close

ప్ర‌త్యేక క‌థ‌నం

మెరికలపైనే మక్కువా!

‘పది’లో గ్రేడ్‌ పాయింట్లకే ప్రాధాన్యమిస్తున్న అధికారులు
సాధారణ విద్యార్థులపై తగ్గిన శ్రద్ధ
పురపాలక పాఠశాలల్లో రాష్ట్ర  సరాసరి కంటే తక్కువ ఉత్తీర్ణత
ఈనాడు - అమరావతి

పురపాలక పాఠశాలల్లో 10 గ్రేడ్‌ పాయింట్లపై దృష్టిపెడుతున్న అధికారులు వెనుకబడుతున్న విద్యార్థులను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 94.88% కాగా పురపాలక పాఠశాలల్లో ఉత్తీర్ణత 90.35%గా ఉంది. అంటే రాష్ట్ర సరాసరి కంటే 4.53% ఉత్తీర్ణత తక్కువ. ఈ బడుల్లో చదువుతున్న 9.65% మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. తరగతిలో బాగా చదివే వారి కోసం ప్రత్యేకంగా అడ్వాన్సుడ్‌ ఫౌండేషన్‌ కోర్సుల(ఏఎఫ్‌సీ)ను అందిస్తున్నారు. కానీ సాధారణ విద్యార్థులపై పర్యవేక్షణ కొరవడుతోంది. 10 గ్రేస్‌ పాయింట్లు, ఏ1 గ్రేడ్‌ల కోసం తాపత్రయపడుతున్న అధికారులు తరగతిలో వెనుకబడుతున్న వారిపై దృష్టిపెట్టడం లేదు. సాధారణ విద్యార్థుల కోసం కెరీర్‌ ఫౌండేషన్‌ కోర్సులు అందిస్తున్నా ఇది పెద్దగా సత్ఫలితాలు ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో బోధన సాగుతున్నా మెరికల్లాంటి వారిపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. వేసవిలో జ్ఞానధార కార్యక్రమం కింద పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నా ఇవి ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. విజయవాడలో 28 పాఠశాలలకు చెందిన విద్యార్థులకు మూడు చోట్ల, గుంటూరులో 10 పాఠశాలలు ఉండగా రెండు చోట్ల, ఏలూరు, ఒంగోలు నగరపాలక సంస్థలో ఒక్కోచోట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక్కోచోట వందమందికి పైగా విద్యార్థులు ఉంటున్నారు. వీరికి పాఠాలు సక్రమంగా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఇదీ పరిస్థితి..
పట్టణాలు, నగరాల్లోని పురపాలక పాఠశాలలకు ఆదరణ బాగా ఉంటోంది. ప్రవేశాలు ఎక్కువగానే ఉంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 రకాల పాఠశాలల యాజమాన్యాలు ఉండగా.. వీటిలో పురపాలక యాజమాన్యం ఈసారి 10వ స్థానంలో నిలిచింది. గతేడాది తొమ్మిదో స్థానంలో ఉండగా ఒక మెట్టుకు కిందకు పడిపోయింది. మొత్తం విద్యార్థుల్లో 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించిన వారు 1.61% మంది మాత్రమే ఉన్నారు. ఇతర యాజమాన్యాలతో పోల్చితే ఐదో స్థానం దక్కింది.

అనుత్తీర్ణులకు ప్రత్యేక తరగతులేవీ..!
పురపాలక పాఠశాలల్లో చదువుతున్న వారిలో 2,413 మంది అనుత్తీర్ణులయ్యారు. వీరికి ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రత్యేకంగా అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ నిర్వహిస్తోంది. జూన్‌ 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈలోపు అనుత్తీర్ణులైన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. పట్టణం, నగరాల్లో పురపాలక పాఠశాలలకు వచ్చే వారు ఎక్కువగా పేదలే. ప్రతి విద్యార్థి జీవితాన్ని మలుపుతిప్పేది పదోతరగతి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో సాధారణ, చదువులో వెనుకబడే వారిపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంత్తైన ఉంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.