Corona: మూడోదశలో చిన్నారులకు ముప్పు
close
Corona: మూడోదశలో చిన్నారులకు ముప్పు

వచ్చే అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య అప్రమత్తత అవసరం  
ఇప్పటి నుంచే జాగ్రత్త పడకపోతే కష్టం
ఈ నెలాఖరుకు రెండోదశ తగ్గే అవకాశం
మొదటిదశలో ప్రభుత్వాలు మా సలహాలు విన్నాయి
ఈసారి మేం ముందే చెప్పినా పెడచెవిన పెట్టాయి
‘ఈనాడు’ ముఖాముఖిలో   ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్‌ రవి
ఎం.ఎల్‌.నరసింహారెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

‘మొదటిదశలో 4 శాతం మంది పిల్లలే కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం అది 15 నుంచి 20 శాతం ఉంది మూడోదశలో 85 శాతంమంది పిల్లలే బాధితులుగా ఉంటారు.

‘కరోనా నివారణలో వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మాస్కు, భౌతిక దూరం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం ముఖ్యమని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. దక్షిణాదిలో మే ఆఖరుకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మూడోదశ ప్రారంభం కాకముందే ఎంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయితే అంత మేలు.

‘కరోనా రెండోదశపై ప్రజారోగ్య శాస్త్రవేత్తలు గత నవంబరు ఆఖరులోనే అప్రమత్తం చేశారు. రెండోదశ మరింత తీవ్రంగా ఉంటుందని. కానీ కరోనా వెళ్లిపోయిందనుకుని జనవరి, ఫిబ్రవరిల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మార్చి మొదటి వారంలోనే రెండోదశ ప్రారంభమైంది. ఓ అంచనా ప్రకారం అప్పట్లో మాస్కులు ధరించిన వారిసంఖ్య 30 శాతం కూడా లేదు.

ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్‌ వి.రవి  చెబుతున్న అంశాలివి.. ఆయనతో ‘ఈనాడు’ ప్రతినిధి ఇంటర్వ్యూ పూర్తి పాఠం...
 

సాధారణంగా ఒక దశ తీవ్రత 6 నుంచి 8 వారాలు ఉంటుంది. మొదటి 4 వారాలు పైకి వెళ్లి తర్వాత తగ్గుతుంది. మాస్కులు పెట్టుకోకపోవడం, గుంపులు గుంపులుగా చేరడం, రాజకీయ ర్యాలీలు, కుంభమేళాలు.. అన్నీ కలిసి తీవ్రత పెంచాయి. ఒకేచోట ఎక్కువమంది గుమికూడినపుడు త్వరగా వ్యాపిస్తుంది.

కరోనా మొదటిదశలో నిపుణుల సలహాలు, సూచనలు విన్న ప్రభుత్వాలు రెండోసారి వారి మాటలకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఫలితంగా రెండోదశలో ఐదు రెట్లు ఎక్కువగా కేసులు నమోదు కావడంతోపాటు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూస్తున్నాం. వచ్చే అక్టోబరు నుంచి డిసెంబరు వరకు మూడోదశ పొంచి ఉంది. ఈలోగా వీలైనంత ఎక్కువమందికి టీకాలు వేయాలి. మూడోదశలో పిల్లలపై చాలా ఎక్కువగా ప్రభావం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ వైరాలజిస్టు డాక్డర్‌ వి.రవి అభిప్రాయపడ్డారు. బెంగళూరులోని నిమ్హాన్స్‌ ఆసుపత్రిలో నాలుగు దశాబ్దాలపాటు అనేక పరిశోధనలు చేసిన ఈయన ఇటీవలే పదవీ విరమణ చేశారు. కొత్త వ్యాక్సిన్ల తయారీపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఆప్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నియమించిన కమిటీకి కో-చైర్మన్‌గా, స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ అంతర్జాతీయ సలహా మండలి సభ్యుడిగా, కర్ణాటక కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నోడల్‌ ఆఫీసర్‌గా ఉన్న ఆయన ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు.
రెండోదశ తీవ్రత ఎప్పటిదాకా కొనసాగే అవకాశం ఉంది? మూడోదశ ఎంత తీవ్రంగా ఉంటుందంటారు?  
దక్షిణాది రాష్ట్రాల్లో మే ఆఖరుకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకొంత కాలం కొనసాగవచ్చు. రెండోదశ ఉద్ధృతికి కారణం మనం చేసిన పొరపాట్లే. వచ్చే అక్టోబరు-ఫిబ్రవరి మధ్యలో మూడోదశ ఉంటుంది. మన ప్రజలు, నాయకుల ప్రవర్తనలో మార్పు రాకపోతే, రెండోదశ నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే మరింత తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటాం. కరోనా ఒకసారి వచ్చిపోయింది మళ్లీ రాదనుకోవడానికి లేదు. వైరస్‌ మ్యుటేట్‌Æ అవుతుంటుంది. పూర్తిగా వ్యాక్సిన్‌ తీసుకునేవరకు సోకుతూనే ఉంటుంది. ఒకదశకు ఇంకోదశకు మధ్య 3 నుంచి 5 నెలల వ్యవధి ఉంటుంది. మూడోదశ వచ్చేటప్పటికి 60 నుంచి 70 శాతం మందికైనా టీకాలు వేయగలమేమో చూడాలి. మొదటిదశలో 4 శాతంమంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం 15 నుంచి 20 శాతం.. మూడోదశలో 85 శాతంమంది పిల్లలే బాధితులుగా ఉంటారు. మనదేశంలో చిన్నారుల సంఖ్య సుమారు 20 కోట్లు. రెండుకోట్ల మంది వైరస్‌ బారిన పడి అందులో ఒక శాతంమందికి సీరియస్‌ అయినా రెండు లక్షలమంది. అన్ని ఐసీయూ బెడ్లు ఉన్నాయా? అందుకే ఇప్పటినుంచే దానిపై ఆలోచించాలి. స్కూళ్లు, కాలేజీలు ఎలా నిర్వహించాలి వంటి అంశాలపైనా స్పష్టత ఉండాలి.
గత ఏడాది కాలంలో జరిగిన పరిశోధన వైరస్‌ ప్రవర్తన భవిష్యత్తులో ఎలా ఉంటుందో అంచనా వేయగలిగే స్థితికి వచ్చిందంటారా?
కొవిడ్‌-19 వైరస్‌ కొత్తది. ఇది వచ్చినపుడు అంత మ్యుటేట్‌ అవుతుందని తెలియదు. దీన్ని నిరంతరం స్క్రీమింగ్‌ చేస్తున్నాం. ఈ పనిని దేశంలో పది ల్యాబొరేటరీలు చేస్తున్నాయి. ఇందులో బెంగళూరులోని నిమ్హాన్స్‌ కూడా ఒకటి. ఐదు శాతం నమూనాలను నిరంతరం తెప్పించుకొని పరిశోధన చేస్తున్నాం. ఒకేచోట 50 కేసులు వచ్చాయి, రెండు డోసులు వేసుకున్న తర్వాత కూడా వచ్చింది, ఒక ప్రాంతంలో చాలా తీవ్రంగా ఉంది.. అలాగే విదేశీ ప్రయాణికుల నుంచి కూడా నమూనాలు సేకరిస్తాం. 96 నమూనాలు ఒక బ్యాచ్‌. ఒక స్వీకెన్స్‌ చేయాలంటే 10 రోజులు పడుతుంది. వ్యాక్సిన్‌ పని చేస్తుందా లేదా వంటి అన్ని అంశాలు ఇందులో తేలతాయి. మేము చేసిన పరీక్షల్లో 34 వేర్వేరు వేరియెంట్స్‌ సర్క్యులేట్‌ అవుతున్నట్లు తేలింది. ఇందులో యు.కె. వేరియెంట్‌ 27.5 శాతం ఉంది. కర్ణాటకలో బి.1.36.29 వేరియెంట్‌ వచ్చింది. ఇది కూడా క్రమంగా పెరిగింది. ఏప్రిల్‌ నుంచి మహారాష్ట్ర వేరియంట్‌ బి.1.617 దాదాపు 50 శాతానికిపైగా కనిపించింది స్పైక్‌ ప్రొటీన్‌లో వచ్చిన మార్పుల వల్ల ఇది చాలా ఎక్కువగా వ్యాపించింది. దిల్లీ, పంజాబ్‌లో యు.కె. వేరియెంట్‌ ఎక్కువగా ఉంటే, మహారాష్ట్ర సహా 16 రాష్ట్రాల్లో మహారాష్ట్ర వేరియంట్‌ తీవ్రంగా ఉంది. కొత్త వేరియెంటా.. పాతదా అన్నది కాదు దేనికైనా సంరక్షణ చర్యలు ఒకటే. మాస్కు.. భౌతికదూరం
