close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సంక్షోభం నుంచి పాఠాలు నేర్వాలి

అప్పుడే విద్యకు భవిష్యత్తు - సాంకేతికత వినియోగమూ అవసరమే
‘కరోనా అనంతరం విద్యా సంవత్సర భవిష్యత్తు’పై ఈటీవీ చర్చలో నిపుణులు
ఈనాడు - హైదరాబాద్‌

రోనా సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని మన విద్యావ్యవస్థలో లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు, సంఘాల నేతలు, కళాశాలల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సాంకేతికతను వినియోగించుకుంటూ...సామర్థా్యలను పెంచుకుంటూ...నాణ్యమైన విద్యను అందించే దిశగా కృషి చేయాలని సూచించారు. కరోనా అనంతరం విద్యా సంవత్సరం భవిష్యత్తేంటి? అనే అంశంపై శనివారం ఈటీవీ నిర్వహించిన చర్చలో పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. చర్చా కార్యక్రమానికి ‘ఈనాడు’ తెలంగాణ సంపాదకుడు డీఎన్‌ ప్రసాద్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రభుత్వాలు విద్యారంగానికి అన్ని విధాలా ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అన్ని రంగాల్లో సాంకేతికత చొచ్చుకొచ్చినా...విద్యారంగంలో దాన్ని వాడుకోవడంలో వెనకబడ్డామని... అన్ని వర్గాల పిల్లలకు సాంకేతికతను చేరువ చేయాలన్నారు. బట్టీ విధానం కాకుండా పాఠ్యాంశాల భావనలు లోతుగా నేర్చుకునేలా మార్చుకోవాల్సిన అవసరం ఉందని వక్తలు ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు. విద్యారంగంతోపాటు అన్ని రంగాల్లో 70 ఏళ్లుగా అంతా బాగుందన్న నటన కట్టిపెట్టి నిజాయితీగా లోపాలను గుర్తించి.. సరిదిద్దుకోవాలని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ కుండబద్దలు కొట్టారు.


బట్టీ విధానం మారాలి

విద్యారంగంపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై వివిధ వర్గాలతో ప్రభుత్వాలు చర్చించి...ప్రామాణికమైన మార్గదర్శకాలు రూపొందించాలి. బట్టీ పట్టించే విధానం మారాలి. ప్రస్తుతం ఉపాధ్యాయుడి కేంద్రంగా విద్యాబోధన కొనసాగుతోంది. ఇక నుంచి విద్యార్థి కేంద్రంగా దాన్ని మార్చాలి.

- డాక్టర్‌ పీవీఆర్‌కే మూర్తి, డైరెక్టర్‌, గాయత్రి విద్యాసంస్థలు



కేంద్రం మార్గదర్శకాలు ఇవ్వాలి

లాక్‌డౌన్‌ సమయంలోనూ సాంకేతికత వినియోగంతో విద్యార్థులు నష్టపోకుండా చూశాం. బ్యాండ్‌విడ్‌్త సరిపోక వీడియో రావటం లేదని విద్యార్థులంటున్నారు. కేంద్రం ఆన్‌లైన్‌ బోధనపై మార్గదర్శకాలు ఇవ్వాలి.

- డాక్టర్‌ పి.ప్రమీల, నారాయణ విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌


పిల్లల్ని పంపేందుకు సిద్ధంగా లేరు

ప్రభుత్వాలు కరోనా వైరస్‌తో సహజీవనం చేయాల్సిందేనని చెబుతున్నాయి. వాటిని తల్లిదండ్రులు నమ్మడం లేదు. బడులు తెరిచినా పంపేందుకు వారు సిద్ధంగా లేరు. పరిస్థితి సద్దుమణిగే వరకు బడులు తెరవొద్దు. పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేసి అంతర్గత మార్కుల ఆధారంగా శ్రేణులు కేటాయించాలి.

- నాగటి నారాయణ, తెలంగాణ తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


కరోనాకు ముందూ  దారుణమే

విద్యారంగానికి సంబంధించి భారత్‌ చాలా భ్రమల్లో ఉంది. కరోనా తర్వాత విద్యారంగం ఏమైపోతుందో అన్న భయం అవసరం లేదు. కరోనాకు ముందు బ్రహ్మాండంగా ఉంటే కదా? విద్యానాణ్యతలో భారత్‌ అట్టడుగున ఉంది. ప్రథమ్‌ ఆసర్‌ నివేదిక చూస్తే ప్రతి ఏటా విద్యాసామర్థ్యాల స్థాయి దారుణంగా ఉంది.  25 శాతం మంది ఎనిమిదో తరగతి విద్యార్థులు రెండో తరగతి పాఠం తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. పీసా సర్వేలో 74 దేశాలు పాల్గొంటే భారత్‌ 73వ స్థానంలో నిలిచింది. అందుకే ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకొని మేల్కోవాలి. బండ పరీక్షలకు స్వస్తి చెప్పి బుద్ధికుశలత పెరిగేలా విద్యనందించాలి. మూడేళ్ల ప్రశ్నపత్రాలను బట్టీపడితే ఇంటర్‌లో 90 శాతం మార్కులు వస్తాయి. భయంకరంగా కాపీయింగ్‌ జరుగుతోంది. విద్య కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఏటా రూ.65 వేల కోట్లు వ్యయం చేస్తున్నాయి. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.90 వేలు ఖర్చు పెడుతోంది. 17-18 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఇక నుంచైనా మనకున్న వనరులను పునర్‌వ్యవస్థీకరించాలి. సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలి. విద్యార్థి ప్రతిభను అంచనా వేయడానికి ఏదో ఒక చోట పరీక్షలను కొలమానంగా తీసుకోవాలి. దానిపైన ప్రధానంగా ఇప్పుడు కసరత్తు జరగాలి.

- జయప్రకాశ్‌నారాయణ, లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు


విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలి

ప్పుడు ఇల్లే పాఠశాల అయింది.అందుకే ప్రభుత్వాలే ట్యాబ్‌లు లాంటి ఏదో ఒక పరికరం విద్యార్థులకు ఉచితంగా అందిస్తే ఆన్‌లైన్‌లో విద్య అభ్యసిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం భరోసా ఇస్తేనే ప్రైవేట్‌ పాఠశాలలు తెరుచుకుంటాయి. లేకుంటే ఒకరికి కరోనా వచ్చినా మొత్తం మూసేయాలంటారు. సర్కారు బడుల్లో మాదిరిగా ప్రైవేట్‌ పాఠశాలల్లో కూడా శానిటైజ్‌ లాంటివి స్థానిక సంస్థల ద్వారా చేయించాలి. ఫీజు పెంచొద్దని చెప్పారు..ఇప్పుడు ఈ అదనపు ఖర్చులు ఎలా భరించాలి?

- యాదగిరి శేఖర్‌రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు


ఇంటర్‌ స్థాయిలో నాణ్యత పెరగాలి

ప్రభుత్వం కౌన్సెలింగ్‌ ద్వారా బీటెక్‌లో చేరేందుకు విద్యార్థులను పంపిస్తారు. పాఠశాల, ఇంటర్‌స్థాయిలో నాణ్యమైన విద్య అందితే నాణ్యమైన ఇంజినీర్లు వస్తారు. ఆ లోపం ఇంజినీరింగ్‌లోకి వచ్చిన తర్వాత కనిపిస్తోంది. చివరిలో ఒక పరీక్ష పెట్టి విద్యార్థి ప్రతిభను అంచనా వేయకుండా నిరంతర మూల్యాంకనం అవసరం. ప్రభుత్వం సైతం బోధనా రుసుములను సకాలంలో మంజూరు చేస్తే కళాశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించుకోవడానికి వీలవుతుంది.

- డాక్టర్‌ ఎన్‌.గౌతంరావు, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం


విద్యాసంబంధ విషయాలపై ప్రధాన దృష్టి అవసరం

ప్రైవేట్‌ పాఠశాలల్లో కంటే సర్కారు బడుల్లో అర్హులైన ఉపాధ్యాయులుంటారు. అయితే ప్రభుత్వ విద్యలో జవాబుదారీతనం లోపిస్తోంది. అక్కడ అధికార యంత్రాంగం విద్యాసంబంధిత విషయాలపై కంటే సాధారణ విషయాలపై ఎక్కువ దృష్టి పెడుతుండటంతో విద్యానాణ్యతలో వెనకబడుతున్నారు. ఈ పాఠశాల బాధ్యత నాది అనుకుంటేనే సత్ఫలితాలు వస్తాయి. అభ్యాసన సామర్థా్యల్లో మనం ముందుండాలి. అయినా కరోనా సమయంలో ఉపాధ్యాయుల కృషిని అభినందించాలి. లాక్‌డౌన్‌లో విద్యార్థులను చదువులో నిమగ్నం చేయకపోతే మానసిక సమస్యలు వస్తాయి.

- ప్రసన్న మండవ, ఆన్‌లైన్‌ విద్యా నిపుణుడు, పీపుల్‌ కంబైన్‌ గ్రూపు డైరెక్టర్‌

 


సులభంగా అర్థమయ్యేలా  బోధించవచ్చు

సాంకేతికతను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోని రంగమేదైనా ఉందంటే అది విద్యారంగమే. సాంకేతికతతో సులభంగా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించవచ్చు. మేం ఆన్‌లైన్‌ విద్యనూ అందుబాటులోకి తెచ్చాం. కాకపోతే గంటలపాటు ఫోన్లు/ట్యాబ్‌ల్లో చదువుకోవడం కష్టం. అంతర్జాలం బ్యాండ్‌విడ్త్‌ సమస్యను కూడా గుర్తించాం.

- వి.కుమార్‌, శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్‌ డీన్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.