close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రపంచం మనవైపు చూస్తోంది

కొవిడ్‌పై ముందుగానే తేరుకున్నాం... మంచి ఫలితాలు రాబట్టాం
‘ఈటీవీ భారత్‌’ ముఖాముఖిలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌

రోనా బారి నుంచి బయటపడేందుకు దేశం చేస్తున్న ప్రయత్నాల వల్ల ఇప్పటికే మంచి ఫలితాలు వచ్చి, ప్రపంచమంతా మనవైపు చూస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. సకాలంలోనే అప్రమత్తమై చర్యల్ని చేపట్టామని, రాష్ట్రాలను సమన్వయపరచుకుంటూ కట్టుదిట్టంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడంపై అందరం దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు. ‘ఈటీవీ భారత్‌’ ముఖాముఖిలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

కరోనా నియంత్రణలో ఉందని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోందా?
చైనాలో కొవిడ్‌-19 బయటపడగానే మొట్టమొదట స్పందించిన దేశాల్లో భారత్‌ ఒకటి. ఈ వైరస్‌ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు జనవరి 7న చైనా తెలియపరిస్తే 24 గంటల్లోపే నిపుణులతో సమావేశం నిర్వహించాం. 10-14 రోజుల్లో రాష్ట్రాలకు సవివర మార్గదర్శకాలు వెలువరించాం. చైనా, హాంకాంగ్‌ల నుంచి వస్తున్నవారిపై జనవరి 18 నుంచి కన్నువేసి ఉంచాం. ఇతర దేశాలతో పోలిస్తే మనం మెరుగ్గా ఉన్నాం. యావత్‌ ప్రపంచం ఇప్పుడు మనల్ని గమనిస్తోంది.

కేసులు పెరిగిపోతున్నాయి కదా?
మొదట్లో రోజుకు 2000 మందికి పరీక్షలు జరిగేవి. ఇప్పుడు 85,000 మందికి చేస్తున్నాం. రాష్ట్రాలూ బాగా స్పందిస్తున్నాయి. మనకన్నా చిన్న దేశాల్లో లక్షల కేసులు వస్తుంటే మనవద్ద గత మూడు నెలల్లో 60వేల కేసులు కనిపించాయి.
పరీక్షల సంఖ్య పెంచడం వల్లనే కేసులు పెరిగినట్లు అనిపిస్తుంది.

ప్రస్తుత వ్యూహంలో హేతుబద్ధత ఎంత? అది సరిపోతుందా?
జనవరిలో మొదటి కేసు బయటపడిన నాటికి మనవద్ద ఒక్క ప్రయోగశాలే ఉండేది. ఇప్పుడు 472 ఉన్నాయి. రోజుకు 95వేల పరీక్షలు పూర్తి చేయవచ్చు. ఎవరిని పరీక్షించాలో స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. మన పరీక్షల సామర్థ్యాన్ని బట్టి సమస్యలను గుర్తించి, హాట్‌స్పాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఖరారు చేయగలుగుతున్నాం.

కేంద్రం చెబుతున్న అంకెలకు, కొన్ని రాష్ట్రాలు వెల్లడిస్తున్న గణాంకాలకు మధ్య పొంతనే ఉండడం లేదెందుకు?
ఎలాంటి వ్యత్యాసాలు లేవు. అంతా పారదర్శకంగా కొనసాగుతోంది. అన్ని వివరాలను మా మంత్రిత్వశాఖ సేకరిస్తోంది. ఇది చాలా పెద్దపని కావడం వల్ల వేర్వేరు వెబ్‌సైట్లలో గణాంకాలు కొంత తేడాగా అనిపించవచ్చు. కేసుల తీవ్రతను బట్టి వ్యూహం మారుతూ ఉంటుంది. ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి అనే స్పష్టత ప్రభుత్వానికి ఉంది.

కొవిడ్‌పై పోరులో ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి?
పెద్ద నగరాల్లో పెద్ద మురికివాడలు, విదేశీయుల వెల్లువ, వ్యక్తిగత దూరం/ లాక్‌డౌన్‌ నిబంధనను పక్కాగా అమలు చేయడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. తబ్లీగీల అంశం, వలస కూలీల పయనం వంటివి సవాళ్లే. ఇప్పుడు విదేశాలనుంచి తిరిగి వస్తున్నవారొక సవాల్‌.

ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల నాణ్యతపై అనుమానాలు తలెత్తాక ఇటీవల వాటిని వెనక్కి తీసుకున్నారు కదా... వాటికి ప్రత్యామ్నాయమేమిటి?
కిట్లు సరిగా పనిచేయడం లేదని గుర్తించాక వెంటనే వాటి వాడుకను నిలిపివేశాం. దేశీయంగానే ఉత్పత్తి చేయించే పనిలో ఉన్నాం. ఎలీసా టెస్ట్‌ కిట్‌ను ఐసీఎంఆర్‌ అభివృద్ధి చేసింది. ఇది యాంటీబాడీ టెస్ట్‌ కిట్లకు ప్రత్యామ్నాయంగానో, అదనంగానో ఉంటుంది.

వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) సరఫరాను పెంచడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు?
మొదట్లో పీపీఈలకు కొరత ఉండేది. అదే మనకొక అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం 100కి పైగా అధీకృత తయారీదారులు రోజుకు మూడు లక్షల పీపీఈ కిట్లు ఉత్పత్తి చేస్తున్నారు.

ప్రైవేటు రంగాన్ని ఇంకా ఎలా వినియోగించుకోవాలని కేంద్రం యోచిస్తోంది?
తొలినాళ్లలోనే ప్రైవేటు వైద్యులను, ప్రైవేటు ఆసుపత్రుల సంఘాన్ని పిలిచి మాట్లాడాం. సానుకూలంగా స్పందన లభించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో వృత్తిపరమైన, సామాజికమైన బాధ్యత వారికీ ఉంది.

కరోనాకు కళ్లెం వేయడంపై మీరు ఎంతమేరకు ఆశాభావంతో ఉన్నారు?
వైరస్‌లు ఏదో ఒక రూపంలో మానవాళిపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. భవిష్యత్తులో కూడా మనం వ్యక్తిగత దూరం పాటిస్తూ, చేతులు శుభ్రపరచుకుంటూ, మాస్కులు ధరించాలి. లాక్‌డౌన్‌ నుంచి నెమ్మదిగా బయటకు వచ్చాక ఆర్థిక రంగాన్ని పునర్నిర్మించుకునేందుకు మనమంతా సానుకూలంగా దోహదపడాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.