close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మరో రెండున్నర నెలలు కీలకం

జులై, ఆగస్టు మధ్య అత్యధిక కేసులు
మాస్కులు మనల్ని కాపాడుతాయ్‌

భౌతిక దూరమూ అత్యంత ముఖ్యం
సంప్రదాయ ఆహారంతో రక్షణ
ఈటీవీ భారత్‌తో వైరాలజిస్టు డాక్టర్‌ టి.జాకబ్‌ జాన్‌

కరోనా దెబ్బకు కుంగుతున్న సమాజంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి ప్రయత్నం జరుగుతోంది. దేశంలో లాక్‌డౌన్‌లను సడలిస్తూ ప్రజా రవాణాను అనుమతిస్తున్నారు. అంటే వైరస్‌ వ్యాప్తికి మరింత అవకాశం ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? కేసుల నమోదు తీవ్రత ఎలా ఉంటుంది? వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటి? మనల్ని మనం రక్షించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుంది? అనే సందేహాలను దేశంలోని సీనియర్‌ వైరాలజిస్టుల్లో ఒకరైన డాక్టర్‌ టి.జాకబ్‌ జాన్‌ నివృత్తి చేశారు. రాబోయే రెండున్నర నెలలు అత్యంత కీలకమని ఆయన చెప్పారు. ఈ మేరకు ‘ఈటీవీ-భారత్‌’తో ఆయన మాట్లాడారు.

దేశంలో ఆర్థిక రంగాన్ని మళ్లీ పట్టాలెక్కించడానికి లాక్‌డౌన్‌ను నెమ్మదిగా సడలిస్తున్నారు. ఇలాంటి సమయంలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటే మేలు?
జవాబు: ప్రస్తుత పరిస్థితిని రెండు దశలుగా చూడాలి. మొదటిది... లాక్‌డౌన్‌ ఉన్నా కరోనా మహమ్మారి మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 15 వరకు అంటే 20 రోజుల్లో దాదాపు 20 రెట్లు పెరిగింది. ఒకవైపు ఆర్థికరంగం పూర్తిగా కుదేలవుతుంటే... మరోవైపు వైరస్‌ వ్యాప్తి అంచనాలకు భిన్నంగా పెరిగింది. ఈ సమయంలోనే వ్యాధిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా పకడ్బంధీ చర్యలు తీసుకోవాల్సింది. వైరస్‌ విస్తరిస్తున్నప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరని అందరికీ సులభంగా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లి ఉంటే... ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లి ఉండేవాళ్లం.
* రెండో దశలో ప్రజల మధ్య భౌతిక దూరం నిబంధనను 6-8 అడుగుల నుంచి 2-3 అడుగులకు సడలించేవాళ్లం. ఏప్రిల్‌ 15 నుంచే ఆర్థిక, సామాజిక, వైద్య, విద్య, రవాణా, పారిశ్రామిక తదితర రంగాలన్నీ తెరవాల్సి ఉండింది. అదే సమయంలో వృద్ధులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని ఇళ్లకే పరిమితం చేస్తే సరిపోయేది. రెండో దశ లాక్‌డౌన్‌ పొడిగించినప్పుడు నేను వ్యక్తిగతంగా అసంతృప్తికి గురయ్యా. మూడోసారి పొడిగింపుతో మరింత ఆందోళన చెందా.

కరోనా వ్యాప్తికి, అధిక ఉష్ణోగ్రతల మధ్య ఏమైనా సంబంధముందా? వేడి వాతావరణం వైరస్‌ను అడ్డుకుంటుందా?
బయట వాతావరణం ఎలా ఉన్నా... శరీర ఉష్ణోగ్రత మాత్రం 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటుంది. ఈ వైరస్‌ తుంపర్ల ద్వారా విస్తరిస్తూ... శ్వాస ద్వారా సోకుతుంది. వాతావరణంలో వేడి పెరిగితే వస్తువుల ఉపరితలాల నుంచి సోకే ప్రమాదం కొంతమేరకు తగ్గవచ్చు. అయితే... వాతావరణం చల్లబడిన తర్వాత మళ్లీ విస్తరిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

మరణాల రేటు భారత్‌లో తక్కువగా ఉంది. ఐరోపావాసులు, అమెరికన్లతో పోలిసే భారతీయుల్లో అధిక రోగ నిరోధక శక్తి ఉండటమే ఇందుకు కారణమా?
మరణాల శాతం జనాభాలోని వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధుల బాధితులపై ఆధారపడి ఉంటుంది. భారత్‌తో పోలిస్తే అమెరికాలో వారి సంఖ్య అధికం. దాంతో అక్కడ అధికంగా ఇక్కడ తక్కువగా చనిపోతారు.

