close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఎగ్జిట్‌పోల్స్‌లో నిజమెంత? 

ఒకరిద్దరి అంచనాలే వాస్తవాలకు దగ్గర 
రేపు సాయంత్రం తాజా ఎగ్జిట్‌పోల్స్‌ 
ఈనాడు, దిల్లీ

2004 లోక్‌సభ ఎన్నికలు  
‘భారతదేశం వెలిగిపోతోంది’ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారం చేపడుతుందని 2004లో అన్ని ఛానళ్ల ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పాయి. ఫలితం అందుకు విరుద్ధంగా వచ్చింది.
2009లో...  
ఈసారీ అన్ని ఛానళ్లు ఎన్డీయే, యూపీయే కూటమికి దాదాపు సమానంగా సంఖ్యాబలం ఇచ్చాయి. యూపీయేకు అంచనాలకు మించి సీట్లురాగా, ఎన్డీయేకి బాగా తగ్గిపోయాయి.
2014లో..  
ఎన్డీయే కూటమి గెలుస్తుందని అన్ని ఛానళ్లు చెప్పినా.. భాజపాకు 282 సీట్లు వస్తాయని ‘టుడేస్‌ చాణక్య’ తప్ప మరే ఎగ్జిట్‌పోల్‌ అంచనా వేయలేకపోయింది. ఆ సంస్థ ఒక్కటే ఎన్డీయే కూటమికి 326-354 మధ్యలో సీట్లు వస్తాయని చెప్పగా 336 సీట్లు వచ్చాయి. యూపీయే కూటమి అంచనాను కూడా అది దాదాపు కచ్చితంగా లెక్కేసింది. మిగతావన్నీ ఈ విషయంలో విఫలమయ్యాయి.

న్నికల ఘట్టం చివరిదశకు చేరుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆదివారం వివిధ ప్రసార మాధ్యమాలు వెలువరించే ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలపైకి మళ్లింది. ఈ అంచనాలు నిజమే అవుతాయా? ఎన్నికల ఫలితాలను అవి కచ్చితంగా చెప్పగలవా.. అంటే మిశ్రమ సమాధానమే వస్తుంది. 
ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు 
2017లో జరిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అంచనాలోనూ అన్ని ఛానళ్లూ విఫలమయ్యాయి. ఆ ఎన్నికల్లో భాజపాకు 251-279 మధ్య సీట్లు వస్తాయని ఇండియాటుడే-సిసిరో, 289 సీట్లు వస్తాయని టుడేస్‌ చాణక్య అంచనావేశాయి. వాస్తవ లెక్క 325తో పోలిస్తే ఈ అంచనాలే దగ్గరగా ఉన్నాయి. సీఓటర్‌ (161), ఏబీపీ-సీఎస్‌డీఎస్‌ (170), న్యూస్‌ఎక్స్‌-ఎంఆర్‌సీ (185) సర్వేలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. 
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు 
2015 బిహార్‌ అసెంబ్లీ ఫలితాల్లోనూ ఎగ్జిట్‌పోల్స్‌ విఫలమయ్యాయి. ఆ ఎన్నికల్లో లాలు ప్రసాద్‌, నీతీశ్‌ కుమార్‌ కూటమికి 178, భాజపాకు 58 సీట్లు రాగా అన్ని సంస్థలూ భాజపాకు అనుకూలంగా ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. 
దిల్లీలో... 
2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు తప్పాయి. ఆ ఎన్నికల్లో అన్ని సంస్థలూ ఆప్‌ తొలిస్థానంలో ఉంటుందని లెక్కేసినా దానికి అత్తెసరు మెజార్టీ వస్తుందని చెప్పాయి తప్ప 70లో 67 సీట్లు వస్తాయని ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. భాజపాకు 19 - 27 సీట్లు వస్తాయని లెక్క వేయగా చివరకు మూడే దక్కాయి. 
కర్ణాటకలో... 
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఆరు సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ వెలువరించగా మూడింటి అంచనాలే తుది ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. 
గుజరాత్‌లో... 
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ఛానళ్లూ భాజపాకు కనిష్ఠంగా 106, గరిష్ఠంగా 135 దాకా వస్తాయని అంచనావేయగా చివరకు 99 మాత్రమే దక్కాయి. కాంగ్రెస్‌కు 47-75 మధ్య వస్తాయని చెబితే చివరకు 81 దక్కాయి. 
ఛత్తీస్‌గఢ్‌లో.. 
2018 ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో 5 సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ వెలువరించగా ఇండియాటుడే- యాక్సిస్‌ మై ఇండియా సర్వే ఒక్కటే ఫలితాలకు దగ్గరగా ఉంది. కాంగ్రెస్‌కు 55-65 సీట్లు వస్తాయని ఆ సంస్థ అంచనావేయగా 68 దక్కాయి. భాజపాసీట్లు 21-31 మధ్య ఉంటాయనగా 15 వద్దే ఆగింది. 
ఏ ఒక్క సంస్థ ఎగ్జిట్‌పోల్స్‌ అన్నిసార్లూ సరిగా వచ్చిన దాఖలాల్లేవు. ఒక్కోసారి ఒక్కోటి వాస్తవానికి దగ్గరలో ఉంటోంది. మిగతావి దూరంగానో, పూర్తి విరుద్ధంగానో వస్తున్నాయి. గాలి ఉన్నప్పుడు గెలుపుగుర్రాన్ని చెబుతున్న సర్వేసంస్థలు సీట్ల విషయంలో బోర్లాపడుతున్నాయి. రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాల్లో అయిదేళ్లకోసారి ప్రభుత్వం మారడం రివాజు కాబట్టి అక్కడ బాగానే ఊహించాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.