శిశు విద్య... ప్రత్యామ్నాయం ఉందిగా!
close
శిశు విద్య... ప్రత్యామ్నాయం ఉందిగా!

3-6 ఏళ్ల వయసులో వేగంగా ఆకళింపు చేసుకోగల చురుకుదనం
అందుకే పూర్వ పాఠశాల విద్యకు పెద్దపీట
కరోనా మహమ్మారితో గత ఏడాది వృథా
వచ్చే విద్యా సంవత్సరంపైనా నీలినీడలు
తల్లిదండ్రుల చొరవతో లోటు భర్తీ చేయవచ్చంటున్న నిపుణులు

చిన్నారుల్లో 85 శాతం మెదడు వృద్ధి మొదటి ఆరు సంవత్సరాల వయసులోపే ఉంటుంది. ఆ వయసులో మెదడు ఎక్కువ అంశాలను వేగంగా ఆకళింపు చేసుకోగలుగుతుంది. కొత్త భాషలు నేర్చుకునే సామర్థ్యం కూడా ఎక్కువే. అందుకే ఆ వయసు పిల్లలందరికీ నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడం తప్పనిసరి. అందుకే శిశు విద్యకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లోనూ మూడేళ్లపాటు పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడుతున్నాం.

- నూతన జాతీయ విద్యా విధానం-2020 కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరిరంగన్‌ చెప్పిన మాటలివి.

న్యూరో సైన్స్‌ నిపుణులు సహా పలు అధ్యయనాలూ ఆ విషయాన్నే వెల్లడించాయి. అయితే కరోనా వైరస్‌ సృష్టించిన కల్లోలం పిల్లలను శిశు విద్యకు దూరంచేసింది. ఇప్పటికే పిల్లలు ఒక విద్యా సంవత్సరాన్ని(2020-21) పూర్తిగా నష్టపోయారు. కరోనా పరిస్థితులను చూస్తుంటే వచ్చే ఏడాది(2021-22)నీ కోల్పోయే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

10 లక్షల మంది చిన్నారులపై ప్రభావం

రాష్ట్రంలో సాధారణంగా మూడేళ్లు నిండిన పిల్లలకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పేరుతో శిశు విద్య తరగతులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళుతుంటారు. తెలంగాణలో శిశు విద్యకు అర్హులైన వారు దాదాపు 15 లక్షల మంది ఉన్నా, దాదాపు 7-10 లక్షల మంది ఏటా కచ్చితంగా సంబంధిత తరగతుల్లో చేరుతున్నారు. కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌తో గత ఏడాది ఐదో తరగతి వరకు ప్రత్యక్ష తరగతులు జరగలేదు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో, అదీ హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ లాంటి నగరాల్లోని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల అనుబంధ, మరికొన్ని ఇతర బడుల్లో దాదాపు రెండు-మూడు లక్షల మందికి మాత్రమే ఆన్‌లైన్‌ విద్య అందిందని అంచనా. మిగిలిన వారు ఆన్‌లైన్‌ తరగతులకూ దూరమయ్యారు. కరోనా రెండో దశ జులై నాటికి తగ్గుముఖం పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నా, అక్టోబరు-ఫిబ్రవరి మధ్య మూడో దశ రావొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే వచ్చే విద్యాసంవత్సరమూ(2021-22) వారికి ప్రత్యక్ష తరగతులు కొనసాగడం సందేహమేనని విద్యావేత్తలు  అంచనా వేస్తున్నారు. దీన్నిబట్టి లక్షలాది పిల్లల కీలకమైన, అమూల్యమైన రెండేళ్లు వృథా అయినట్లేననే ఆందోళనను విద్యారంగ నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. ఇది అంతిమంగా పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావమే చూపుతుందని, తల్లిదండ్రులు గురువులుగా మారి ఆ లోటును భర్తీ  చేయాలని సూచిస్తున్నారు.

కన్నవాళ్లే గురువులు కావాలి
-ఆచార్య ఉపేందర్‌రెడ్డి, ఎస్‌సీఈఆర్‌టీ విశ్రాంత అధికారి

పూర్వ ప్రాథమిక విద్యలో పాఠాలు బోధించరు. ఆటలు, పాటలు, కథలు, మాట్లాడించడం, రంగులు, అంకెలు, జంతువులు, పక్షులు, మొక్కలు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు తదితరాలను గుర్తించడం వంటివి నేర్పుతారు. చిన్నచిన్న పనుల ద్వారా నేర్చుకునే తత్వాన్ని అలవర్చుతారు. వివిధ వర్గాల పిల్లలు ఒకేచోట ఉండటంతో ఒకర్నొకరు అనుకరిస్తూ కొత్త విషయాలను నేర్చుకుంటారు. విద్యా సంస్థలు తెరుచుకోని పరిస్థితులు ఉన్నందున ఆ నష్టాన్ని కొంతవరకైనా పూడ్చేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించాలి. కొన్ని పుస్తకాలు, చార్టులను కొని పిల్లలకు చూపుతూ విషయ పరిజ్ఞానాన్ని పరిచయం చేయాలి. మొక్కలు నాటించడం, బొమ్మలు గీయించడం, చిన్నచిన్న వస్తువులు తయారుచేయించడం వంటివి నేర్పించాలి. చిన్నారులు ఎన్నో సందేహాలను వ్యక్తపరుస్తారు, ప్రశ్నలను అడుగుతారు. వారికి అర్థమయ్యేలా సమాధానాలు చెప్పాలి. మొత్తంగా వారి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి.

తల్లిదండ్రులకు శిక్షణ తప్పనిసరి
- మల్లాడి శ్రీనగేష్‌, దక్షిణాది ఎడ్యుకేషన్‌ మేనేజర్‌, సేవ్‌ ది చిల్డ్రన్‌

శిశు విద్యను ఎలా బోధించాలన్న దానిపై తల్లిదండ్రులకు(కేర్‌ గివర్స్‌) విద్యాశాఖ శిక్షణ ఇవ్వాలి. వర్చువల్‌ సదస్సులు నిర్వహించవచ్చు. మొదట సర్వే నిర్వహించి, అర్హులైన వారికి శిశు విద్యకు అవసరమైన విద్యా సామగ్రిని ఇళ్ల వద్దకే వెళ్లి అందించే ఏర్పాట్లుచేయాలి.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని