close

ప్ర‌త్యేక క‌థ‌నం

జడ్పీలకు పూర్వవైభవం?

ఒకప్పుడు దేదీప్యమానం.. నేడు దయనీయం
  కొత్త పంచాయతీరాజ్‌ చట్టంపై ఆశలు
  జులైలో 21, ఆగస్టులో 2 జడ్పీలు ఆవిర్భావం
  వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం జడ్పీల సంఖ్య 32

ఈనాడు - హైదరాబాద్‌

జిల్లా పరిషత్‌లు ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందేవి. నిత్యం ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, ప్రజలతో కార్యాలయాలు సందడిగా ఉండేవి. గ్రామాల్లో రోడ్లు, మంచినీటి ట్యాంకుల నిర్మాణాలు మొదలుకొని ఉపాధ్యాయుల నియామకాల వరకు అనేక పనులు జడ్పీల ద్వారా జరుగుతుండటంవల్ల ఇటువంటి వాతావరణం ఉండేది. నిధులు లేక క్రమేణా జడ్పీలు నిర్వీర్యమయ్యాయి. జడ్పీ ఛైర్లన్లు, జడ్పీటీసీ సభ్యులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో జులైలో 21, ఆగస్టులో 2 జడ్పీలు ఆవిర్భవించి వాటి సంఖ్య 32కు చేరబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ఏడాది క్రితం నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని తేవటం.. స్థానిక సంస్థల నిధులపై రాష్ట్ర ఆర్థిక సంఘం ఇప్పటికే మధ్యంతర నివేదికను సర్కారుకు ఇవ్వటం.. 2020, ఏప్రిల్‌ నుంచి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు కానుండటం వంటి పరిణామాలతో జడ్పీలకు మళ్లీ మంచిరోజులు రావొచ్చనే విశ్వాసం స్థానిక నేతల్లో ఏర్పడుతోంది.

పంచాయతీరాజ్‌ సంస్థలను ప్రాంతీయ స్వయంపాలక సంస్థలుగా తీర్చిదిద్దటం కోసం కేంద్ర ప్రభుత్వం 1992లో భారత రాజ్యాంగానికి 73వ సవరణను తెచ్చింది. రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 11లో పేర్కొన్న పలు అంశాలను పంచాయతీరాజ్‌ సంస్థలకు అప్పగించింది. ఇందుకు అనుగుణంగా సమైక్య రాష్ట్ర ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి 1994లో గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల ప్రజాపరిషత్‌, జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్‌లను ఒక చట్టం ద్వారా తెచ్చింది. కాలక్రమేణా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలపై మాత్రమే ఎక్కువ దృష్టి సారించి మండల, జిల్లా స్థాయి పంచాయతీలను పక్కన పెడుతూ వచ్చాయి. మరో వైపు..  14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అగ్గిమీద ఆజ్యం పోసినట్టుగా చేశాయి. దీని సిఫార్సులు 2015 ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చినప్పటి నుంచి జిల్లా, మండల పరిషత్‌లకు దిల్లీ నుంచి నిధులు పూర్తిగా నిలచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వమూ వాటికి ప్రత్యేకంగా సాయమంటూ ఏమీ చేయటం లేదు. దీంతో ఒకప్పుడు వెలుగొందిన జడ్పీలు ఇప్పుడు నిధుల కోసం చేయిచాచాల్సిన దుస్థితి ఏర్పడింది.

 ఆశలు రేకెత్తిస్తున్న కొత్త చట్టం
* తెలంగాణ సర్కారు అమల్లోకి తెచ్చిన పంచాయతీరాజ్‌ నూతన చట్టం స్థానిక నేతల్లో మళ్లీ ఆశలు చిగురింపజేస్తోంది. కొత్త చట్టం చెప్పే కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
జిల్లాలో అభివృద్ది, సేవా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలపై జడ్పీలు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లకు పనులను ఇవ్వటంతో పాటు వాటిని సమన్వయపర్చటంపై,  ప్రభుత్వ ఉత్తర్వులను అమలుపర్చటంపైనా సలహాలు ఇవ్వొచ్చు.
* మాధ్యమిక, వృత్తి విషయక, పారిశ్రామిక పాఠశాలలను నెలకొల్పటం, నిర్వహించటం లేదా  విస్తరించటం. అంకుర, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ పరిశ్రమల పర్యవేక్షణ. పార్కులు, ఆటస్థలాలు, స్టేడియంల ఏర్పాటు, వాటి నిర్వహణ. వయోజన విద్య, ఖాదీ గ్రామీణ పరిశ్రమల కార్యకలాపాల పర్యవేక్షణ.
రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన వ్యవసాయం, చిన్నతరహా నీటిపారుదల, పశుసంవర్ధకం, సామాజిక అడవులు, తాగునీరు, రోడ్లు, భవనాలు, వైద్యం, పారిశుద్ధ్యం, కుటుంబ సంక్షేమం, ప్రజాపంపిణీ తదితర 29 అంశాలపైన అజమాయిషీ అధికారాలను ప్రభుత్వం అప్పగించవచ్చు.
జీవ వైవిధ్య కార్యకలాపాలు చేపట్టడం, ఈ-సేవా కేంద్రాలను ప్రోత్సహించటం, నిర్వహించటం. ఉపాధి హామీ పనులకు సంబంధించి మండల బడ్జెట్‌ను ఆమోదించటం, పర్యవేక్షించటం. మండల పరిషత్‌ కార్యకలాపాల పర్యవేక్షణ. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందేలా చూడటం, వాటి  ఉపాధి అవకాశాలు మెరుగుపర్చటం.
ప్రభుత్వ ఆమోదంతో జిల్లాలోని మండల పరిషత్‌ నిధుల నుంచి వాటా విరాళాలు వసూలు చేయటం. రుణాలనూ సేకరించటం. మండల పరిషత్‌ బడ్జెట్లను పరిశీలించి ఆమోదించటం. మండలాల ప్రణాళికలను ఏకీకరించి జిల్లా స్థాయి ప్రణాళిక తయారు చేయటం.

ఇంతవరకు ఇదీ పరిస్థితి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు అందక, సొంత రాబడులు లేక గత నాలుగున్నరేళ్లుగా జడ్పీలు సతమవుతున్నాయి. మొత్తం తొమ్మిది ఉమ్మడి జడ్పీల్లోనూ అయిదు జడ్పీలకు రాష్ట్రం నాలుగేళ్లలో ఇచ్చిన పైకం కేవలం రూ.181 కోట్లు మాత్రమే. స్టాంపు డ్యూటీలో వాటాలు, సీనరేజి, తలసరి గ్రాంటులు, ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు వంటి వాటి రూపేణా రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిధులను ఇస్తూ ఉంటుంది. ఇలా అరకొరగా అందుతున్న నిధులు సిబ్బంది జీతాలకు, రోడ్లు, భవనాల నిర్వహణ వంటి వాటికే సరిపోతున్నాయి. గతంలో మాదిరిగా సొంతగా ఏవైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలంటే జడ్పీల వద్ద పైకమే ఉండటంలేదు. ఇక జడ్పీల సొంత రాబడులూ పెద్దగా ఉండటంలేదు. రంగారెడ్డి జడ్పీకి 2017-18లో సొంత రాబడి కేవలం రూ.3 వేలు మాత్రమేనని ఇటీవల సెస్‌ (ఆర్థిక, సామాజిక అధ్యయనాల సంస్థ)  విశ్లేషణలో బయటపడింది.

త్వరలో అంగన్‌వాడీలు జడ్పీ పరిధిలోకి?
ప్రాథమిక విద్య, అంగన్‌ వాడీల పర్యవేక్షణ బాధ్యతలను ముఖ్యమంత్రి త్వరలో జడ్పీలకు అప్పగించే అవకాశం ఉన్నట్టు పంచాయతీరాజ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత చట్టంలోనూ కొన్ని సవరణలు తేవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

రాష్ట్ర ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక
పంచాయతీరాజ్‌ సంస్థలకు నిధులను ఏమేరకు ఇవ్వాలో సూచిస్తూ రాజేశం గౌడ్‌ నేతృత్వంలో ఏర్పాటైన రాష్ట్ర ఆర్థిక సంఘం ఇటీవల ఒక మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. కొత్త జడ్పీలు ఏర్పాటయ్యాక ఈ నివేదికలోని సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది.

నిధులు వచ్చే అవకాశాలివి
* జడ్పీలకు కేటాయించిన కేంద్ర లేదా రాష్ట్ర నిధులు.
కుటీర, గ్రామీణ పరిశ్రమలు వంటి వాటి కోసం కేంద్ర సంస్థల నుంచి అందే నిధులు
రాష్ట్ర పన్నులు, ఫీజుల్లో నిర్దేశిత వాటాలు. ఏదైనా శాసనం ద్వారా జడ్పీ రాబట్టే పన్నులు, ఫీజులు
ధర్మాదాయాలు, ట్రస్టుల నుంచి ఆదాయం. మండల పరిషత్‌లు లేదా ప్రజల నుంచి ఏరూపంలోనైనా వచ్చే చందాలు, విరాళాలు
నిర్దేశితరేటులో ప్రభుత్వంనుంచి వచ్చేవార్షిక గ్రాంటు

నిధుల్లేక నీరసం

‘14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల జడ్పీలు చాలా నష్టపోయాయి. నిధులు అందకపోవటంతో పనులేవీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నాయి. రాష్ట్రాలకు పన్నుల్లో వాటాలను పెంచామనే కారణాన్ని చూపిస్తూ బీఆర్‌జీఎఫ్‌ నిధులనూ కేంద్రం నాలుగేళ్లుగా ఇవ్వటం లేదు. రాష్ట్రంలోని పరిస్థితిని 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌కు వివరించాం. గతంలో మాదిరిగా వాటాలు ఉండాలని విజ్ఞప్తి చేశాం. ఆయన తన సిఫార్సుల్లో తప్పకుండా జడ్పీల అంశాన్ని తప్పక ప్రస్తావిస్తారని ఆశిస్తున్నాం.
- తుల ఉమ, తెలంగాణ జడ్పీ ఛైర్‌పర్సన్ల సంఘం
సమన్వయ కర్త (కరీంనగర్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌)

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.