close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆఫ్రికా ఆకలి కేక

లాక్‌డౌన్‌లతో బతుకులు ఛిద్రం
మినహాయిస్తే మరింత కష్టం
తీవ్ర పేదరికంలోకి 3కోట్ల మంది

చీకటి ఖండంగా ఉన్న ముద్రను చెరిపేసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆఫ్రికాకు కరోనా రూపంలో పెనుకష్టం వచ్చింది. వ్యాధి వ్యాప్తి కట్టడికి అకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌లు ప్రజలకు పెనుశాపంగా మారాయి. ఇప్పుడు వారికి కరోనాను మించిన సమస్య ఆకలే. ఉపాధి కోల్పోయిన జనం ఆకలికేకలు ఎక్కువయ్యాయి. పట్టణాల్లోని మురికివాడల్లో ఆహారం లేక మహిళలు, పిల్లలు రోడ్లపైకి వస్తున్నారు. దేశాలకు దేశాలే అట్టుడికిపోతున్నాయి.


భరించడం అసాధ్యం

కరోనా వైరస్‌ ఆఫ్రికాలోకి ఆలస్యంగానే వచ్చింది. చాపకింద నీరులా వేగంగా అన్ని దేశాలను చుట్టేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో లాక్‌  డౌన్‌కు కొంత సమయం తీసుకున్నా, ఆఫ్రికాలో మాత్రం వెన్వెంటనే నిర్బంధాలు అమలుచేశారు. సరిహద్దులు మూసేశారు. మారిషస్‌, రువాండా, టునీషియా, లిబియా, జింబాబ్వే, మడగాస్కర్‌, ఘనాలు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలుచేశాయి. ఆఫ్రికాలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ ఉన్న దక్షిణాఫ్రికాలో జన సంచారంపై కఠిన ఆంక్షలు విధించారు. నైజీరియా రాజధాని అబుజాతోపాటు లాగోస్‌ నగరంలో లక్షల మందిని కట్టేసినట్టుగా నిర్బంధాలు అమలుచేశారు. చిన్న డబ్బాల్లాంటి ఇళ్లలో పది మంది వరకు నివసించే ఇలాంటి చోట ఎక్కువ రోజులు ఉంచడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఆరోగ్యం సంగతి తర్వాత.. ముందు ఆకలి తీర్చాలంటూ జనం రోడ్లపైకి రావడం ప్రారంభమైంది. దీంతో చాలా దేశాలు పౌరులను ఇళ్లలోనే ఉండాలని బలవంతం చేయడం మానుకున్నాయి. దక్షిణాఫ్రికాలో 45 రోజుల తర్వాత నిబంధనలు సడలించారు. సెనెగల్‌, మారిటోనియా, గునియా, మాలే, ఐవరీకోస్ట్‌లు భౌతిక దూరంతోపాటు రాత్రి కర్ఫ్యూలే అమలు  చేస్తున్నాయి. కెన్యా, బెనిన్‌ దేశాల్లో కీలక నగరాల్లోకి మాత్రమే బయటినుంచి రాకపోకలు నిషేధించారు. 10 కోట్లకు పైగా జనాభా ఉన్న   ఇథియోపియాలోనూ జన సంచారాన్ని నియంత్రించలేదు. ఫలితంగా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పరిస్థితి చేయి దాటకుండా ప్రజలను నియంత్రించే క్రమంలో పోలీసు హింస పెరుగుతోంది. అదే సమయంలో వైరస్‌ లక్షణాలున్న వారిని, గుప్తవాహకులను గుర్తించడానికి పరీక్షలే శరణ్యమైన వేళ అక్కడ కిట్ల కొరత నెలకొంది. సరిగ్గా కుదురుకోని ఆరోగ్యరంగమూ ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్‌ బాధి తులకు చికిత్స చేసేందుకూ మందుల్లేవు. దాంతో ఈ ఖండంలోని 25కుపైగా దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, పారాసిటమాల్‌, ఇతర ఔషధాలను పంపిస్తున్నట్లు భారత విదేశాంగశాఖ శుక్రవారం ప్రకటించింది.


ఉద్దీపన నామమాత్రం

ఆసియా, ఐరోపా, అమెరికాలో పలు దేశాలు ప్రకటించిన    ఉద్దీపన ప్యాకేజీలతో పోలిస్తే ఆఫ్రికాలో నామామాత్రంగా ఉన్నాయి. జనం ప్రస్తుత అవసరాలను అవి ఏమాత్రం తీర్చలేకపోతున్నాయి. అమెరికా, చైనా వంటి దేశాలు జీడీపీలో నాలుగు శాతానికి సమానమైన ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తే ఆఫ్రికాలో  1 నుంచి 1.5 శాతమే ఉన్నాయి. ఆఫ్రికాలో దక్షిణాఫ్రికా సహా ఏ దేశ ఆర్థికవ్యవస్థా బలంగా లేదు. కెన్యా కొంతవరకు పన్నులు తగ్గించింది. మురికివాడలకు ఉచితంగా నీటి సరఫరా చేస్తోంది. సెనెగల్‌లో విద్యుత్తు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. సంక్షోభం ముగిసేవరకు ఇళ్ల యజమానులు అద్దెలు వసూలు చేయవద్దని ఉగాండా అధ్యక్షుడు సూచించారు. లాగోస్‌, ఉగాండా, రువాండా, దక్షిణాఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వాలు పరిమితంగా ఆహారం పంపిణీ చేస్తున్నాయి.  ఉత్పాదకతకు ఉపయోగపడని ఇలాంటి చర్యలకు బదులు ఆర్థిక కార్యకలాపాలు నడిపితేనే నిరుద్యోగం, ఆకలి సమస్య పెచ్చుమీరకుండా ఉంటాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.


కెన్యాలో కాల్పులు

కఠిన ఆంక్షలు కొనసాగుతుండడంతో పోలీసులు, సైన్యంపై తిరగపడే ప్రజల సంఖ్య పెరుగుతోంది. కెన్యా రాజధాని నైరోబిలో ఆందోళనలు కాల్పులకు దారితీశాయి. ఇక్కడ రాజధానితోపాటు ప్రధాన తీర ప్రాంతాల్లో కర్ఫ్యూ, భౌతిక దూరం వంటి నిబంధనలతో ఎన్నో ఉద్యోగాలు పోయాయి. 60 శాతం ప్రజలు మురికివాడల్లోనే నివసించే నైరోబీ నగరంలో పిల్లలను ఖాళీ కడుపులతో ఉంచలేక తల్లులు తల్లడిల్లిపోతున్నారు. ఆహార పంపిణీ సందర్భంగా తొక్కిసలాటలు సైతం జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
* మిగతా దేశాలతో పోలిస్తే బురిండీ, టాంజానియాలో భిన్నమైన పరిస్థితి ఉంది. ఇక్కడి ప్రభుత్వాలు సకాలంలో స్పందించి వైరస్‌ వ్యాప్తిని చాలావరకు తగ్గించగలిగాయి. జనజీవనం సాధారణంగానే కొనసాగుతోంది. దేశఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు కరోనా వైరస్‌ ఓ కారణం కాకూడదని టాంజానియా అధ్యక్షుడు జాన్‌ మాగుఫూజి అన్నారు.


మరింత పేదరికం తప్పదా

కరోనా ప్రభావం నుంచి బయటపడేందుకు ఆఫ్రికాకు కనీసం 200 బిలియన్‌ డాలర్లు అవసరమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. కరోనా దాడితో మొత్తం ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థ 2.6 శాతం కుదించుకుపోనుంది. ప్రపంచంలోని నిరాశ్రయుల్లో మూడింట రెండొంతులు ఈ ఖండంలోనే ఉన్నారు. కేసుల వ్యాప్తి వేగంగా పెరుగుతోందని ‘ఆఫ్రికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ ప్రకటించింది. కొత్తగా 3 కోట్ల మంది తీవ్రమైన పేదరికంలోకి వెళ్లేందుకు కరోనా కారణమవుతోంది.


ఉద్యోగ గండం

మెకన్సీ నివేదిక ప్రకారం.. లాక్‌డౌన్‌లతో జీవనోపాధి కోల్పోతున్నందున ఆఫ్రికాలోని 440 మిలియన్ల ఉద్యోగాలలో మూడో వంతు అంటే 150 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముంది. తయారీ, రవాణా, ఆతిథ్యం, పర్యాటక రంగాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆయా దేశాలు మరిన్ని వనరులు సమీకరించేందుకు వాటికి ప్రత్యేక డ్రాయింగ్‌ రైట్స్‌(ఎస్‌డీఆర్‌) కేటాయించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ కోరారు. మరోవైపు ఆఫ్రికాలోని కొన్ని దేశాలు లాక్‌డౌన్‌ సడలింపులు చేస్తుండటంపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. మరింతకాలం అప్రమత్తంగా లేకుంటే వ్యాధి వ్యాప్తి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించింది.


‘‘కరోనా కారణంగా ఆఫ్రికాలో ఈ ఏడాది కనీసం 33 లక్షల ప్రాణాలకు ముప్పుంది. నీటి సరఫరా వ్యవస్థ లేని మురికివాడలు, బలహీనమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల కారణంగా వ్యాధి బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువ. వచ్చే కొద్ది వారాల్లో ఇక్కడి ప్రభుత్వాల స్పందనే ఆఫ్రికా ఆరోగ్య పథాన్ని నిర్దేశిస్తుంది.’’

- ఐరాస ఎకనమిక్‌ కమిషన్‌ ఫర్‌ ఆఫ్రికా


‘‘కరోనా నివారణకు తగిన చర్యలు చేపట్టకుంటే ఆఫ్రికా ఖండానికి పెనుముప్పు తప్పదు. ఇవే పరిస్థితులు కొనసాగితే ఈ ఏడాది నాటికి 2.9 కోట్ల నుంచి 4.4 కోట్ల మందికి వ్యాధి సోకే అవకాశముంది. వారిలో 1.9 లక్షల మంది మరణించే ప్రమాదముంది. ఈ ఖండంలోని 47 దేశాల పరిస్థితులను గమనించాకే ఈ నిర్ణయానికి వచ్చాం. ప్రభుత్వాలు తగిన విధంగా స్పందించకుంటే కొన్నేళ్లపాటు ఈ వ్యాధి ప్రజల జీవితాల్లో ఒక భాగంగా మారిపోతుంది.’’

-ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక


‘‘మా ప్రజలు తినాలి. జీవనానికి సంపాదించుకోవాలి. కంపెనీలు తిరిగి ఉత్పత్తి ప్రారంభిస్తేనే వ్యాపారాలు జరుగుతాయి. అప్పుడే ఉద్యోగాలు నిలుస్తాయి. అందుకే లాక్‌డౌన్‌ను అంచలంచెలుగా సడలిస్తున్నాం’’

- సిరిల్‌ రామఫోసా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు


‘‘అభివృద్ధి చెందిన దేశాల తరహాలో మేం లాక్‌డౌన్‌లు విధించలేం. ఇక్కడ ఇళ్లు లేనివారు పెద్ద  సంఖ్యలో ఉంటారు. ఇళ్లున్న వారు సైతం రోజూ బయటకెళితేనే పూట గడుస్తుంది.’’

- అబీ అహ్మద్‌, ఇథియోపియా ప్రధాని

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.