close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రష్యా అతలాకుతలం!

  విశృంఖలంగా వైరస్‌ వ్యాప్తి
  ప్రపంచంలో రెండోస్థానం
  మరణాల రేటు తక్కువతో ఊరట

కరోనా దెబ్బకు రష్యా విలవిల్లాడుతోంది. సరిహద్దున ఉన్న చైనాలో కరోనా విజృంభిస్తున్నపుడు... ఇటలీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికాల్లోనూ వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్నపుడూ రష్యాలో మాత్రం అతి తక్కువగా కేసులు నమోదయ్యాయి. మార్చిలో ధీమాగా కనిపించిన ఈ దేశం ఏప్రిల్‌ మొదటి వారం నుంచి డీలా పడటం మొదలైంది. 14.6 కోట్ల జనాభా ఉన్న రష్యాలో కేసులు దాదాపు 3 లక్షలకు చేరువయ్యాయి. ఎందుకిలా జరుగుతోంది? దేశమంతటా ఒకేలా ఉందా... అక్కడి ఆరోగ్య వ్యవస్థల పరిస్థితి ఏమిటి...?

నిర్లక్ష్యమే కొంప ముంచింది
ప్రపంచమంతా వైరస్‌ బారిన పడుతున్నప్పుడు రష్యా కొంతమేరకు సురక్షితంగానే కనిపించింది. అక్కడ జనవరి 30నే చైనాతో సరిహద్దును మూసేశారు. దేశంలోకి వచ్చే ప్రతి ప్రయాణికుణ్ని పరీక్షించాలని అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశించారు. అయితే... క్షేత్రస్థాయిలో అటు అధికారులు, ఇటు ప్రజలు సమస్య తీవ్రతను పట్టించుకోలేదు. ఇటలీ, ఫ్రాన్స్‌ లాంటి దేశాల నుంచి వచ్చే వారినీ సరిగ్గా పరీక్షించకుండానే వదిలేశారు. లాక్‌డౌన్‌ విధించినా ప్రజలు వీధుల్లోనే తిరిగారు. గుమిగూడటం ఆపలేదు. దాని ఫలితమే ప్రస్తుతం ఈ దేశంలో రోజుకు సగటున 10 వేల కేసులు నమోదవుతున్నాయి. మొత్తం నమోదైన కేసుల్లో సగం దేశ రాజధానిలోనే ఉంటున్నాయి. మొదట్లో మాస్కోలోనే కేంద్రీకృతమైన వైరస్‌... ప్రస్తుతం దేశమంతటా వ్యాపిస్తోంది. దేశప్రధాని, ముగ్గురు మంత్రులు, అధికార ప్రతినిధి వైరస్‌ బారిన పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ కొనసాగించాలా, సడలించాలా అన్న నిర్ణయాన్ని అధ్యక్షుడు పుతిన్‌... స్థానిక నాయకులకే వదిలేశారు. ఓ సందర్భంలో ‘దశలవారీగా దేశమంతటా ఆంక్షలు తొలగిస్తా’మని ఆయన ప్రకటించగా... ‘తామేమీ తొందరపడటం లేద’ని మాస్కో మేయర్‌ సెర్గీ సోబ్యానిన్‌ భిన్నంగా స్పందించారు. పరిస్థితిని అంచనా వేయకుండా పరిమితులు ఎత్తేస్తే మహమ్మారి రెండోసారీ విజృంభించే ప్రమాదం ఉందనేది మేయర్‌ వాదన.

సంక్షోభంలో ఆరోగ్య వ్యవస్థ
మాస్కో నగరం సుందరంగా, సంపన్నంగా కనిపిస్తుంది. మెరుగైన వైద్య సౌకర్యాలు ఉన్నాయి. మాస్కో దాటి చూస్తే దేశం అసలు చిత్రం కనిపిస్తుంది. నగరానికి 10 మైళ్ల దూరంలోనే ఇవాంటెయెక్కా పట్టణ ఆస్పత్రిలో సౌకర్యాల లేమి, వైద్యం దుస్థితిపై ఇటీవల ఓ వీడియో వైరల్‌ అయింది. దేశంలో ప్రాంతీయ ఆరోగ్య వ్యవస్థలు నామమాత్రంగా మారాయి. ఏప్రిల్‌లో మాస్కోలో మాత్రమే ప్రత్యేకంగా కరోనా ఆస్పత్రిని ఆగమేఘాలపై నిర్మించారు. ఇప్పుడు దేశమంతటా కేసులు పెరగడంతో స్థానిక ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు, సిబ్బంది లేకుండా వైద్యం అందించడం గగనమే. రష్యాలో పరిస్థితిని గుర్తించిన అమెరికా 200 వెంటిలేటర్లను ఉచితంగా పంపేందుకు సిద్ధమవుతోంది.
* కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి అదనంగా బోనస్‌ ఇస్తామని రష్యా ప్రభుత్వం మొదట్లో ప్రకటించింది. తీరా చూస్తే ఏప్రిల్‌లో అసలు జీతాల్లోనే కోత విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో తాము సేవలందించలేమంటూ అక్కడి నర్సులు వీడియో సందేశాలిచ్చి, ఉద్యోగాలను వదిలేస్తున్నారు.

పొంతన లేని లెక్కలు
రష్యాలో స్థానిక ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ రోజువారీగా నమోదవుతున్న కేసులు ప్రకటిస్తున్నాయి. అయితే జాతీయ గణాంకాలకు, వీటికి పొంతన లేదని ఆరోపణలు ఉన్నాయి. స్థానిక వివరాలతో పోలిస్తే జాతీయ గణాంకాలు, ముఖ్యంగా మరణాలు తక్కువగా ఉంటున్నాయని, సైబీరియాలోని మరణాలను అసలే కలపడం లేదన్న విమర్శలున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం శవపరీక్ష నివేదిక, ప్రత్యక్షంగా కరోనా సమస్యలతో సంభవించిన మరణాలనే లెక్కలోకి తీసుకుంటున్నామని చెబుతున్నారు. అయితే... మరణాల రేటులో ప్రపంచంలో 6.8% నమోదవుతుండగా రష్యాలో 0.9% ఉండటం ఊరట కలిగిస్తోంది. కరోనా కేసుల్లో ఏకంగా 40% గుప్తవాహకులే ఉండటంతో అంతటా కలకలం రేపుతోంది.

తగ్గిపోతున్న జనాభా
విస్తీర్ణపరంగా ప్రపంచ భూభాగంలో రష్యా వాటా 11%. కానీ ఉన్న జనాభా కేవలం 2%. పెద్ద దేశాల్లో జననాల కంటే మరణాల రేటు ఎక్కువ ఉన్నది కూడా ఇక్కడే. కరోనాకు ముందే... రష్యాలో వివిధ వ్యాధులతో రోజుకు 5 వేలకు పైగా మరణాలు నమోదవుతాయి. ఇప్పుడు కరోనా ఆ సంఖ్యను మరింత పెంచేస్తే జనాభా మరింతగా తగ్గిపోతుందన్న ఆందోళన నెలకొంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.