కొవాగ్జిన్‌ రెండో డోసు 4 నుంచి 6 వారాలు, కొవిషీల్డ్‌ 6 నుంచి 8 వారాల మధ్య వేసుకోవాలని చెప్పారు. 2 వారాల గడువులో ఎప్పుడు వేసుకున్నా దాని ప్రభావం ఒకటేనా లేక ఏమైనా తేడా ఉంటుందా?
ఎలాంటి తేడా ఉండదు. మొదటి డోసు తర్వాత, రెండోడోసు తర్వాత ఏ వ్యాక్సిన్‌కు ఎన్ని రోజుల్లో యాంటీబాడీస్‌ వస్తాయో ప్రయోగాల్లో తేలింది. లండన్‌లో మూడు నెలల తర్వాత రెండో డోసు ఇచ్చారు. రెండో డోసు వేసుకొన్న తర్వాత రెండు నుంచి మూడు వారాల్లో పూర్తి స్థాయిలో యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందుతాయి. ఎక్కువ రోజులు ఆగడం వల్ల మెమెరీసెల్‌కు బూస్టర్‌ అవుతుంది. జనం భయపడాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్‌ తప్పకుండా పని చేస్తుంది. టీకా వేసుకున్నా ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది కాని వాళ్లకు తీవ్రరూపం దాల్చేది తక్కువ. అయితే వారినుంచి ఇతరులకు వ్యాపిస్తుంది. అందుకే వ్యాక్సిన్‌ వేసుకొన్నా మాస్కు తప్పనిసరి. రెండో డోసు కొద్దిరోజులు జాప్యమైనా ఏమీ నష్టం లేదు. మళ్లీ మొదటి డోసు వేసుకోవాల్సిన అవసరం లేదు.  
వ్యాక్సిన్‌కు తీవ్రంగా కొరత ఏర్పడింది. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుంది?
ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తోపాటు వయసులో పెద్దవారికి మొదట ప్రాధాన్యం ఇచ్చారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు ఇవ్వకపోతే ఇప్పుడు రోగులకు వైద్యసేవలందేవి కాదు. అన్ని దేశాలూ ఇలాగే చేశాయి. అంతలోనే రెండోదశ వచ్చింది. వత్తిడి పెరగడంతో 45 ఏళ్లపైబడిన వారికి, తర్వాత 18 ఏళ్లు దాటిన వారికి మొదలుపెట్టాం. ఇందులో ఎన్నికల వ్యూహం ఉందని కూడా కొందరంటారు. నాకైతే తెలీదు. మనదేశ జనాభాలో పిల్లలు పోనూ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 18 ఏళ్లు దాటిన వారికి రెండు డోసులు ఇవ్వాలంటే 200 కోట్ల డోసులు కావాలి. మొత్తం ప్రపంచంలోనే ఇంత ఉత్పత్తి లేదు. ఇప్పుడు ఉత్పత్తి పెంచుతున్నారు. దానికి సమయం పడుతుంది. అందరికీ వ్యాక్సిన్‌ పూర్తయ్యేవరకు మాస్క్‌, దూరం పాటించాల్సిందే.
ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి?
రాష్ట్రాలు నిపుణుల కమిటీలను నియమించుకోవాలి. అందులో వైరాలజిస్టు లేదా మైక్రో బయాలజిస్టు, ప్రజారోగ్య నిపుణులు ఉండాలి. ప్రతిరోజూ ఈ కమిటీ పరిస్థితులను సమీక్షించి సలహాలు ఇవ్వాలి. పరీక్షలు, పాజిటివ్‌ రేట్‌ను పరిగణనలోకి తీసుకొని విశ్లేషించాలి. ఏం చర్యలు తీసుకోవాలో చెప్పాలి. ఒక ప్రాంతంలో కేసులు వస్తే మొత్తం నగరానికి విస్తరించే దాకా ఉండకూడదు. గత సంవత్సరం అలాగే చేశారు. ఈ సంవత్సరం ఏ ప్రభుత్వమూ మా మాట వినలేదు. ఉగాది సమయంలో ఐదు రోజులపాటు వరుసగా సెలవులు వచ్చాయి. కేసులు పెరుగుతునందున బెంగళూరులో లాక్‌డౌన్‌ పెట్టమన్నా. వినలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో!  
కొన్ని రాష్ట్రాల్లో కేసులు తక్కువ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయి. దీనికి కారణమేంటి?
భారత్‌ జనాభాపరంగా చూసినపుడు 30 దేశాలంత. ఒక రాష్ట్రంలో తగ్గితే ఇంకో రాష్ట్రంలో పెరుగుతాయి. కొన్ని రాష్ట్రాలు కేసులను చాలా తక్కువ చేసి చూపిస్తున్నాయి. ఇటీవల ఎన్నికల ర్యాలీల్లో ఎంతమంది గుమికూడారు.. మాస్కులు, భౌతిక దూరం ఏమయ్యాయి? అసలు వేదికలపై ఎంతమంది నాయకులు మాస్కులు పెట్టుకున్నారు. ప్రజలపై ప్రభావం చూపే నాయకులే పాటించకపోతే ఇక ఎవరినంటాం? కరోనా నివారణలో వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మాస్కు, భౌతిక దూరం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం ముఖ్యమని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు.

- ఈనాడు హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని