close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం

స్వాతంత్య్రానంతరం ఇదే అతి దారుణ మందగమనం
లాక్‌డౌన్‌ తీరూ నష్టం చేసింది
విధానపరమైన తప్పులు సరిచేసుకుంటే  వేగవంతమైన వృద్ధి సాధ్యం
భారత్‌ ప్రస్తుత పరిస్థితిపై ప్రముఖ ఆర్థికవేత్త, పద్మభూషణ్‌ కౌశిక్‌బసు విశ్లేషణ
‘ఈనాడు’కు ఈ-మెయిల్‌ ఇంటర్వ్యూ
ఎన్‌.విశ్వప్రసాద్‌
ఈనాడు - హైదరాబాద్‌

ఆర్థిక రంగంపైనా, పౌరుల వ్యక్తిగత అంశాలపైనా ప్రభుత్వ నియంత్రణ మితిమీరుతోంది. ఇది నాకు ఆందోళన కలిగిస్తోంది. ప్రతిదానికీ అనుమతులు తీసుకునే పరిస్థితి ఉండటం.. వాటిపై మితిమీరిన అధికారిక నియంత్రణ (బ్యూరోక్రసీ) గతంలో మనకు అనుభవమే. అలాంటి ‘లైసెన్స్‌- పర్మిట్‌ రాజ్‌’ వ్యవస్థ మనకు ఎంతో నష్టం చేసింది. ఇప్పుడు అనుమతులతోపాటు వాటిపై రాజకీయ నియంత్రణ అంతకంటే ఎక్కువ హాని చేస్తుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేనంత తక్కువ ఆర్థిక వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం కనిపిస్తోందని ప్రముఖ ఆర్థికవేత్త ‘పద్మభూషణ్‌’ కౌశిక్‌బసు అంచనా వేశారు. ఈ పరిస్థితులను ఎదుర్కోవాలంటే సరైన నిర్ణయాలు తీసుకోవాలని, మనది శాంతి సామరస్యాలతో కూడిన ఆధునిక దేశమనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. కౌశిక్‌బసు గతంలో ప్రపంచబ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా, సీనియర్‌ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. అలాగే భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. ప్రస్తుతం అమెరికాలోని కార్నెల్‌ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ‘ఈనాడు’కు ఈ-మెయిల్‌ ద్వారా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
కరోనా వ్యాప్తి ఉన్నంత వరకూ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుంది. ఆర్థిక రంగం విషయంలో భారత్‌ సరైన దిశను ఎంచుకోవలసిన కీలకదశలో ఉంది. మన దేశానికి ఐటీలో ఎంతో బలం ఉంది. ఉన్నత విద్య బాగుంది. పరిశోధన రంగమూ పటిష్ఠం అవుతోంది. ఇలాంటి బలాలు ఉన్నప్పటికీ అనేక విధానపరమైన    తప్పుల వల్ల ఆర్థిక వ్యవస్థ    దెబ్బతినే ప్రమాదం ఉంది.’’
కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఆర్థిక    వ్యవస్థకు ఊతం ఇవ్వగలదా?
అది నిజంగా పెద్ద ప్యాకేజీ. సరిగా అమలు చేస్తే దానివల్ల చాలా మంచి జరుగుతుంది.
ఈ సంక్షోభ కాలంలో నిరుపేదలకు ఈ ప్యాకేజీ ద్వారా ప్రత్యక్షంగా తగిన ఆర్థిక సహాయం అందడం లేదన్న అభిప్రాయం ఉంది కదా..
ఇది సహేతుకమైన విమర్శే. పేదలకు తక్షణం నేరుగా నగదు అందించాలి. దీన్ని యుద్ధప్రాతిపదికన చేయాలి. దురదృష్టవశాత్తూ అలాంటివి జరగడంలేదు. అందుకే కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినప్పుడు ఒకవైపు సంతోషంతో పాటు, అది కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందేమోనన్న ఆందోళనా కలిగింది. సాధారణంగా మనం ఆకట్టుకునే ప్రకటనలు చేస్తాం.. తర్వాతి చర్యలు మాత్రం అరకొరగానే ఉంటాయి. మన ఆర్థికరంగం ఎదుర్కొనే సమస్యల్లో ఇదీ ఒకటి.
భారత్‌లో అసమానతలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయని, కరోనా ప్రభావంవల్ల ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. వీటిని తగ్గించేందుకు ఎలాంటి కృషి చేయాలి?
భారత్‌లో అసమానతలు ఆమోదనీయం కాని రీతిలో ఉన్నాయి. ఏడాది కిందట ‘ఆక్స్‌ఫామ్‌’ చేసిన సర్వే ప్రకారం దేశ సంపదలో 73 శాతం ఒక్కశాతం మంది వద్దే పోగుబడి ఉంది. ఈ స్థాయి అసమానతలు ఎక్కడా ఉండకూడదు. దేశంలో ఇప్పటికీ కోట్లాదిమంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. కరోనా ప్రభావం వల్ల డిజిటల్‌ సాంకేతిక వినియోగం వేగంగా పెరగనుంది. ఒక రకంగా ఇది మంచిదే. దీని ఫలితాలు కొద్దిమంది ఉన్నత శ్రేణి ప్రజలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలి.
చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతులను తగ్గించేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది. భారత తయారీ రంగానికి ఇది ఎలా మేలు చేస్తుంది?
ఇది మన నిరసనకు చిహ్నంగా నిలిచే చర్య. దీని వల్ల చెప్పుకోదగిన మంచి లేదా చెడు జరుగుతాయని నేను అనుకోను.
భారత స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరం 4.2 శాతమే. గత పదకొండేళ్లలో అదే కనిష్ఠం. ఈ ఏడాది మరీ క్షీణించి మైనస్‌ 3 నుంచి మైనస్‌ 5 శాతం వరకూ నమోదు కావచ్చనే అంచనాలు వస్తున్నాయి. మరోవైపు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ సంక్షోభం తీవ్రతను మీరు ఎలా అంచనా వేస్తున్నారు?
భారత్‌ ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. కొవిడ్‌ -19 ప్రభావం వల్ల ప్రపంచమంతా ఆర్థికరంగంలో మందగమనం చోటుచేసుకుంది. అయితే దీనివల్ల ఒక దేశం మిగిలిన దేశాలతో ర్యాంకుల విషయంలో వెనుకబడరాదు. ఇటీవల ప్రపంచ స్థాయి ర్యాకింగ్‌లలో మన స్థానం దిగజారుతోంది. మనం ఎదుర్కొంటున్న మందగమనంలో ఒక భాగం కొవిడ్‌-19 వల్ల ఏర్పడింది. దీనిని అర్థం చేసుకోవచ్చు. కానీ మన దేశంలో సమస్యకు ఇతర కారణాలూ ఉన్నాయి. భారత్‌ చాలా సంవత్సరాలపాటు వేగంగా వృద్ధి చెందుతున్న తొలి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం 23వ స్థానానికి జారింది. కరోనా ప్రభావానికి రెండేళ్ల ముందే భారత్‌లో తీవ్రమైన మందగమనం ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ అమలు తీరు వల్ల ఆర్థికరంగాన్ని మరింతగా కుంగదీసే దెబ్బపడింది. లాక్‌డౌన్‌ అనంతరం భారత్‌లో నిరుద్యోగం రేటు 20 శాతానికి చేరింది. ఇది ప్రపంచంలోనే ఎక్కువ.
ప్రస్తుతŸ ప్రభుత్వం చక్కటి ఆర్థిక వృద్ధిని సాధించగలదని మొదట్లో అంచనా వేశా. కానీ భారత్‌ గమనం నాకు తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. మనకున్న ఆర్థిక మూలాలు, ఇక్కడి సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచంలో వేగంగా ఎదిగే ఆర్థికశక్తిగా ఈ దేశం రూపొందగలదు. కానీ మనం వ్యతిరేకదిశలో వెళ్తున్నాం. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈసారి భారతదేశ వృద్ధిరేటు స్వతంత్రం తర్వాత ఎన్నడూ లేనంత తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ 1979లో వచ్చిన -5.2% వృద్ధి రేటే కనిష్ఠం. ఈసారి అంతకంటే తక్కువ నమోదయ్యేలా ఉంది.
కేంద్రం ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజీతోపాటు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవలసిందని మీరు భావిస్తున్నారు? కరోనా ప్రభావం ఇంకెంతకాలం ఉంటుందని మీ అంచనా?
