close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కుర్రోళ్లకు కాటు!

11-20 ఏళ్లలోపు వారిలో భారీగా కరోనా కేసులు
  గత మూడు వారాల్లో 30 శాతానికి పైగా పెరుగుదల
 రాష్ట్రంలో మరో 2,278 కేసులు.. పది మంది మృతి
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో గడిచిన మూడు వారాల వ్యవధిలో (ఆగస్టు 22 నుంచి సెప్టెంబరు 11 మధ్య) 11-20 ఏళ్ల లోపు వారిలో కేసుల సంఖ్య 30 శాతానికి పైగా పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బాధితుల్లో బాలికల కంటే బాలురు ఎక్కువగా ఉంటున్నారు.

రాష్ట్రంలో 11 నుంచి 20 ఏళ్లలోపు పిల్లలు, యువకులపై కరోనా పంజా విసురుతోంది. పదేళ్లలోపు చిన్నారుల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోకున్నా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులు, పలు ప్రవేశ పరీక్షలు జరుగుతుండడంతో విద్యార్థులు స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు. అదే సమయంలో మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో కొవిడ్‌ బారిన పడుతున్నారన్న భావన వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో జులై నెలాఖరు వరకూ చిన్నారుల్లో కేసులు తక్కువగానే ఉన్నాయి. అప్పట్లో 21-50 ఏళ్లలోపు వారిలో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా ఈ కేటగిరీలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 70 ఏళ్లకు పైబడిన వృద్ధుల్లోనూ కేసులు తగ్గాయి.  జులై నెలాఖరు నాటికి మొత్తం కరోనా బాధితుల్లో పదేళ్లలోపు చిన్నారులు 3.4 శాతం ఉంటే.. ప్రస్తుతం 4.23 శాతానికి పెరిగారు. బాధితుల్లో 11-20 ఏళ్ల మధ్య వయస్కులు జులై నెలాఖరు నాటికి 5.3 శాతం ఉంటే ఆగస్టు 22 నాటికి 6.5 శాతం, ప్రస్తుతం 8.72 శాతానికి పెరిగారు. అంటే ఈ విభాగంలో పెరుగుదల దాదాపు 30 శాతంపైగా నమోదైంది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల్లో 20 ఏళ్లలోపు వారు 12.95 శాతం ఉన్నారు.
కారణాలివీ..
* గత రెండు నెలలుగా వ్యాపార కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. ఉద్యోగులు కార్యాలయాల బాట పడుతున్నారు. బయట తిరగడం పెరిగింది. పిల్లలు ఆన్‌లైన్‌ తరగతులతో ఇంటికే పరిమితమైనప్పటికీ కుటుంబసభ్యుల ద్వారా పిల్లలకు సోకుతోంది. 11-20 ఏళ్ల మధ్య పిల్లల్లోనూ 13 ఏళ్లుపైబడిన వారిలో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది.
* రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపరీక్షలు జరుగుతున్నాయి. పుస్తకాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాల కోసం విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఈ సమయంలో వైరస్‌ బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజా కేసుల వివరాలివీ..
రాష్ట్రంలో శుక్రవారం మరో 2,278 మందికి కరోనా సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 1,54,880కి చేరింది. కరోనా చికిత్స పొందుతూ మరో 10 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు 950కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా 32,005 మంది చికిత్స పొందుతున్నారు. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 331, రంగారెడ్డి జిల్లాలో 184, మేడ్చల్‌లో 150, నల్గొండలో 126, కరీంనగర్‌ జిల్లాలో 121 కేసులు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
- డాక్టర్‌ నరహరి, పిల్లల వైద్యనిపుణులు, నీలోఫర్‌ ఆస్పత్రి
పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. కూరగాయలు, షాపింగ్‌కు తీసుకెళ్తున్నారు. వీలైనంత వరకు పిల్లల్ని బయటకు తీసుకెళ్లకపోవడం మంచిది. ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే దగ్గర్లోని పిల్లల వైద్య నిపుణులను సంప్రదించి, చికిత్స పొందాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.