close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జలసిరుల తెలంగాణం

ఈనాడు - హైదరాబాద్‌

బొట్టు బొట్టూ చేర్చుకుంటూ..
ఇటుక ఇటుకా పేర్చుకుంటూ..
వాడవాడలో, పల్లెపల్లెలో సంక్షేమ కాంతులు విరజిమ్ముతూ
ఆరేళ్లుగా తెలంగాణ సాగిస్తున్న ప్రగతి ప్రస్థానమిది..

తెలంగాణ తలాపునే జీవనదులు ప్రవహిస్తున్నా... సంక్లిష్ట భౌగోళిక పరిస్థితుల కారణంగా పొలాలను తడపాలంటే నీటిని ఎత్తిపోయాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు కొన్నింటిని స్థానిక అవసరాలకు తగ్గట్లుగా రీడిజైనింగ్‌ చేయించడంపై ప్రభుత్వం దృష్టి నిలిపింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టు చొప్పున మొత్తంగా రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 23 భారీ, 13 మధ్యతరహా ప్రాజెక్టుల కోసం ఆరేళ్లలో ఇప్పటివరకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేసింది.

ప్రాణహిత-చేవెళ్ల పథకానికి పునరాకృతి చేసి 45 లక్షల ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో కాళేశ్వరం ఎత్తిపోతలను చేపట్టింది. రోజుకు 2టీఎంసీల చొప్పున 195 టీఎంసీలను గోదావరి నుంచి ఎత్తిపోస్తారు. మూడో టీఎంసీ ఎత్తిపోతకూ పనులు చేస్తున్నారు. నిరుడు ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి 60.5 టీఎంసీలను ఎగువకు ఎత్తిపోశారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవనానికీ ఇదే ఆధారం.

దేవాదుల ఎత్తిపోతలను పూర్తి చేసి, నిరంతర నీటి లభ్యత కోసం తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టింది. ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు, జోగులాంబ-గద్వాల జిల్లాలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలను 11 నెలల సమయంలోనే పూర్తిచేసింది.
పునరాకృతిలో భాగంగా ఖమ్మం జిల్లాలో 6.74 లక్షల ఎకరాలకు నీరందించేందుకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల చురుగ్గా సాగుతోంది. 37 టీఎంసీల నీటి నిల్వకు అనుగుణంగా దుమ్ముగూడెం వద్ద రూ.3,482 కోట్లతో బ్యారేజి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
దక్షిణ తెలంగాణ కోసం పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టింది.
వచ్చే ఖరీఫ్‌ నాటికి భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ పథకాలను 100% పూర్తికి లక్ష్యంగా పెట్టుకొంది.
రూ.3,825 కోట్లతో 1200 చెక్‌డ్యాంల నిర్మాణానికి నిర్ణయం తీసుకొంది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కాల్వల్లో మూడు వేల తూముల నిర్మాణాన్ని రూ.471 కోట్లతో చేపట్టారు. ఇందులో 70% పనులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 2020 నాటికి 80 లక్షల ఎకరాలకు పైగా సాగు నీరందుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

వెలుగుతోంది.. మిగులుతోంది
 

తెలంగాణ ఏర్పడే నాటికి 2,700 మెగావాట్ల తీవ్ర విద్యుత్తు కొరత భయపెడుతోంది.. ఈ సంక్షోభాన్ని సీఎం కేసీఆర్‌ సవాలుగా తీసుకున్నారు. సంస్థాగత సామర్థ్యాన్ని పెంచారు. భూపాలపల్లి, జూరాల, పులిచింతల, జైపూర్‌ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల పనులను పరుగులు పెట్టించారు. నిరంతర సరఫరా కోసం ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ నుంచి విద్యుత్తును కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరో నెల (2014, నవంబరు 20) నుంచే కోతల్లేని సరఫరాను ప్రారంభించారు. ప్రస్తుతం మిగులు విద్యుత్తు, నిరంతర సరఫరాతో రాష్ట్రం కాంతులీనుతోంది. రాష్ట్రంలో 28 వేల మెగావాట్లకు పైగా విద్యుదుత్పత్తి జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తోంది. అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా సాగుతున్నాయని జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు. రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పొరుగుసేవల విధానంలో విధులు నిర్వర్తిస్తున్న 23,667 మంది తాత్కాలిక ఉద్యోగుల సర్వీసును ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని తెలిపారు.
2018 జనవరి 1 నుంచి 24.16 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
ప్రగతి సూచికలుగా గుర్తించే అంశాల్లో ఒకటైన తలసరి విద్యుత్తు వినియోగం రాష్ట్రంలో 1,896యూనిట్‌లకు చేరింది.

 

ఐటీకి మేటి

తెలంగాణ ఏర్పాటైన ఆరేళ్లలో ఐటీలో ఎగుమతులు రెట్టింపయ్యాయి. ఇవి 2014లో రూ.66,276 కోట్లు ఉండగా 2019-20లో రూ.1,28,807 కోట్లకు చేరాయి. అదనంగా మరో 2.10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం కరోనా కారణంగా 2020లో ఎగుమతుల్లో జాతీయ సగటు 8.09% ఉంటే... తెలంగాణ మాత్రం 18% వృద్ధిని నమోదు చేసింది.
అగ్రశేణి ఐటీ సంస్థలైన గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, సేల్స్‌ఫోర్స్‌ తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయి. యువతను ప్రోత్సహించేలా 2016లో ప్రభుత్వం ఐటీపాలసీ తెచ్చింది.
ప్రపంచ మొదటి 10 స్టార్టప్‌ నగరాల్లో హైదరాబాద్‌ ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈమేరకు అమెరికా సిలికాన్‌ వ్యాలీలో టీ-బ్రిడ్జి, టీ-హబ్‌ ఔట్‌ పోస్టుని ఏర్పాటు చేసింది. టీ-హబ్‌ ఇంక్యుబేటర్‌ ద్వారా అంకురాలను ప్రోత్సహిస్తోంది. కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌లో ఐటీ ఇంక్యుబేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

తాగునీరు గోస తీరేలా

ఎండా కాలం వచ్చిందంటే అనేక పట్టణాలు, గ్రామాలు రక్షిత తాగునీటి కోసం అవస్థలు పడేవి.  ఆ కష్టాలకు ముగింపు పలికే లక్ష్యంతో.. తెలంగాణలో ఇంటింటికీ సురక్షిత నల్లా నీరందించే సంకల్పంతో ప్రభుత్వం ‘మిషన్‌ భగీరథ’ పథకాన్ని చేపట్టింది. గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని తీసుకొని సరఫరా చేసే ఈ బృహత్తర పథకానికి 2016 ఆగస్టు 7న ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ఈ పథకంతో రాష్ట్రంలోని 65 లక్షల కుటుంబాలకు, 2 కోట్ల 72 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందనుంది. గిరిజన తండాలు, ఎస్సీ వాడలు, గోండు గూడేలు, అటవీ ప్రాంతాల్లోని మారుమూల జనావాసాలకు కూడా పైప్‌లైన్ల ద్వారా మంచినీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పూర్తి చేసిన కాంట్రాక్టర్లే పదేళ్లు నిర్వహణ చేపట్టేలా ఒప్పందాలు కుదుర్చుకుంది.
మిషన్‌ భగీరథకు కేటాయించిన 80 టీఎంసీల నీటిలో 10 శాతం (8 టీఎంసీలు) పరిశ్రమలకు అందించనున్నారు. హైదరాబాద్‌ నగర మంచినీటి అసవరాల కోసం 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి పరిశ్రమలకు నీరు అందించనున్నారు.

రైతు‘బంధు’వు... దిగుబడుల సింధువు

తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయ రంగంపై నిధుల వర్షం కురిపించడంతో ఆహారధాన్యాల దిగుబడులు రికార్డులకెక్కుతున్నాయి. గత యాసంగి(రబీ) సీజన్‌లో ఏకంగా 1.04 కోట్ల టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ఎకరానికి ఏటా రూ.10 వేలను నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమచేసేలా ‘రైతుబంధు’ పథకాన్ని తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ఏడాది ఈ పథకం కింద రూ.14 వేల కోట్లను కేటాయించింది. 18 నుంచి 59 ఏళ్లలోపు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి తక్షణం రూ.5 లక్షలు పరిహారంగా ఇచ్చే ‘రైతు బీమా’ పథకాన్ని అమలు చేస్తోంది. తొలివిడత 2014లో రుణమాఫీకి రూ.16,500 కోట్లు వెచ్చించింది. మలివిడత రుణమాఫీకి ఈ ఏడాది రూ.9 వేల కోట్లు కేటాయించింది. ప్రతీ గ్రామీణ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 సంచార పశు వైద్యశాలలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.  

భాగ్యనగరం తలమానికం

హైదరాబాద్‌... తెలంగాణకు ఆయువుపట్టు. అధికారం చేపట్టగానే సీఎం కేసీఆర్‌ దీన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా బహుళజాతి సంస్థలు, పరిశ్రమలు పెట్టుబడులతో తరలి వస్తున్నాయి.
ఏమేం చేపట్టింది: భాగ్యనగర చరిత్రలోనే తొలిసారిగా రూ.30 వేల కోట్ల వ్యయంతో పలునిర్మాణాలు నడుస్తున్నాయి.

నగరాన్ని ట్రాఫిక్‌ రహితంగా, సిగ్నల్‌ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు రూ.23 వేల కోట్ల అంచనా వ్యయంతో ఎస్‌.ఆర్‌.డి.పి.ని రూపొందించారు.
మూసీ ప్రక్షాళన, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అమలుకు ప్రత్యేక నిధులను కేటాయించింది. వాహనాల రద్దీ నివారణకు, సౌకర్యవంతమైన ప్రయాణానికి రూ.21 వేల కోట్లతో పీపీపీ విధానంలో చేపట్టిన మెట్రో రైలు పథకం పరుగులు పెడుతోంది.
హైదరాబాద్‌లో 2017లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించారు. దీనికి ప్రధాని మోదీతోపాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా హాజరయ్యారు.

పరిశ్రమ పురోగమనం

పారిశ్రామిక రంగంలో తెలంగాణ గత ఆరేళ్లలో పురోగమించింది. పెట్టుబడులను ఆకర్షించడంలో సరళతర వాణిజ్య నిర్వహణలో దేశంలో ముందుంది. 2020, జనవరికి రూ.2,04,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఆన్‌లైన్‌లో 12,427 పరిశ్రమలకు అనుమతులిచ్చారు. ఏకంగా 14లక్షల మందికి ఉపాధి లభించింది.
ఎలా సాధ్యమైందంటే: టీఎస్‌ఐపాస్‌తో పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ విధానం తేవడం ద్వారా పారిశ్రామిక రంగానికి తెలంగాణ పూర్తిగా అనుకూలంగా మారింది. రాష్ట్రంలో కొత్తగా 361  ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 169 ఔషధ, రసాయన, 87 విద్యుత్‌, 165 ప్లాస్టిక్‌, రబ్బర్‌, 280 ఇంజినీరింగ్‌, 195 వ్యవసాయాధారిత, 46 ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, 166 గ్రానైట్‌ స్టోన్‌ క్రషింగ్‌, 69 పేపర్‌ ప్రింటింగ్‌, 63 జౌళి, 117 సిమెంట్‌, 12 వైమానిక, రక్షణ, 820 ఇతర పరిశ్రమలు ప్రారంభమయ్యాయి.

తెలంగాణ ఏర్పాటుకు ముందు పెట్టుబడుల ఆకర్షణలో దేశవ్యాప్త సగటు వృద్ధిరేటు 20.8%గా ఉంటే.. తెలంగాణ ఏకంగా 79% వృద్ధి సాధించింది. రాష్ట్రంలో 2013-14లో పారిశ్రామికరంగ వృద్ధిరేటు   0.4% కాగా 2017 వచ్చేసరికి 5.4% నమోదైంది. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి 5.8% వృద్ధి నమోదైంది.

వైద్య రంగానికి ప్రాణవాయువు

వ్యాధుల గుర్తింపు, సత్వర చికిత్సలు; గర్భిణులు, నవజాత శిశువుల ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు; వృద్ధులకు ఇంటివద్దే పరీక్షలు, ఔషధాల పంపిణీ.. ఇలా వైద్యంలో పలు పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ఆరేళ్లలో మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేటల్లో కొత్త వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి.
కంటివెలుగు: 1.54 కోట్ల మందికి పైగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. సమస్యలున్న 41 లక్షల మందికి కళ్లద్దాలు, ఔషధాలను ఉచితంగా పంపిణీ చేశారు.
కేసీఆర్‌ కిట్‌: ఈ పథకంలో 2017 నుంచి ఇప్పటివరకూ రూ.963 కోట్ల నగదును లబ్ధిదారులకు అందజేశారు. 6.68 లక్షల కిట్లను పంపిణీ చేశారు.
అమ్మఒడి: గర్భిణులను 102 వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి, ప్రసవానంతరం సురక్షితంగా ఇంటికి పంపించే సేవలు అందిస్తున్నారు. బాలింతల సంరక్షణకు ‘మెటర్నల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు(ఎంఐసీయూ), నవజాత శిశు సంరక్షణకు ‘సిక్‌ న్యూబార్న్‌ కేర్‌ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ)ల స్థాపనకు ప్రాధాన్యమిస్తున్నారు.
వైద్య పరీక్షలు: పేదలకు ఉచితంగా 58 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడానికి హైదరాబాద్‌లో మోడల్‌ హబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను అన్ని జిల్లాల్లో నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 104 వాహన సేవలతో ఉచితంగా పరీక్షలు, ఔషధాలను గ్రామాల్లోనే అందజేస్తున్నారు.

ఆరు లక్షలకుపైగా వివాహాలకు సాయం

భివృద్ధితో పాటు సంక్షేమంలోనూ తెలంగాణ పెద్ద మనసు చాటుతోంది. పింఛన్లు, పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయం, విద్యార్థులకు సన్న బియ్యం భోజనం, మైనార్టీ గురుకుల విద్యాలయాలు తదితర వినూత్న పథకాలతో ముందుకువెళుతోంది. పేదింటి ఆడపిల్లల వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద ఇప్పటివరకు 6,15,573 మందికి రూ.1,00,116 చొప్పున ఆర్థిక సహాయం చేసింది. మైనార్టీ పిల్లలకు ఆంగ్ల మాధ్యమ విద్య కోసం 204 మైనార్టీ గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసింది. ఇమామ్‌లకు నెలకు రూ.5 వేల భృతి కల్పిస్తోంది.
సన్నబియ్యం: 3,854 సంక్షేమ వసతి గృహాలు, 28,623 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది.
పింఛన్లు: ఆసరా పింఛన్ల కింద 12.32 లక్షల మంది వృద్ధులు, 14.35 లక్షల మంది వితంతువులు, 62 వేల మంది గీత కార్మికులు, 37 వేల మంది నేత కార్మికులు, 32 వేల మంది ఎయిడ్స్‌ బాధితులు, 4.07 లక్షల మంది బీడీ కార్మికులు, 1.34 లక్షల మంది ఒంటరి మహిళలు, 14897 మంది బోదకాలు బాధితులకు ప్రతి నెలా రూ.2016 చొప్పున చెల్లిస్తోంది. 4.93 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ.3,016 పింఛను ఇస్తోంది.

ప్రజల ముంగిటకు పాలన

ప్రజల ముంగిటకు పాలనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, నగర, పురపాలక సంస్థలను ఏర్పాటు చేసింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.