close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దొడ్డు ధాన్యానికే మద్దతు అధికం

జాతీయ టోకు మార్కెట్లలో వాటికే ఎక్కువ గిరాకి
  వ్యవసాయ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
  వాటి సాగు పెరగాలని సూచన

ఈనాడు, హైదరాబాద్‌: విలువ ఆధారిత ఉత్పత్తులకు అనుకూలమైన లావురకం బియ్యానికి ఉన్న డిమాండ్‌ దృష్ట్యా వచ్చే యాసంగిలో ఆ రకాలను పెద్దఎత్తున సాగు చేయించాలని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పేర్కొంటోంది. రూ.వేల కోట్లలో సాగే ఇడ్లీరవ్వ, బియ్యపు పిండి, అటుకులు వంటి ఉత్పత్తుల వ్యాపారానికి దొడ్డు బియ్యం బాగా ఉపయోగపడతాయి. దీంతో జాతీయ మార్కెట్‌లో వ్యాపారులు ఆ బియ్యాన్నే ఎక్కువగా అడుగుతున్నారు. బయటి రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేయాలంటే లావురకాల బియ్యమే కావాలని వర్సిటీ అధ్యయనంలో తేలింది. సన్నరకాల బియ్యానికి తెలుగు రాష్ట్రాల్లోనే డిమాండు ఎక్కువ.
ఈ ఏడాది 2.10 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధించాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వానాకాలం సీజన్‌లో మొత్తం 40 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయాలని, ఇందులో 25 లక్షల ఎకరాల్లో సన్నరకాలే వేయాలని రైతులకు వ్యవసాయశాఖ చెపుతోంది. ఈ సీజన్‌లో లావు రకాలు తగ్గించినందున యాసంగిలో వాటిని పెంచాలని వర్సిటీలోని వరి పరిశోధనా కేంద్రం సూచించింది.
‘దొడ్డు’కే ధర ఎక్కువ
కేంద్రం ఏటా వరి ధాన్యాన్ని ఏ గ్రేడ్‌, సాధారణం అని రెండు రకాల మద్దతు ధరలు ప్రకటిస్తోంది. ఈ ఏడాది(2020-21)లో ఏ గ్రేడ్‌ కింద లావు(దొడ్డు) ధాన్యం క్వింటాకు రూ.1888, సన్నరకాలకు రూ.1868 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. లావు రకానికి క్వింటాకు రూ.20 ఎక్కువ ధర ఉంది.
ఆ ప్రకారం రాష్ట్రంలో సాగు చేస్తున్న 25 లక్షల ఎకరాల్లో పండే సన్నరకాల ధాన్యం పంటపైనే రైతులు రూ.100 కోట్లు నష్టపోతారని అంచనా. మరోపక్క వరి ధాన్యాన్ని మరపట్టించినప్పుడు సన్నాల కన్నా లావురకాలు కిలో బియ్యం ఎక్కువగా వస్తున్నాయని రైతులు వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలకు తెలిపారు. సన్నరకం బియ్యానికి చిల్లర మార్కెట్‌లో అధిక ధర ఉంటున్నా ఆ మేర రైతులకు ఆ ధాన్యానికి అధిక ధరను అటు వ్యాపారులు గానీ, ఇటు ప్రభుత్వం ఇవ్వకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గతేడాది మనదేశం నుంచి 50.36 లక్షల టన్నుల సాధారణ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయగా అందులో సగానికి పైగా లావురకాలే ఉన్నాయి.
పరిశోధన చివరి దశలో 3 రకాలు
బియ్యపు గింజ పొడవు 6.2 మి.మీ.కన్నా ఎక్కువగా ఉండే వంగడాలపై పరిశోధనలు చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్‌ వర్సిటీని ఆదేశించింది. లావు రకాలైన తెల్లహంస, సురేఖ, కూనారం 118 వంటి వరి బియ్యపు గింజ పొడవు 6.2 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువున్నందున వ్యాపారులు వాటిని ఎక్కువగా కొంటున్నారని జయశంకర్‌ వర్సిటీ పరిశోధనా సంచాలకుడు, ప్రధాన వరి శాస్త్రవేత్త డాక్టర్‌ జగదీశ్వర్‌ ‘ఈనాడు’కు చెప్పారు. ఇప్పుడు కొత్తగా 3 రకాల వరి వంగడాలు పరిశోధన చివరిదశలో ఉన్నాయని వాటి బియ్యపు గింజ పొడవు  6.97మి.మీ.లు ఉందని తెలిపారు. అవి సాగులోకి వస్తే తెలంగాణ ధాన్యానికి మరింత డిమాండు పెరుగుతుందన్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.