close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎందుకీ మందు గమనం?

యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ తయారీ అంత సులువు కాదు
బ్యాక్టీరియా, వైరస్‌ మధ్య స్వభావంలో ఎన్నో తేడాలు

వైద్య పరిశోధన రంగం, శాస్త్రవిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ కరోనా వైరస్‌కు మందును త్వరగా ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? యాంటీబయోటిక్స్‌ తయారీలో ముందంజ వేస్తున్న పరిశోధన రంగం.. యాంటీ వైరల్స్‌ విషయంలో ఎందుకు పురోగతి సాధించలేకపోతోంది? మునుపెన్నడూ లేనంతగా కొవిడ్‌  మహమ్మారి భయభ్రాంతులకు గురిచేస్తున్న తరుణంలో అందరి మెదళ్లనూ తొలుస్తున్న ప్రశ్నలివి. మరి వీటికి సమాధానాలేమిటి?

యాంటీ వైరల్స్‌.. ఎందుకిలా?
అది రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న సమయం. అప్పుడే ఓ మహత్తర ఔషధాన్ని ఆవిష్కరించారు! అదే పెన్సిలిన్‌. ఎంతోమంది సైనికులను బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడి, ప్రాణభిక్ష ప్రసాదించిన మొట్టమొదటి యాంటీబయోటిక్‌ మందు. నాటి నుంచీ ఇలాంటి ప్రాణరక్షణ ఔషధాలు ఎన్నెన్నో పుట్టుకొచ్చాయి. రకరకాల బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను తుదముట్టిస్తూ మానవాళికి ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. కానీ... వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల విషయంలో సరైన పురోగతి సాధించలేకపోయాం. ఏవో కొన్ని యాంటీవైరల్‌ మందులతోనే సంతృప్తి పడిపోతున్నాం. హెచ్‌ఐవీ, ఎబోలా, సార్స్‌, నిఫా, కొవిడ్‌... ఇలా కొత్తగా వైరల్‌ జబ్బు ఏది మొదలైనా బెంబేలెత్తుతున్నాం. ఇప్పుడే కాదు, చాలాకాలంగా వైరల్‌ మందుల విషయంలో ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. యాంటీవైరల్స్‌ తయారీ ఎందుకింత సంక్లిష్టంగా ఉంటోంది? యాంటీబయోటిక్స్‌ విషయంలో లేని ఇబ్బందులు వైరల్‌ మందులకే ఎందుకు ఎదురవుతున్నాయి? వీటికి సమాధానం బ్యాక్టీరియా, వైరస్‌ల స్వరూప స్వభావాలు... వృద్ధి తీరుతెన్నులు వేర్వేరు కావడమే.

వాటి స్వభావమే వేరు
* బ్యాక్టీరియాలకు, వైరస్‌లకు మధ్య చాలా తేడా ఉంది. బ్యాక్టీరియాలు తమకు తాముగా జీవించగల, వృద్ధి చెందగల సూక్ష్మక్రిములు. ఇవి మన శరీర కణాల లాంటివే అయినా కొన్ని ప్రత్యేక లక్షణాలు వీటి సొంతం. ఉదాహరణకు... బ్యాక్టీరియాకు కణాల గోడలు ఉంటాయి. ఇవి పెప్టిడోగ్లైకాన్‌ అనే పాలిమర్‌తో తయారవుతాయి. పెన్సిలిన్‌ మందు దెబ్బతీసేది ఈ గోడ నిర్మాణాన్నే. అంటే యాంటీబయోటిక్‌ మందులు మన సహజ వ్యాధి నిరోధక శక్తికి ఎలాంటి హాని తలపెట్టకుండానే పెప్టిడోగ్లైకాన్‌ తయారీని నిలువరిస్తూ బ్యాక్టీరియాల పనిపడతాయన్నమాట. దీన్నే నిర్దేశిత విషతుల్య ప్రక్రియ(సెలెక్టివ్‌ టాక్సిసిటీ) అంటారు.
* నిర్దేశిత విషతుల్య ప్రక్రియ సూత్రం యాంటీవైరల్స్‌ తయారీకి పనికిరాదు. ఎందుకంటే వైరస్‌లు తమకు తాముగా వృద్ధి చెందలేవు. ఒకరకంగా చెప్పాలంటే ఇవి పరాన్నజీవుల మాదిరిగానే వ్యవహరిస్తాయి. అంటే... ఇతర జీవుల కణాలే వైరస్‌లకు ఆధారం. వాటిని ఆశ్రయించుకునే వృద్ధి చెందుతాయి. కణం వెలుపల అసలే పెరగలేవు. అందువల్లనే మన శరీరంలోని కణాలకు హాని తలపెట్టకుండా వైరస్‌లను నిర్మూలించడమనేది చాలా కష్టమైన పని. యాంటీవైరల్‌ మందుల ఆవిష్కరణలో ఇదే పెద్ద ప్రతిబంధకం. వైరస్‌లు ఇతర జీవుల కణాల్లోకి ప్రవేశించగానే వాటి యంత్రాంగాన్ని మొత్తం తమ అధీనంలోకి తీసేసుకుంటాయి. తమకు అనుకూలంగా, తమ వృద్ధికి అవసరమైన పనులన్నీ చేయించుకుంటాయి. ఈ వైరస్‌లు ఒంట్లోకి ప్రవేశించాక కొన్ని నిద్రాణంగా ఉండిపోవచ్చు. కొన్ని నెమ్మదిగా వృద్ధి చెందుతుండొచ్చు. కొన్ని ఆయా కణాల్లోంచి బయటపడొచ్చు. కొన్ని వైరస్‌లు తామరతంపరగా పెరుగుతూ.. చివరికి కణాలు పేలిపోయేలా చేస్తాయి. అంటే... తమకు ఆశ్రయమిచ్చిన కణాలనే చంపేస్తాయన్నమాట. కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్‌ భాగాలు చెల్లాచెదురై ఇతర కణాల్లోకి ప్రవేశిస్తాయి. ఇలా తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తాయి.

మాయలమారి వైరస్‌లు
వైరస్‌ ‘జీవ’ చక్రాన్ని... అంటే ఇవి కణాల్లోకి ప్రవేశించడం, వృద్ధి చెందడం వంటి ప్రక్రియలను దెబ్బ తీయగలిగితే వీటిని నిర్మూలించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ... వైరస్‌లపై దాడిచేసే ఏ ఔషధమైనా మన కణాలనూ దెబ్బ తీస్తుండటమే పెద్ద చిక్కు. మందులతో వైరస్‌లను చంపడం తేలికే గానీ వాటికి ఆశ్రయమిచ్చిన కణాలను సంరక్షించుకోవడమే కష్టం. యాంటీవైరల్‌ మందుల తయారీలో ఇదే అత్యంత చిక్కు సమస్యగా పరిణమిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీవైరల్‌ మందులు ఆయా వైరస్‌ల ప్రత్యేక స్వరూప, స్వభావాల మీద ఆధారపడే పనిచేస్తాయి. వాటి బలహీనతలపై దెబ్బ కొట్టి ఇన్‌ఫెక్షన్‌ తగ్గించేందుకు తోడ్పడతాయి. ఇలా వీలైనంతవరకు మనకు అతి తక్కువ హాని కలిగేలా చూస్తూ వైరస్‌లను నిలువరిస్తాయి. అయితే... వైరస్‌ కణం మీద ఎంతవరకు ఆధారపడి ఉంటోందన్నదాన్ని బట్టి ఈ మందుల ఫలితం కనిపిస్తుంది. వైరస్‌ కణం మీద ఆధారపడటం ఎంత ఎక్కువగా ఉంటుంటే కణాలను దెబ్బ తీసే అవకాశాలు అంత తగ్గుతూ వస్తుంటాయి. దురదృష్టం కొద్దీ వైరస్‌ల స్వరూప, స్వభావాలు చాలావరకు వేర్వేరుగా ఉంటాయి. ఈ కారణంగానే మందులతో వాటిని దెబ్బ తీయడం కష్టంగా మారుతోంది.

దాని లోపాలే దారి చూపుతాయ్‌
ప్రస్తుతం కొవిడ్‌-19తో తీవ్రంగా బాధపడుతున్న వారికి రెమిడెసివిర్‌, లోపినావిర్‌, రైటోనావిర్‌, రైబవిరిన్‌ వంటి ఇతరత్రా వైరల్‌ మందులతో ప్రయోగాత్మకంగా చికిత్స చేస్తున్నారు. ఇవి కొంతవరకు పనిచేస్తున్నట్టు తేలినా పెద్దఎత్తున ప్రయోగాలు చేస్తేనే పూర్తి స్థాయి ఫలితాలు బయటపడవు. ఏదేమైనా కరోనా జబ్బుకు కొత్త యాంటీవైరల్‌ కనుగొనడమే చికిత్సలో మేలిమలుపు కాగలదు. ఇందుకోసం వైరస్‌ నిర్మాణాన్ని, అది మన కణాలతో ఎలాంటి చర్యలు జరుపుతోందనేది పూర్తిగా తెలుసుకోవడం అత్యావశ్యకం. ఈ వైరస్‌ ఎలా మనగలుగుతోంది? ఎలా వృద్ధి చెందుతోందనే విషయాలను తెలుసుకోగలిగితే మంచి మందులను రూపొందించుకునే అవకాశముంది. వైరస్‌ బలహీనతలను ఎంత త్వరగా గుర్తిస్తే ఇది అంత త్వరగా సాధ్యమవుతుంది.

ఇదే లక్ష్యంతో ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా కాలంతో పోటీపడుతూ పనిచేస్తున్నారు. వివిధ దేశాల పరిశోధనల మధ్య డబ్ల్యూహెచ్‌వో అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది. ఆ ఔషధం వచ్చే వరకు మనమంతా భౌతిక దూరం, చేతుల శుభ్రత పాటించడాన్ని జీవితంలో ఒక భాగంగా మార్చుకుంటే అందరికీ మేలు.


జన్యు స్వరూపమూ భిన్నమే

* బ్యాక్టీరియా: బ్యాక్టీరియా మాదిరిగా వైరస్‌ల జన్యు స్వరూపం ఒకేలా ఉండదు. బ్యాక్టీరియాలన్నీ రెండు పోచల డీఎన్‌ఏ జన్యు చక్రాన్ని కలిగి ఉంటాయి. ఇవి తమకు తాముగా వృద్ధి చెంది, మన కణాల మాదిరిగానే రెండుగా విడిపోతాయి. దీంతో వివిధ రకాల బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను ఒకే మందుతో నయం చేసే అవకాశం లభిస్తోంది.

* వైరస్‌: బ్యాక్టీరియాల మాదిరే వైరల్‌ ఇన్‌ఫెక్షన్లను ఒకేరకమైన మందులతో తగ్గించడం కుదరదు. ఎందుకంటే వైరస్‌లలో ఏవీ... ఒకే రకమైన జన్యు స్వరూపాన్ని కలిగి ఉండవు. కొన్నింటిలో డీఎన్‌ఏ, మరికొన్నింటిలో ఆర్‌ఎన్‌ఏ జన్యుచక్రాలు ఉంటాయి. కొన్నింటిలో ఒకే పోచ జన్యు పదార్థముంటే.. మరికొన్నింటిలో రెండు పోచల జన్యు పదార్థం ఉంటుంది. అందువల్ల అన్నింటికీ పనిచేసే మందులను కనిపెట్టటం అసాధ్యంగా మారుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కొన్ని సమర్థమైన వైరల్‌ మందుల ఆవిష్కరణను మన శాస్త్రవేత్తలు సుసాధ్యం చేయడం విశేషం. ఫ్లూ ఇన్‌ఫెక్షన్ల చికిత్సలో వాడుతున్న జనమివిర్‌, ఒసాల్టవిమిర్‌ వంటి కొత్త మందులన్నీ ఇలాంటివే.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.