close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వాయిదా పడని వేధింపులు!

ఈఎంఐలు చెల్లించలేక చిరు సంపాదనపరులు సతమతం
బలవంతం చేస్తున్న ఫైనాన్స్‌ సంస్థలు
ఫోన్‌లోనే బెదిరింపులకు దిగుతున్న ఏజెంట్లు
ఈనాడు - హైదరాబాద్‌

చిరు ఉద్యోగం....జీతం కొంచెమే. అయినా రెక్కల కష్టంతో బతుకు బండిని సాఫీగానే నడిపే వాళ్లు. లాక్‌డౌన్‌ కారణంగా మూత పడిన కంపెనీలు జీతాలు చెల్లించలేదు. పలు సంస్థలు సగమే జీతం చెల్లించాయి. ఈ పరిణామాలతో నెలకు ఎంతో కొంత వాయిదాలు చెల్లిస్తామనే విశ్వాసంతో వస్తువులు కొనుగోలు చేసిన చిరుద్యోగులు, పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి కోల్పోయి, వాయిదాల సొమ్ము చెల్లించాలంటూ ఫైనాన్స్‌ సంస్థలు తెస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేక లక్షలాది మంది సతమతమవుతున్నారు.
దైనందిన జీవితంలో భాగమైన వినియోగ వస్తువుల కొనుగోలు విధానం వాయిదాల పద్ధతితో సరళతరమైంది. వేలమంది చిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.
ఒక్కసారిగా చెల్లించి కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేనివాళ్లు ఎందరో ఈ విధానంలో గృహోపకరణాలు, మొబైల్స్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఏదో ఒక ఫైనాన్స్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందాల మేరకు విక్రయ సంస్థలే ఇలాంటి వారికి డెబిట్‌, క్రెడిట్‌, క్యాష్‌కార్డుల రూపంలో తక్కువ వడ్డీ లేదా సున్నా వడ్డీ రుణాలతో వస్తువులు విక్రయిస్తుండటం మరింత వెసులుబాటు ఇచ్చింది. ఇప్పటివరకు ఆ విధానం ఇరువురికీ ప్రయోజనం కల్పించినా, లాక్‌డౌన్‌ చిక్కులు తెచ్చిపెట్టింది.

చెల్లించే పరిస్థితేది?
కరోనా లాక్‌డౌన్‌తో భారీ సంఖ్యలో ఉద్యోగాలపై ప్రభావం పడింది. అసంఘటిత రంగంలోని కార్మికులు, చిన్న ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. వేతనం లేకపోవడంతో వారంతా అప్పులు చేస్తూ బతుకు బండి లాక్కొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేసిన వస్తువుల తాలూకూ ఈఎంఐలు కట్టడం వారికి తలకుమించిన భారంగా మారింది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో వాయిదాలు డీఫాల్ట్‌ అవుతున్నాయి. దీంతో కొనుగోలుదారులపై ఆర్థిక సంస్థల ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు. ‘‘ఏదో రూపంలో చెల్లించాలంటూ ఏజెంట్లు బెదిరింపులకు దిగుతున్నారు. ఇళ్లకూ వస్తున్నారు. దీంతో తమ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది’’ అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విక్రయాలపైనా తీవ్ర ప్రభావం
రెండు నెలలుగా వ్యాపారాలు లేకపోవడం, ఆర్థిక సంస్థలు కూడా వస్తువుల కొనుగోలుకు రుణాలిచ్చే విషయమై ఆచితూచి వ్యవహరిస్తుండటం అమ్మకాలపై ప్రభావం చూపుతోందని హైదరాబాద్‌లో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ షోరూం మేనేజర్‌ తెలిపారు. ‘‘ఆర్థిక సంస్థలకు రెండు నెలల్లో 40 నుంచి 60 శాతం వాయిదాలు వసూలు కాలేదు. ప్రస్తుతం పూర్తి మొత్తం చెల్లించే వారికే వస్తువులు విక్రయిస్తున్నాం’’అని ఆయన వెల్లడించారు.


* చాలామంది మధ్యతరగతివారు గృహోపకరణాలు, మొబైల్స్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువుల వంటివాటిని వాయిదాల పద్ధతిలో కొంటుంటారు.
* కరోనా లాక్‌డౌన్‌ ఉద్యోగాలు, వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది.
* సంపాదన లేకపోవడంతో ఈఎంఐలు కట్టడం భారంగా మారింది.
* కొన్ని సంస్థలకు గత రెండు నెలల్లో 40 నుంచి 60 శాతం వాయిదాలు వసూలు కాలేదని సమాచారం.


ఫోన్‌ వాయిదా కట్టలేకపోయా

- రాజేష్‌, సేల్స్‌బాయ్‌

షాపింగ్‌మాల్‌లో సేల్స్‌బాయ్‌గా పనిచేస్తున్నా. ఫిబ్రవరిలో ఆన్‌లైన్లో రూ.11,090 విలువైన  ఫోన్‌ కొన్నా. ఈఎంఐ పద్ధతిలో నెలకు రూ.1,850 చొప్పున చెల్లించేలా అంగీకారం తీసుకున్నా. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌ నుంచి వాయిదాలు చెల్లించలేకపోయా. ఫైనాన్స్‌ సంస్థ చేస్తున్న ఒత్తిడితో ఆందోళన చెందుతున్నా.


కార్డు బ్లాక్‌ చేశారు

- వెంకటేశ్వర్లు, ప్రైవేటు ఉద్యోగి

క్రెడిట్‌ కార్డుపై రూ.23 వేల విలువైన రిఫ్రిజిరేటర్‌ కొన్నా. ఈ మొత్తాన్ని ఆరు నెలల వాయిదాలుగా మార్చుకున్నా. లాక్‌డౌన్‌తో జీతం సగమే వచ్చింది. వస్తున్న ఆదాయం ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు. రెండు నెలల ఈఎంఐ చెల్లించకపోవడంతో  కార్డును బ్లాక్‌ చేశామని, బాకీలు చెల్లిస్తేనే మనుగడలోకి వస్తుందని బ్యాంకు నుంచి సమాచారం వచ్చింది. ఆదాయం లేకపోవడం, కార్డు బ్లాక్‌ కావడంతో ఇబ్బంది పడుతున్నా.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.