సూది మందు పంపుతామని.. చుక్కలు చూపుతారు!
close
సూది మందు పంపుతామని.. చుక్కలు చూపుతారు!

అత్యవసరంగా రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమాబ్‌ అందిస్తామని మోసం
అంతర్జాలంలో ప్రకటనలతో రూ.లక్షల్లో టోకరా
తస్మాత్‌ జాగ్రత్త అంటున్న సైబర్‌ పోలీసులు
ఈనాడు - హైదరాబాద్‌, నారాయణగూడ - న్యూస్‌టుడే

కరోనా కాలంలో బాధితుల ఆందోళనను వారు సొమ్ము చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో విసిరిన వలలో చిక్కుకున్న బాధితులు విలవిల్లాడుతున్నారు. కరోనా చికిత్సలో అత్యవసరమైన రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమాబ్‌ ఇంజక్షన్లు చేతికి అందిస్తామని నమ్మబలికి మోసానికి తెరలేపుతున్నారు. మీకు ఆ మందులు, ఇంజక్షన్లు అవసరమా?..  చికిత్స పొందుతున్న ఆసుపత్రి వివరాలు, ఆధార్‌ కార్డు వాట్సాప్‌ చేయండి.. ఎంఆర్‌పీ ధరకే, వెంటనే పంపిస్తామంటూ.. సైబర్‌ నేరస్థులు అంతర్జాలంలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండింటికి ఎక్కువ అవసరం ఉండడం,. బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధర ఉండడంతో బాధితులు తేలిగ్గా వారి చేతికి చిక్కుతున్నారు. రూ.లక్షల్లో నగదు బదిలీ చేసుకుని ఫోన్లు ఆపేస్తున్నారు. కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్లు, యూట్యూబ్‌లలో ఈ తరహాలో మోసాలు వెలుగు చూస్తున్నాయి. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని అప్రమత్తం చేశారు. సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్లలో ప్రకటనలను పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

... ఆ వెబ్‌సైట్‌లో
బర్కత్‌పురలో ఓ యువకుడి సోదరుడికి కరోనా సోకింది. అయిదు రోజుల క్రితం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అత్యవసరంగా టొసిలిజుమాబ్‌ సూది మందు కావాలని వైద్యులు సూచించారు. ఎంత ప్రయత్నించినా దొరకలేదు.  స్నేహితుడి సూచన మేరకు ఇండియామార్ట్‌ వెబ్‌సైట్‌లో శోధించగా తొలుత లేదని కనిపించింది. తరవాత రెండు నిమిషాలకే అతడికి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. తాను ఇండియా హెల్త్‌ సైన్సెస్‌ నుంచి మాట్లాడుతున్నానని, తన వద్ద టొసిలిజుమాబ్‌ ఇంజక్షన్లు రెండు డోసులున్నాయని చెప్పాడు. రూ.1.10 లక్షలు పంపితే... రెండు గంటల్లో బెంగళూరు నుంచి విమానంలో పంపుతానని చెప్పాడు. వెంటనే ఆ నగదు బదిలీ చేసినా, సూదిమందు రాలేదు. మోసగాడి ఫోన్‌ ఆపేసినట్లు రావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

...6 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు రూ.24 వేలకు అనడంతో
సికింద్రాబాద్‌ నివాసి ఒకరు కరోనా బారిన పడ్డాడు. పరిస్థితి తీవ్రం కావడంతో రెమ్‌డెసివిర్‌ కావాలంటూ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. మెడికల్‌ షాపుల్లో ఎక్కడా లభించలేదు. ఆయన కుమారుడు వెబ్‌సైట్లు చూస్తుండగా.. లైఫ్‌కేర్‌ సొల్యూషన్‌ వైబ్‌సైట్‌లో ఆరు ఇంజక్షన్లు రూ.24 వేలకే ఇస్తామంటూ ప్రకటన కనిపించింది. అక్కడ పేర్కొన్న ఫోన్‌ నంబరును సంప్రదించగా, ఆరు గంటల్లో పంపుతామని చెప్పాడు. బాధితుడు రూ.50 వేలు బదిలీ చేశాడు. 8 గంటల తర్వాత ఆ నంబరుకు ఫోన్‌ చేయగా ఆపేసి ఉంది.

అసలు నమ్మొద్దు!
-కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ, సైబర్‌ క్రైమ్స్‌

రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమాబ్‌ మందులకు ఏర్పడిన అవసరాన్ని నగదు చేసుకునేందుకు ఇంటికే పంపిస్తామంటూ సైబర్‌ నేరస్థులు ప్రకటనలు పంథా ఎంచుకున్నారు. వీటిని ఇంటికే పంపిస్తామంటూ ఎవరు చెప్పినా నమ్మొద్దు. అవసరార్థులను నమ్మించేందుకు కొందరు కేంద్ర ప్రభుత్వ సంస్థల పేర్లు చెబుతున్నట్లు తెలిసింది. ఇలాంటి వారిని అరెస్ట్‌ చేసేందుకు యత్నిస్తున్నాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని