close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆక్సిజన్‌ అందకే అపస్మారకంలోకి

ప్రస్తుతం వృద్ధులు, పిల్లలపై ప్రభావం అధికం
‘స్టైరీన్‌’ ప్రభావం దీర్ఘకాలం ఉండదు
‘ఈనాడు’తో ఐఐపీఈ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌

ఈనాడు, అమరావతి: విశాఖలో విషాదానికి కారణమైన స్టైరీన్‌ వాయువు ప్రభావం ఆ ప్రాంతంపైనా, ప్రజలపైనా దీర్ఘకాలం పాటు ఉండబోదని విశాఖలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ(ఐఐపీఈ) డైరెక్టర్‌, రసాయనశాస్త్ర ఆచార్యులు వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ పేర్కొన్నారు. రాబోయే తరాలను అది ఇబ్బంది పెట్టబోదని అభిప్రాయపడ్డారు. గ్యాస్‌ లీకయినప్పుడు దాని ప్రభావానికి ఎక్కువ గురైనవారిలో మాత్రం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. బుధవారం రాత్రే తనకు వంట గ్యాస్‌ కంటే కాస్త ఎక్కువ గాఢమైన వాసన వచ్చిందని (ప్రసాద్‌ పెదవాల్తేరులో ఉంటున్నారు) అప్పటికే ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి గ్యాస్‌ లీకవడం మొదలై ఉంటుందన్నారు. అసలు ఈ స్టైరీన్‌ అంటే ఏంటి? అది ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది? ఫ్యాక్టరీ నుంచి గ్యాస్‌ లీకవడానికి కారణం ఏమై ఉండొచ్చు? వంటి అంశాలను ‘ఈనాడు’కు వివరించారు.

ఎక్కడ వైఫల్యం జరిగిందో తెలియాలి
స్టైరీన్‌ ద్రవ పదార్థం. అది మోనోమర్‌ రూపంలో ఉంటుంది. కొన్ని మోనోమర్‌లు కలిస్తే... రసాయన బంధం వల్ల పాలీస్టైరీన్‌గా మారుతుంది. ఈ రసాయన చర్య జరిగే క్రమంలో ఉష్ణం జనిస్తుంది. స్టైరీన్‌ మరిగే ఉష్ణోగ్రత 145 డిగ్రీల సెల్సియస్‌. అది ఆవిరిగా మారే క్రమంలో విపరీతంగా పీడనం పెరుగుతుంది. ఆ క్రమంలో వాయురూపంలోకి మారిన స్టైరీన్‌ కొంచెం కొంచెం విడుదలవుతుంది. మనం ఇంట్లో వాడే ప్రెజర్‌ కుక్కర్‌లో సేఫ్టీవాల్వ్‌ ఉన్నట్టే.. పరిశ్రమల్లో వాయువుల్ని నియంత్రించడానికి వివిధ అంచెల భద్రతా వ్యవస్థలు ఉంటాయి. కొద్ది కొద్దిగా గ్యాస్‌ లీకవుతున్నప్పుడే వారు గుర్తించి చర్యలు తీసుకోకపోవడం వల్ల, సేఫ్టీ వాల్వ్‌ను దాటుకుని గ్యాస్‌ బయటకు వచ్చేసింది. అలాంటి క్రమంలో ఉష్ణోగ్రతను నియంత్రిస్తే, రసాయన చర్య ఆగిపోతుంది. దానికి నీటి ధారలు వెదజల్లడం, కొన్ని ప్రత్యేక రసాయనాలను వినియోగించడం వంటివి చేయాలి. ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో ఎక్కడ వైఫల్యం జరిగిందో తెలియాల్సి ఉంది.

గాలిలో 10 వేల పీపీఎంలు?
స్టైరీన్‌ గ్యాస్‌ బయటకు వస్తే... ఆక్సిజన్‌తో త్వరగా రసాయన చర్య జరుగుతుంది. ఆ క్రమంలో గాలిలోని ప్రాణవాయువు మొత్తాన్ని అది లాగేసుకుంటుంది. సాధారణంగా గాలిలో 10 పీపీఎంల వరకు స్టైరీన్‌ ఉంటే పర్వాలేదు. కానీ ఆ విషాదం జరిగినప్పుడు చుట్టుపక్కల గాలిలో 10 వేల పీపీఎంల వరకు స్టైరీన్‌ చేరి ఉండొచ్చు. ఆక్సిజన్‌ను స్టైరీన్‌ లాగేసుకోవడం, ఆ విషవాయువుని ప్రజలు పీల్చడం వల్ల కళ్లు, ముక్కు, గొంతులో మంట, దురదలు, శ్వాస ఆడకపోవడం, కళ్లు తిరగడం, మగత వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అపస్మారక స్థితికి వెళ్లిపోతారు. ఊపిరితిత్తులు, జీర్ణాశయంలోని మెంబ్రేన్‌ను స్టైరీన్‌ తినేస్తుంది. దీంతో ఆ అవయవాల్లో నీరు చేరడం, మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. బాధితులకు తక్షణ వైద్యం అందించాలి.

నిద్రలో ఉండటం వల్లే..
అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు గ్యాస్‌ లీకవడం వల్ల... ప్రజలు ఎక్కువ మొత్తంలో ఆ గాలిని పీల్చడంతో సమస్య తీవ్రత పెరిగింది. నిద్రలోనే అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. స్టైరీన్‌ వాయువును ఎంత ఎక్కువ పీల్చారు, అది వారి అంతర్గత అవయవాలపై ఏ మేరకు ప్రభావం చూపిందన్నదానిపై... బాధితులు ఎంత త్వరగా కోలుకుంటారన్నది ఆధారపడి ఉంటుంది. తీవ్ర ప్రభావానికిలోనైనవారు కోలుకున్నా చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి. బాధితుల్లో వృద్ధులు, పిల్లలపై మాత్రం ప్రభావం ఎక్కువగా ఉంటుంది.


అర కిలోమీటరు వరకు అధిక ప్రభావం

స్టైరీన్‌ వాయువు సాంద్రత ఎక్కువ. గాలిలో రెండు మూడు రోజుల పాటు దాని ప్రభావం ఉంటుంది. గ్యాస్‌ వెలువడిన ప్రదేశం నుంచి 0.5 కి.మీ. దూరం వరకు తీవ్రత అధికం. 3 కి.మీ.ల దూరం వరకు కొంత అసౌకర్యం అనిపించినా పెద్ద నష్టం ఉండదు. 10-15 కి.మీ.ల దూరం వరకు గ్యాస్‌ ప్రభావం తెలుస్తూ ఉంటుంది. స్టైరీన్‌ కూడా పెట్రోల్‌, గ్యాస్‌ వాసనే వస్తుంది. ప్రమాద స్థలం చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వారం రోజుల వరకు అక్కడికి వెళ్లకపోవడం మంచిది.


ముందు జాగ్రత్త పడకే..

ఎల్‌జీ పాలిమర్స్‌లో ఇప్పటికీ స్టైరీన్‌ నిల్వలు ఉన్నాయి. వాటి నుంచి గ్యాస్‌ లీకవకుండా అడ్డుకున్నారు. అవే చర్యలు ముందే తీసుకుని ఉంటే ఇంత విషాదం జరిగేది కాదు. లాక్‌డౌన్‌ సమయంలో మాక్‌ ట్రయల్స్‌ చేస్తూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే ఇంత విషాదం జరిగేది కాదు.


గ్యాస్‌ ఎంత పరిమాణంలో పీల్చారన్న దానిపైనే దుష్పరిణామాలు ఉంటాయి. తొలుత ఊపిరితిత్తుల్లో సమస్య మొదలై గాలి పీల్చడం కష్టమవుతుంది. ముఖ్యంగా పెద్దవారికి, శ్వాసకోస సమస్యలున్న వారికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. శరీరానికి ఆక్సిజన్‌ అందక కేంద్ర నాడీ వ్యవస్థ పనిచేయదు. క్రమంగా మరణానికి దారితీయొచ్చు.

- డా.సీవీ రావ్‌, డైరెక్టర్‌, గీతం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌



స్టైరీన్‌ ప్రభావంతో ప్రధానంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. నరాల సమస్యలు వస్తాయి. బాధితులు నీరసించిపోతారు. విశాఖ ఘటనలో కళ్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.

- డా.అవినాశ్‌, సీనియర్‌ ఆప్తల్‌మాలజిస్ట్‌, ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి



ఈ వాయువు ప్రమాదకరం కాదు. ఎక్కువ మొత్తంలో ఒకేసారి విడుదల కావడం, వాతావరణంలో ఇతర వాయువులతో కలవడం లేదా ఫ్యాక్టరీలోనే కలుషితం కావడం వల్ల ఇంత ప్రమాదం జరిగి ఉండవచ్చు. కాలుష్య నియంత్రణ మండలి లోతైన విచారణ జరపాలి.

-ఆచార్య కె.బసవయ్య, డైరెక్టర్‌, స్కూల్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.