Covid: మేల్కొనకపోతే మున్ముందు అపారనష్టం
close
Covid: మేల్కొనకపోతే మున్ముందు అపారనష్టం

వ్యాక్సినేషన్‌ వేగవంతం కావాలి
ఈ ఏడాది చివరి వరకూ మాస్కులు ధరించాలి
‘ఈనాడుతో ముఖాముఖి’లో శాస్త్రవేత్తల కమిటీ ఛైర్మన్‌ విద్యాసాగర్‌

కొవిడ్‌ ఉద్ధృతి క్రమంగా తగ్గటం మొదలయ్యాక, మనం ఎంత జాగ్రత్తగా ఉండగలుగుతాం అనేది నిజంగా అగ్నిపరీక్షనని ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.విద్యాసాగర్‌ అభిప్రాయపడ్డారు. క్రితంసారి చేసిన పొరపాట్లు మళ్లీ చేస్తే దాని వల్ల కలిగే నష్టం మున్ముందు అపారంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. కరోనా వ్యాప్తిపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శాస్త్రవేత్తల కమిటీకి విద్యాసాగర్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. మలిదశ (సెకండ్‌ వేవ్‌) మొదలయ్యే నాటికి తగినంత సన్నద్ధత లేనందునే ఆక్సిజన్‌ సిలిండర్లు, పడకలు తదితరాలకు కొరత ఏర్పడి ప్రజలు ఇంతగా ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు. కరోనా తీవ్రత నేపథ్యంలో కమిటీపరంగా చేసిన కృషిని, ప్రస్తుత పరిస్థితిని, భవిష్యత్‌ అంచనాలను ఆయన ‘ఈనాడు’కు వివరించారు.

మీ కమిటీ ఏర్పాటు, పనితీరు గురించి చెప్పండి?
గత ఏడాది జూన్‌లో కేంద్రప్రభుత్వం 10 మందితో కమిటీని నియమించింది. శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. ఇందులో నాతో పాటు ఐఐటీ కాన్పూర్‌కి చెందిన మణీంద్ర అగర్వాల్‌, ఆర్మీ వైద్యాధికారి మాథురీ కనిట్కర్‌ పరిశోధనలో నిత్యం భాగస్వాములవుతున్నాం. మిగిలిన ఏడుగురు కూడా శాస్త్రవేత్తలే. కరోనా విస్తృతి ఎలా పెరుగుతోంది, ఏ ప్రాంతంలో ఎలా ఉండబోతోంది అనేది అంచనా వేయటం కమిటీ పని. ఇందులో అన్ని విభాగాలకు చెందిన నిపుణులున్నారు. నేషనల్‌ కొవిడ్‌-19 సూపర్‌ మోడల్‌ కమిటీ అని దీనికి పేరుపెట్టారు. కొవిడ్‌ తీవ్రతను అంచనా వేస్తూ ప్రభుత్వంలో సంబంధిత వ్యక్తులను మేం అప్రమత్తం చేస్తుంటాం. గత మార్చి మొదటి వారంలో కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితిని చూసి రాబోయే ముప్పును వివరించాం. ఏప్రిల్‌ 2న నివేదిక రూపంలో చివరిసారిగా చెప్పాం.

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా ఉంది. ప్రస్తుతం రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నాలుగు లక్షలకు చేరాయి? ఇంత తీవ్రతను మీరు ఊహించారా?
లేదు. ఊహించనంత వేగంగా ప్రస్తుతం వైరస్‌ విస్తరిస్తోంది. ఎంత జోరుగా అనేది తెలియటం లేదు. చూచాయగా చెప్పగలుగుతున్నాం. ఎంత వేగంగా అది పుంజుకుని శిఖర స్థాయి(పీక్స్‌)కి చేరుతుందో అంతే వేగంగా తగ్గిపోతుందని భావిస్తున్నాం. మా అంచనాల మేరకు త్వరలోనే ఈ తీవ్రత తగ్గిపోయే అవకాశం ఉందనుకుంటున్నాం.

ప్రజలు నియంత్రణ మరచి ఎన్నికలు, కుంభమేళా, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భారీగా పాల్గొన్నారు. వైరస్‌ విస్తృత వ్యాప్తిలో ఇవి ఏ మేరకు ప్రభావం చూపాయి?
మార్చి 8-9 తేదీల్లో మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్‌లలో రెండో వేవ్‌ ప్రవేశించింది. కుంభమేళా ప్రారంభమయ్యే నాటికే వైరస్‌ తీవ్రంగా ఉంది. అదే మూలకారణం కాదు. ఎన్నికల ప్రచారం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైరస్‌ పెరగటానికి కారణం అయ్యుండవచ్చు. అంతే తప్ప వాటి వల్లనే ఉద్ధృతి పెరిగిందనలేం.

సెకండ్‌వేవ్‌ గురించి కేంద్రానికి మీ కమిటీ ముందస్తు హెచ్చరికలు చేసిందా?
ఏప్రిల్‌ 2న మా కమిటీ తరఫున నివేదిక అందజేశాం.

ప్రభుత్వం ఈ హెచ్చరికలను విస్మరించిందని అనుకోవచ్చా?
అదేం లేదు. సర్కారు వివిధ సంస్థలు, కమిటీల ద్వారా సమాచారం సేకరిస్తూ ఉంటుంది. దాన్ని క్రోడీకరించుకుని విధాన నిర్ణయాలు తీసుకుంటుంది.

ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మొత్తం జనాభాలో 60-70 శాతం మంది వ్యాక్సిన్‌ వేయించుకుంటే గండం నుంచి గట్టెక్కవచ్చు. మొట్టమొదట 60 ఏళ్లు పైబడిన వారికే పరిమితమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను 45 ఏళ్ల వయసు నుంచి చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పుడు 18 ఏళ్ల నుంచి జనాభాను ఇందులో చేర్చటం వల్ల పిల్లలు మినహా అందరికీ వ్యాక్సినేషన్‌ అందుతుంది. వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వపరంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఫార్మాసంస్థలు ఉత్పత్తిలో ఎంత వేగం పెంచినా, ఈ ప్రక్రియ పూర్తికావటానికి చాలా సమయమే పడుతుంది. ఈలోపు ప్రజలు వీలయినంతగా నియంత్రణ చర్యలు పాటించాలి. 2021 చివరి వరకూ మాస్కులు ధరించే అలవాటును కొనసాగించాలి.

ప్రభుత్వానికి తప్ప మీ సూచనలు బాహ్యప్రపంచానికి తెలిసే అవకాశం లేదా?
మణీంద్ర అగర్వాల్‌ ట్విటర్‌లో ఈ సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఆసక్తి ఉన్నవారు దాని ద్వారా తెలుసుకోవచ్చు

ఈ పరిస్థితికి కారణమేమిటి?
కరోనా తీవ్రత తగ్గిపోయింది, ఇక జాగ్రత్తలు అవసరం లేదని ఎక్కువ మంది భావించటం దీనికి కారణం.. తొలిసారి కరోనా తలెత్తినప్పడు పేదలు ఎక్కువగా వైరస్‌ బారిన పడ్డారు. అప్పట్లో అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడంతా విస్మరించారు. ఈసారి సంపన్నులపై వైరస్‌ దాడి అధికంగా ఉంది. పేదలు వైద్యానికి ప్రభుత్వ ఆసుపత్రులపైన, ధనికులు పైవేటు దవాఖానాలపైన ఎక్కువగా ఆధారపడతారు. ఇపుడు ఒక్కసారిగా వాటిపై ఒత్తిడి పెరిగి వ్యవస్థ దెబ్బతింది.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని