close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇల్లూ.. ఒళ్లూ గుల్ల దోమల వల్ల

 పురపాలికల్లో కొరవడిన కార్యాచరణ

తొలి చినుకు నేలన పడగానే మట్టి పరిమళం మనసును తాకుతుంది. కానీ ఆ అనుభూతిని క్షణమైనా ఆస్వాదించకముందే దోమల రొద మొదలయిపోతోంది. వచ్చేశామండోయ్‌ అంటూ మశకాలు ముఠాలు కట్టి జనం మీద దాడికి దిగిపోతాయి. ఆ వెంటనే మలేరియా, డెంగీ లాంటి జ్వరాలు మీ ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసేస్తాయి. దీన్ని నివారించాలంటే దోమల నివారణకు ఓ ప్రత్యేక కార్యాచరణ ఉండాలి. యుద్ధ  ప్రాతిపదికన దాన్ని పూర్తి చేయడానికి సుశిక్షితులైన సిబ్బంది ఉండాలి. మన పురపాలికలు, నగర పాలక సంస్థల్లో ఇవేమీ లేకపోవడంతో దోమలు చెలరేగి పోతున్నాయి.

రాష్ట్రంలోని పట్టణాల్లో దోమల నిర్మూలన చర్యలు ఏటా తంతులా సాగుతున్నాయి. రహదారులు, కాలువలు శుభ్రం చేసే సిబ్బందినే ఈ పనులకూ వినియోగిస్తున్నారు. నైపుణ్యం కలిగిన సిబ్బందిలో చాలామంది ఉద్యోగ   విరమణ పొందారు. ఖాళీలు భర్తీ చేయకపోవడంతో దోమల నిర్మూలన చర్యల్లో ‘ప్రత్యేకత’ లోపిస్తోంది. ఫలితంగా ఏటా పట్టణాల్లో మలేరియా కేసులు పెరుగుతున్నాయి. గతేడాది 8,040 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 5 వేలకుపైగా మలేరియా జ్వరం కేసులు తేలాయి.

ఏం చేస్తున్నారు?

పురపాలక, నగరపాలక సంస్థల్లో ఏటా జూన్‌లో దోమల నిర్మూలన చర్యలు ప్రారంభించి డిసెంబరు వరకు కొనసాగిస్తారు. వర్షాలకు ముందు, తరువాత దోమలు ఎక్కువగా ఉత్పత్తి కావడానికి వీలున్న ప్రాంతాలను గుర్తించి నిర్మూలన చర్యలు చేపడతారు. అయితే  కొన్నేళ్లుగా స్ప్రేయింగ్‌, ఫాగింగ్‌ అంతంతమాత్రంగా ఉంటున్నాయి.


మూడు చోట్లే ముచ్చట  

రాష్ట్రంలోని 14 నగరపాలక సంస్థల్లో కేవలం మూడు చోట్లే మలేరియా నిర్మూలనకు ప్రత్యేక యూనిట్లు పని చేస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులో బయాలజిస్ట్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ఏటా సీజన్‌లో దోమల నియంత్రణ చర్యలు చేపడతారు. మిగతా 11 నగరపాలక సంస్థల్లో కాలువలు, రహదారులు శుభ్రం చేసే కార్మికులనే ఉపయోగిస్తుండటంతో దోమల నియంత్రణ ఓ తంతులా మారిపోయింది. మిగతా 106 పురపాలక, నగర పంచాయతీల్లో మలేరియా నిర్మూలన కోసమంటూ ప్రత్యేక చర్యలు కనిపించటంలేదు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నచోట ఫాగింగ్‌ చేయడం, బ్లీచింగ్‌ చల్లడంతో సరిపెడుతున్నారు.  


అరకొర సిబ్బంది

ప్రత్యేకంగా మలేరియా నియంత్రణ కేంద్రాలు కలిగిన మూడు నగరపాలక సంస్థల్లోనూ తగినంత సిబ్బంది లేకపోవడంతో దోమల నియంత్రణ నామమాత్రంగా మారింది. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)లో దోమల నియంత్రణకు  నైపుణ్యం కలిగిన 950 మంది సిబ్బంది ఉండాలి. 340 మందితోనే నెట్టుకొస్తున్నారు. గత ఏడాదిగా 450 మంది సీజనల్‌ సిబ్బందిని నిలిపివేయడంతో సమస్య మరింత పెరిగింది. విజయవాడ, గుంటూరుల్లో మరో 40 శాతం సిబ్బంది అవసరమని అధికారులు చెబుతున్నారు. వార్డు కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి దోమల నివారణ చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు పూర్తిగా ఆచరణకు నోచుకోవడం లేదు.


ఇంకో 5,200 మంది ఉంటేనే..

పెరుగుతున్న పట్టణ, నగర విస్తీర్ణం, జనాభా ఆధారంగా మలేరియా నిర్మూలనకు అదనంగా 5,200 మంది కార్మికులు అవసరమని అధికారులు రెండేళ్ల క్రితమే అంచనా వేశారు. 2,200 ఖాళీల భర్తీకి, మరో 3వేల మంది ఒప్పంద కార్మికులను తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించాలి. అప్పుడే దోమల నియంత్రణ చర్యలు సమర్థంగా చేపట్టగలమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

- ఈనాడు - అమరావతి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.