కరోనాకు కివీడ్కోలు
close
కరోనాకు కివీడ్కోలు

కొవిడ్‌-19ను నిర్మూలించిన న్యూజిలాండ్‌
సున్నాకు చేరిన క్రియాశీల కేసులు
విజయంలో యువ మహిళా ప్రధాని జెసిండా ఘనత

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ చరిత్ర సృష్టించింది. యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని జయించింది. ప్రస్తుతం ఆ దేశంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య సున్నా. దేశంలో మిగిలి ఉన్న చివరి కరోనా బాధితురాలు కోలుకున్నట్లు అధికారవర్గాలు సోమవారం ప్రకటించాయి. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్‌ సంతోషం పట్టలేక నృత్యం చేశారు. దేశీయంగా ఇప్పటివరకు అమల్లో ఉన్న నిషేధాజ్ఞలన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని.. పెళ్లిళ్లపైగానీ, క్రీడలపైగానీ ఆంక్షలేవీ ఉండవని స్పష్టం చేశారు.  విదేశీయుల రాకపై దేశ సరిహద్దుల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతాయి. న్యూజిలాండ్‌లో 17 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా వెలుగు చూడలేదు. ఈ 17 రోజుల్లో 40 వేలమందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందరికీ ‘నెగిటివ్‌’ అని వచ్చింది. అయినప్పటికీ మున్ముందు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను ప్రధాని జసిండా నొక్కిచెప్పారు.

ప్రతి రోజూ తొలుత సూర్యోదయాన్ని చూసే దేశం న్యూజిలాండ్‌ ... ఇప్పుడు కరోనా చీకట్లను చీల్చుకుంటూ తొలి ఆశా కిరణంలా నిలవటం ఎంతమాత్రం యాదృచ్ఛికం కాదు. టీకా రాకుండానే కరోనాను కట్టడి చేసిన ఆ సాహసం వెనక ఎంతో కృషి ఉంది.

ప్రజలతో సూటిగా...
మొదట్లో చాలా మంది లాక్‌డౌన్‌ను తేలిగ్గా తీసుకున్నారు. న్యూజిలాండ్‌ ఆరోగ్యమంత్రే తన కుటుంబాన్ని వెంట పెట్టుకొని విహారానికి వెళ్లారు. వెంటనే ఆయన బాధ్యతల్లో కోత విధించిన ప్రధాని ఆర్డెర్న్‌ యావత్‌ న్యూజిలాండ్‌కు గట్టి సందేశం పంపించింది. తొలినాళ్లలోనే వందకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇక్కడే ప్రజల్ని ధైర్యం కోల్పోకుండా నిలబెట్టారు ప్రధాని ఆర్డెర్న్‌! కరోనా ప్రభావాల్ని స్పష్టంగా ప్రజలకు అర్థం చేయించటంలో ఆమె ప్రభుత్వం సఫలమైంది. ‘‘మనం కరోనాపై యుద్ధం చేయటం లేదు. కలసి కట్టుగా నిర్మూలిద్దాం. కష్టాలు రాబోతున్నాయి. కానీ వాటిని అందరికంటే ముందే దాటేద్దాం...  140 కోట్ల జనాభాగల చైనా తన ప్రజలందరికీ కరోనా సోకకుండా చేస్తున్నప్పుడు... 50 లక్షల జనాభాగల మనం ఎందుకు చేయలేం?...’’ అంటూ ప్రతి ఒక్కరికీ సెల్‌ఫోన్‌ ద్వారా సంక్షిప్త సందేశాలు పంపించారు.  మరోవైపు కరోనా పరీక్షల్ని కూడా వేగవంతగా (దాదాపు 3 లక్షలు) నిర్వహించారు. ప్రపంచంలో తలసరి పరీక్షలు ఎక్కువ చేసిన దేశాల్లో న్యూజిలాండ్‌ ఒకటి.

బుడగల ప్రయోగం...
లాక్‌డౌన్‌ వేళ... వారాల తరబడి ఇళ్లకు పరిమితం కావటం... తద్వారా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మానసిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని న్యూజిలాండ్‌ ప్రభుత్వం ముందే బుడగల (బబుల్‌) ప్రయోగం చేసింది. బయటకు వెళ్ళకుండా ఇళ్లలో ఉన్నవారిని బృందంగా (ఓ బబుల్‌) భావించారు. కొద్దిరోజుల తర్వాత... తమకు అతి సమీపంలో ఇలాగే లాక్‌డౌన్‌లో ఉన్న బంధువులో, స్నేహితులో ఉంటే వారిని కలవటానికి అనుమతించారు. అయితే వారు కూడా ఎక్కడికీ వెళ్లని వారై... కరోనాకు దూరంగా ఉన్నవారై ఉండాలి. అలా... ఈ చిన్న బుడగల సమూహాలు కలుసుకోవటానికి అనుమతించటం ద్వారా మానసిక సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అంటే... కరోనా లేనివారితోనే సంబంధం! మునుముందు... ఇదే పద్ధతిని అంతర్జాతీయంగా విమానాల రాకపోకలకు కూడా పాటించబోతున్నారు.


ముందుచూపున్న నాయకత్వం...!

అమెరికాలాంటి అగ్రదేశాల అధిపతులు సైతం కరోనాను అంచనా వేయటంలో తొలినాళ్ళలో తప్పటడుగులు వేసిన వేళ... కేవలం 50 లక్షల జనాభాగల న్యూజిలాండ్‌ దేశ ప్రధాని మాత్రం ఆ తప్పు చేయలేదు. అందరికంటే ముందే రాబోయే విపత్తును తను గుర్తించటంతో పాటు తన యావద్దేశం గుర్తించేలా చేసిన ఘనత న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ కే దక్కుతుంది. 40ఏళ్ళ ఈ యువ మహిళ ముంచుకొస్తున్న మహమ్మారిని ముందే పసిగట్టి... ఫిబ్రవరి 3నే చైనానుంచి రాకపోకలపై నిషేధం ప్రకటించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని