలలో తొలుత పునరుజ్జీవ ప్రణాళికలు అమలవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. నదుల్లో నీటి కాలుష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ హరిత న్యాయస్థానం ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రాష్ట్రాలను ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం సీఎస్‌ అధ్యక్షతన కమిటీ వేసింది. నదులు, ఉపనదులు కలిపి ఎనిమిది కాలుష్యం బారిన పడ్డాయని పేర్కొంటూ ప్రణాళికలు రూపొందించి పంపగా.. సీపీసీబీ ప్రాధాన్య క్రమంలో తొలుత మూడింటిని ఆమోదించింది. కాలుష్య తీవ్రతను బట్టి నదులు, ఉపనదులను ఐదు దశలుగా విభజించారు. మొదటి దశలో మూసీ; రెండో దశలో నక్కవాగు, మంజీర; మూడోదశలో గోదావరితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కర్కవాగు; నాలుగోదశలో మానేరు, కిన్నెరసాని.. ఐదో దశలో కృష్ణా నది ఉన్నాయి.

బీవోడీ ఆధారంగా..
నీటి కాలుష్య లెక్కల్లో నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్‌ కీలకం. లీటరు నీటిలో బీవోడీ 3-4 మిల్లీగ్రాములు దాటితే ప్రమాదం. చేపలు, ఇతర జీవాలు ఆ నీటిలో బతకవు. మూసీలో దాదాపు 10 రెట్లు అధికంగా 30 ఎంజీ ఉండటంతో దీన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకున్నారు. నక్కవాగు, ఆ నీళ్లు కలిసే మంజీరలో 20-30 ఎంజీ ఉండటంతో రెండో ప్రాధాన్యంగా తీసుకున్నారు. ప్రణాళికను పీసీబీతో పాటు పురపాలక, రెవెన్యూ శాఖలు అమలుచేయనున్నాయి. మూసీ.. దేశంలో అత్యంత కలుషిత నదుల్లో నాలుగోది. వికారాబాద్‌ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణాలో కలుస్తుంది. హైదరాబాద్‌ చేరుకున్నాక పారిశ్రామికవాడల నుంచి వచ్చే వ్యర్థాలు, మురుగుతో ఎక్కువ కాలుష్యం బారిన పడింది. మూసీ పునరుజ్జీవానికి రూపొందించిన మూడేళ్ల కార్యాచరణను జూన్‌ నుంచి ఆయాశాఖలు అమలుచేయబోతున్నాయి.

నక్కవాగు-మంజీర 2022 మే నాటికి
పటాన్‌చెరు నుంచి మొదలయ్యే నక్కవాగు ఇస్మాయిల్‌ఖాన్‌పేట వద్ద మంజీరలో కలుస్తుంది. పాత మెదక్‌ జిల్లాలో పరిశ్రమల వ్యర్థాలతో ఈ వాగు తీవ్ర కలుషితంగా మారింది. కామన్‌ ఎఫ్లుయంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట ఏర్పాటుతో అక్కడ వ్యర్థాలను శుద్ధి చేసి పైప్‌లైన్‌ ద్వారా బాలానగర్‌ వరకు పంపిస్తున్నారు. మూసీ మాదిరిగానే నక్కవాగు, మంజీర పునరుజ్జీవానికి రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ నుంచి కార్యచరణ ప్రణాళిక అమలుచేయబోతుంది. 2022 మే నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కార్యాచరణ ఇలా..
* అనుమతుల్లేకుండా నడుస్తున్న పరిశ్రమలు..  ఎఫ్లుయంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు లేని పరిశ్రమలు, ఉన్నా వాడనివాటిపై, ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు.
* పరివాహక ప్రాంతంలో జిల్లాల వారీగా కాలువల ద్వారా వచ్చి కలిసే మురుగు ఎంత.. అందులో కాలుష్యం ఎంత.. మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఎక్కడెక్కడ అవసరమో గుర్తించడం.
* తీర ప్రాంతంలో ఇరువైపులా ఉన్న గ్రామాల్లో భూగర్భజలాలు, ఉపరితల జలాల స్వచ్ఛతను పరిశీలించడం.
* వర్షాలు, వరదల సమయాల్లో బయటినుంచి వచ్చే ఇసుక, మట్టితో పూడికపెరిగి లోతు తగ్గుతుంది. కలుషిత జలాలు బయటకు వస్తాయి. దీన్ని అడ్డుకునేందుకు నదికి ఇరువైపులా మొక్కలు పెంచడం.
* ఆక్రమణలు నివారించడం.
* మురుగునీటి శుద్ధి కేంద్రాలు అదనంగా ఎక్కడెక్కడ కావాలో.. జూన్‌-సెప్టెంబరు వరకు గుర్తించడం.
* కలుషిత జలాల్ని తీసుకెళ్లే కాలువలకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక నవంబరు-ఫిబ్రవరి నాటికి తయారీ.
* 2020 ఆగస్టు నాటికి టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనుల అప్పగింత.
* 2022 ఫిబ్రవరి నాటికి మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం.
* 2022 మార్చి-మే నాటికి ప్రణాళిక అమలు తర్వాత తుది నివేదిక రూపకల్పన.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.