close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పత్తికి గులాబీ గుబులు

ఈనాడు, అమరావతి: పత్తి పంటపై గులాబీ పురుగు దాడి మొదలైంది. పూత దశలోనే మొక్కను ఆశించి కాయను గుల్లబారుస్తోంది. దీన్ని నియంత్రించలేక గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పెదనందిపాడు మండలాల్లో పత్తిని దున్నేస్తున్నారు. కర్నూలు జిల్లాలో దీని నివారణకు వారానికి ఒకటి, రెండుసార్లు మందులు పిచికారి చేస్తున్నా... పెట్టుబడులు పెరుగుతున్నాయే తప్ప కాయలోపల పురుగు మాత్రం చావడం లేదు. ఏటా అక్టోబరులో ఉనికి చాటే ఈ పురుగు.. ఈ ఏడాది సెప్టెంబరు నుంచే పత్తికి మహమ్మారిలా దాపురించిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎకరాకు రూ.15 వేలపైనే పెట్టుబడి
ఈ ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 14.10 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. అత్యధికంగా ఇది కర్నూలు జిల్లాలో సాగవుతోంది. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, అనంతపురం, ప్రకాశం, కడప జిల్లాల్లో పండిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, సేద్యపు ఖర్చుల రూపంలో ఇప్పటికే రైతులు ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులు.. ఎకరానికి రూ.35 వేలపైనే ఖర్చు పెట్టారు.

లేత పంటపై.. నెల ముందే దాడి
* బీటీ పత్తిని కొన్నేళ్ల నుంచి గులాబీ పురుగు ఆశిస్తోంది. సాధారణంగా సెప్టెంబరు చివరి వారం, అక్టోబరులో దీని ఉద్ధృతి మొదలవుతుంది. ఖరీఫ్‌లో ముందుగా వేసిన పంటను ఎక్కువగా ఆశిస్తుంది.
* ప్రస్తుతం పూతలో ఉన్న పురుగు.. పిందెలోకి చేరుతుంది. అలాగే పెరుగుతూ.. కాయను తినేస్తుంది.

మందు చల్లినా ఉపయోగం లేదు
‘ఎకరా రూ.25 వేల చొప్పున కౌలుకు తీసుకుని మూడెకరాలు సాగు చేశా.. రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టా. పూత బాగానే వచ్చినా.. పురుగు కన్పిస్తోంది.  పిచికారి చేసినా ఫలితం ఉండదన్న భావనతో రొటోవేటర్‌తో దున్నేశాను...’అని గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన జి.సుబ్బారావు వెల్లడించారు. ఇదే గ్రామంలో మరో రైతు కూడా అయిదున్నర ఎకరాల పత్తిని దున్నేశారు.


కొన్ని డివిజన్లలో గులాబీ పురుగు గుర్తించాం
గుంటూరు జిల్లాలోని క్రోసూరు, సత్తెనపల్లి సబ్‌ డివి

జన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో గులాబీ పురుగు గుర్తించామని వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. ‘సాగర్‌ కుడికాల్వకు నీరు విడుదల చేయడంతో.. పిడుగురాళ్లతో పాటు సత్తెనపల్లి డివిజన్‌లోని ముప్పాళ్ల మండల పరిధిలోని మాగాళ్లలో కొందరు రైతులు పత్తిని తొక్కించి వరి వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు.. పొలంబడి ద్వారా పురుగు నివారణ చర్యలపై రైతులకు సూచనలు ఇస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వారికి అవగాహన కల్పిస్తున్నాం...’ అని ఆయన వివరించారు.

పురుగు మందుల పిచికారికే రూ.7వేలు
‘పత్తికి పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. మూడెకరాల్లో ఇప్పటికే ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి అయింది. జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు పెట్టినా తగ్గడం లేదు. ఒక్కో దఫా పురుగు మందుకు రూ.1,200 అవుతోంది. వారానికి రెండుసార్లు పిచికారి చేస్తున్నా. ఇలా ఎకరాకు అదనంగా రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు పెరుగుతున్నాయని’ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డికి చెందిన నబీ రసూల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాయలు వెదికితే.. పురుగు లోపల కన్పిస్తోందని హాళహర్వి మండలం గూళ్యంకు చెందిన గాదె లింగప్ప చెప్పారు.


గులాబీ పురుగుపై పోరుకు ప్రత్యేక అధికారులు
సమగ్ర యాజమాన్య పద్ధతులపై అవగాహనా వారోత్సవాలు

ఈనాడు, అమరావతి: పత్తిలో గులాబీ రంగు పురుగు ఉనికి చాటుతున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంతోపాటు అమలు, పర్యవేక్షణకు కమిషనరేట్‌ నుంచి ఆరుగురు సీనియర్‌ అధికారులను పత్తి అధికంగా సాగు చేసే జిల్లాలకు పంపిస్తోంది. పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులపై అవగాహనా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. 1,4,330 ఎకరాల్లో పురుగు ఉనికి గుర్తించామని వివరించారు. సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో ఎక్కువగా పంటను ఆశించే ఈ పురుగు.. ఈ ఏడాది సెప్టెంబరులోనే కనిపిస్తోందని తెలిపారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.