అల్లం, వెల్లుల్లి, మిరియాల తదితరాలతో కూడిన భారతీయుల సంప్రదాయ ఆహారం వైరస్‌తో పోరాటంలో కలిసి వస్తోందా?
నిత్యం పోషకారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తుంటే మన రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది. కృత్రిమ విధానాలు ఉపయోగపడవు. ఉబకాయాన్ని తగ్గించుకోవాల్సిందే. మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉండేలా చూసుకుంటే వైరస్‌లతో వచ్చే నష్టాలను తగ్గించుకోవచ్చు.


పోలియో నిర్మూలనలో కీలక భూమిక

కేరళకు చెందిన టి.జాకబ్‌ జాన్‌ 1958లో త్రివేండ్రంలో ఎంబీబీఎస్‌ చేశారు. పిల్లల వ్యాధులు, మైక్రోబయాలజీ, వైరాలజీలలో స్పెషలైజేషన్‌ చేశారు. బ్రిటన్‌, అమెరికా దేశాల్లోనూ గుర్తింపు సాధించారు. వెల్లూరు మెడికల్‌ కళాశాలలో విభాగాధిపతిగా పదవీ విరమణ పొందారు. దేశంలోనే తొలి వైరాలజీ ప్రయోగశాలను స్థాపించారు. రక్తదాతల నుంచి హెపటైటిస్‌-బి వ్యాధి సోకే ప్రమాదముదని 1972లోనే కనిపెట్టారు. చుక్కల విధానంలో అమలు చేస్తున్న పోలియో టీకాలో లోపాలను ప్రపంచంలోనే తొలిసారిగా కనిపెట్టి, వాటిని సరిచేశారు. ఆయన ప్రారంభించిన విధానాన్నే ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనకు ఉపయోగించారు. భారతదేశంలోనే తొలిసారిగా 1980లో సెక్స్‌వర్కర్లలో హెచ్‌ఐవీని కనుగొన్నారు. ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో నడిచిన ఎయిడ్స్‌ పరీక్షల విధానానికి సలహాదారుగా పనిచేశారు. ముందస్తుగా పరీక్షించిన తర్వాతే దాతల రక్తాన్ని బాధితులకు ఎక్కించాలనే నియమాన్ని అమలులోకి తెచ్చారు.


ఎన్నో నిబంధనలతో ప్రజా రవాణాను అనుమతిస్తున్నారు. వీటిలో భౌతిక దూరం పాటించడం సాధ్యం అవుతుందా?
భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించడానికి ఒక సులభ, నాణ్యమైన విధానముంది. ఇప్పుడున్న 6-8 అడుగుల నిబంధనను 2-3 అడుగుల వరకు తగ్గించుకోవడమే. దీన్ని గుడ్డతో చేసిన మాస్కును ధరించడం ద్వారా సాధించవచ్చు. అప్పుడు సాధారణ జీవితాన్ని పునః ప్రారంభించి, కొనసాగించవచ్చు. అలాగే మహమ్మారి కనుమరుగయ్యే వరకు సభలు, సమావేశాలు, సమూహిక పూజలు/ప్రార్థనలు, ఉత్సవాలకు దూరంగా ఉండాల్సిందే.

దేశంలోకి రుతు పవనాలు ప్రవేశించాక వైరస్‌ కేసులు భారీగా పెరిగే ప్రమాదముందా? అదే సమయంలో రుతు పవనాలు విస్తరించని ప్రాంతాలు సురక్షితంగా ఉంటాయా?
ఇప్పుడే ఏమీ చెప్పలేం. రుతు పవనాలు వచ్చాక ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుంది? రానున్న కొన్ని నెలల్లో ఏమైనా టీకాలు వచ్చే అవకాశముందా? ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందా?
టీకాలు వచ్చే వరకు మహమ్మారి అంతమవదు. ఇక వైరస్‌ సోకితేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే... 80% ఇన్‌ఫెక్షన్లలో లక్షణాలు కనిపించవు. వైరస్‌ సోకిన వారు కూడా తాము వైరస్‌ బారిన పడినట్లు గ్రహించలేరు. అందుకే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. భారత్‌లో జులై-ఆగస్టు మధ్య పాజిటివ్‌ కేసులు అత్యధికం అవుతాయని మేం అంచనా వేస్తున్నాం. ఈ మహమ్మారి 2020 చివరల్లో లేదా 2021 ప్రారంభంలో అంతమవడం మొదలవుతుందని భావిస్తున్నాం. ఔషధాలు త్వరలోనే రావచ్చు. హెచ్‌ఐవీ మందు రెమిడెస్విర్‌ బాగానే పనిచేస్తోంది. ఒకటి లేదా రెండు టీకాలు 2021 ప్రారంభంలోనే వస్తాయనే అంచనా ఉంది.

- హైదరాబాద్‌, ఈటీవీ భారత్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.