close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మొక్కల ఆరోగ్యం మనకు భాగ్యం

పైర్లపై విచ్చలవిడి రసాయన మందుల పిచికారీ ప్రమాదమే
‘ఈనాడు-ఈటీవీ’తో జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ
సంచాలకురాలు ఎలీస్‌ ఆర్‌.పి.సుజీత

మన పంటల్లోని ఆరోగ్యకరమైన మొక్కలు నాణ్యమైన పంట దిగుబడులను ఇస్తాయి. వాటి నుంచి వచ్చే ఆహారోత్పత్తులే మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. పంటలకు తెగుళ్లు సోకినపుడు వెంటనే ఎక్కువ విషపూరిత రసాయనాలు చల్లితే పోతాయనే అపోహలున్నాయి. అందుకే వాటిని రైతులు అధికంగా పిచికారీ చేస్తున్నారు. ఆ మందులను ఎక్కువగా వాడకుండానే తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. దానిపై రైతులను చైతన్యపరచాల్సిన అవసరముంది. అని వివరిస్తున్నారు. ఎలీస్‌ ఆర్‌.పి.సుజీత.
కేంద్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నడిచే ‘జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ’(ఎన్‌ఐపీహెచ్‌ఎం) రాజేంద్రనగర్‌లో ఉంది. ఆ సంస్థలో మొక్కల ఆరోగ్యం, జీవ భద్రత విభాగం సంచాలకురాలిగా పనిచేస్తున్న సుజీత.. పంటలపై రసాయన పురుగుమందుల వల్ల వాటిల్లుతున్న నష్టాలు, రైతులు, ప్రజలు, పైర్ల ఆరోగ్యం నాశనమవుతున్న తీరుతెన్నుల గురించి ‘ఈనాడు-ఈటీవీ’తో ముఖాముఖి మాట్లాడారు. ఆ విశేషాలు...


2020ని ‘అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది కదా? మొక్కల ఆరోగ్య పరిరక్షణ ఎలా చేపట్టాలి ?

మొక్కల ఆరోగ్యాన్ని కాపాడితే అందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించవచ్చు. పంటల ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లలో అమ్ముకోవాలంటే ఇక్కడ మన పైర్లలోని మొక్కల ఆరోగ్యం ఎలా ఉందనేది ఎంతో కీలకం. మంచి ఆరోగ్యంతో పెరిగే మొక్కల నుంచే నాణ్యమైన దిగుబడులు వస్తాయి. వాటిలో రసాయనాల అవశేషాలుంటే మన పంటలకు అంతర్జాతీయ మార్కెట్‌లో ఆదరణ లభించదు. అందుకే.. భూసారం పెంచేలా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నాం.

 


విషపూరిత రసాయన పురుగుమందులను పైర్లపై వాడకుండా రైతులను. నియంత్రించడం ఎలా ?
ఆ మందులను విచ్చలవిడిగా పంటలపై వాడటం వల్ల భూసారం, నీరు, పర్యావరణం దెబ్బతింటున్నాయి. మొక్కల ఆరోగ్యం కోసం ‘సమగ్ర తెగుళ్ల నిర్వహణ’ విధానం అనుసరించాలి. జీవ, పర్యావరణ పరిరక్షణ ఇంజినీరింగ్‌ పద్ధతులు పాటించాలి. తాము చల్లే రసాయనాలతో రైతులు తమకు తెలియకుండానే మిత్ర పురుగులను సైతం నాశనం చేస్తున్నారు.


రసాయనాలు వాడకుండా తెగుళ్లను ఎలా అరికట్టవచ్చు ?
ఒక పంటపై తెగులు వ్యాప్తి చేసే కీటకాలకు అదే ప్రాంతంలో రెట్టింపు స్థాయిలో మిత్ర పురుగులుంటే రసాయన పురుగుమందులు చల్లాల్సిన అవసరం లేదు. మిత్ర పురుగులే తెగుళ్లను వ్యాపింపజేసే కీటకాలను, ఇతర పురుగులను నాశనం చేసేలా మనం వాటిని అభివృద్ధి చేయాలి. ఇంకా జీవనాశినులు, జీవ ఎరువులు ఇవన్నీ వాడితే రసాయనాలు లేకుండా చాలావరకూ తెగుళ్లను అరికట్టవచ్చు.


అంతర్జాతీయ మార్కెట్లకు పంపే మన ఆహారోత్పత్తులపై రసాయన అవశేషాలున్నాయని తిరస్కరిస్తున్నారు.. దీన్ని అధిగమించడమెలా..?

పంటలపై రసాయన పురుగుమందుల వాడకం వల్ల అది పెద్ద సమస్యగా మారింది. ఏ పంటపై ఏ తెగులు సోకితే ఎంత తీవ్రత కలిగిన రసాయన మందును ఎంత మోతాదులో చల్లాలనే వివరాలను తెలిపేందుకు కేంద్ర వ్యవసాయశాఖలో సీఐబీఆర్‌ నమోదు కమిటీ ఉంది. దేశంలో అత్యంత విషపూరితంగా ఉన్నాయని తాజాగా 27 మందుల నిషేధానికి ముసాయిదా బిల్లును అది విడుదల చేసింది. కమిటీ సిఫార్సు చేసిన మందులనే తగు మోతాదులో వాడితే ఆహారోత్పత్తులపై అవశేషాలకు ఆస్కారం ఉండదు.

 


రైతులకు ఏ మందు ఎలా వాడాలో ఎవరు చెప్పాలి ?
పంటకు తెగులు సోకితే సమీప వ్యవసాయాధికారిని లేదా పరిశోధనా సంస్థలను సంప్రదించాలి. మా ఎన్‌ఐపీహెచ్‌ఎం తరఫున కూడా ‘మొక్కల ఆరోగ్య పరిరక్షణ క్లినిక్‌’లున్నాయి వాట్సప్‌ నెంబరు ద్వారా తెగుళ్ల నివారణకు సలహాలు. సూచనలు ఇస్తున్నాం.


రసాయనాల వాడకాన్నితగ్గించేందుకు వరంగల్‌ జిల్లాలో మీ సంస్థ చేసిన ప్రయోగం ఫలితాలు.?
అక్కడి రైతులకు రసాయన ఎరువులు, విషపూరిత పురుగుమందుల వాడకంపై అవగాహన కల్పించాం. వరి, పత్తి, మిరప సస్యరక్షణపై చైతన్యపరిచాం. పొలాల్లోనే జీవ కీటకనాశినుల తయారీ నేర్పించాం. వారు ఉత్పత్తి చేసి పర్యావరణ పరిరక్షణ విధానంలో వాడుతున్నారు. ఫలితాలు బాగున్నాయి.


రసాయనాలను వీడి సేంద్రియ వ్యవసాయం చేస్తే దేశ ఆహార భద్రతకు సమస్య ఉండదా ?
సేంద్రియ వ్యవసాయం ఉపయోగంపై రైతులకు మా సంస్థలో 3 నెలల శిక్షణ కోర్సు ఉంది. ఇదెంత మంచిదో, పంటలను ఎలా కాపాడుతుందో చెపుతాం. దేశ ఆహార అవసరాలు సేంద్రియంతో తీరవనే విమర్శలున్నాయి, నిజమే. కానీ ఏడాదిలోనో, ఒకరోజులోనో మంచి ఫలితాలు రాకపోవచ్చు. కానీ నిరంతరం సేంద్రియ వ్యవసాయం చేస్తే సత్ఫలితాలు సాధ్యమే.


రైతులను ఎలా ఏకం చేశారు, ఏం చెప్పారు ?

రైతులను ఒకే వేదికపైకి తేవడానికి ‘జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ’(మేనేజ్‌)తో కలసి ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ అభివృద్ధి చేశాం. లక్షా 20వేల మంది రైతులను ఇందులో నమోదు చేయించాం. వారికి ఏ సమస్య వచ్చినా ఇందులో తెలిపితే వెంటనే పరిష్కారం చూపుతున్నాం. వాట్సప్‌లోనూ పంటల తెగుళ్ల ఫొటోలు పెట్టి ఎలా అరికట్టవచ్చనేది తెలుసుకుంటున్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.