మన వద్ద లాక్‌డౌన్‌ను సవ్యంగా అమలు చేయలేదు. అందువల్ల ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం జరిగింది. అంతేకాదు వైరస్‌ వ్యాప్తి కూడా పెరిగింది. భారత్‌లో అమలు చేసిన లాక్‌డౌన్‌ ప్రపంచంలోనే తీవ్రమైనది. లాక్‌డౌన్‌ను ప్రకటించినప్పుడు అంతా సవ్యంగానే కనిపించింది. దానిని అమలు చేసే క్రమంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో సిద్ధంగానే ఉందనుకున్నా. పని కోల్పోయే కార్మికులను ఎలా ఆదుకోవాలి? సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలగకుండా ఏం చేయాలి? వంటివి ముందుగానే ఆలోచించాలి. ఆసుపత్రుల నిర్మాణం, వ్యాధి నిర్ధారణ పరీక్షల ఏర్పాట్లు అత్యంత వేగంగా జరగాలి. అలాంటివి చేయకపోతే లాక్‌డౌన్‌ వల్ల ఫలితాలు తగ్గిపోతాయి. భారత్‌లో అదే జరిగింది. కార్మికులకు పని లేకుండా పోయి గుంపులుగా చేరారు. అలా గుంపులుగానే ఇళ్లకు తిరుగుముఖం పట్టడంతో వైరస్‌ కూడా ప్రబలింది. ఆసియా, ఆఫ్రికాల్లో ఎక్కడా ఇక్కడున్నంత తీవ్రంగా వైరస్‌ ప్రభావం లేదు. వైరస్‌ కట్టడి ప్రయత్నాలు అత్యంత పేలవంగా ఉన్న దేశాలలో భారత్‌ ఒకటి. లాక్‌డౌన్‌ సమయం నుంచీ కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. నిజానికి ఈ పరిస్థితి నివారించగలిగినదే.
కరోనా ప్రభావం అనంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయని మీరు భావిస్తున్నారు?
భారీ మార్పులే చోటు చేసుకుంటాయి. ఐటీ రంగం ఎంతో ముందడుగు వేస్తుంది. డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతుంది. ఆరోగ్యరంగం బహుముఖంగా విస్తరిస్తుంది. వైద్యసేవల విస్తృతి పెరుగుతుంది. ఐటీ, ఆరోగ్యసేవల రంగాల్లో ఇప్పటికే భారత్‌ బలంగా ఉంది. ఇలాంటి బలాలను ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలంటే భారత్‌లో రాజకీయ రంగాన్ని, ఇతర వ్యవస్థలను చక్కదిద్దుకోవాలి. వృద్ధి సాధనలో భారత్‌ నాయకత్వ పాత్ర పోషించగలదని కొద్ది సంవత్సరాల కిందట ప్రపంచ మీడియా వర్ణించేది. ప్రస్తుతం పరిస్థితి మారింది. విభజన రాజకీయాలు, సైన్సును వెనక్కినెట్టే ధోరణులు, ప్రశ్నించడాన్ని.. విమర్శించడాన్ని ప్రతిఘటించడం వంటివి పెరగడం వల్ల భారత్‌ పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకంటే మెరుగైన వాతావరణాన్ని ఎలా సృష్టించాలనే దానిపై మనమంతా ఆలోచించాలి. ఏదైనా విమర్శ వస్తే దానిని కుట్రగా భావించే పరిస్థితులున్న దేశాలు ప్రగతి సాధనలో విఫలమయ్యాయి. భారత్‌ అలాంటి తప్పు చేయకూడదు.
వలస కార్మికులు అనేకమంది స్వస్థలాలకు వెళ్లిపోయారు. వాళ్లు ఇప్పట్లో పని ప్రాంతాలకు తిరిగి రావడం చాలా కష్టం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం పడుతుంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి?
ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉత్పన్నం కాకూడదు. సరైన సహాయక చర్యల గురించి ఆలోచించకుండా లాక్‌డౌన్‌ ప్రారంభించడమే దీనికి కారణం. కరోనా వంటివి ప్రబలినప్పుడు ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటుంది. అవసరమైన ఆర్థిక, ద్రవ్య విధానాలను ఉమ్మడిగా చేపట్టడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచవచ్చు. మన వ్యవస్థలపై నమ్మకాన్ని తిరిగి ఏర్పరచవచ్చు.ఆర్థిక విధానాల రూపకల్పనలో మనం చాలా తక్కువ నైపుణ్యంతో వ్యవహరిస్తున్నాం. దీనికి తోడు మార్కెట్లు, సంస్థలపై రాజకీయ నియంత్రణ పెరగడంవల్ల మనం కోరుకున్నదానికి భిన్నంగా జరుగుతోంది. ఈ పరిస్థితి మారాలి.


- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.