close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫలితమెప్పుడో?

భారీగా నమూనాల సేకరణ
ఫలితం కోసం తప్పని నిరీక్షణ
వైద్య సిబ్బందికీ కష్టాలు
అంత్యక్రియలపైనా ప్రభావం
ఈనాడు - అమరావతి

కరోనా అనుమానిత లక్షణాలతో విజయవాడకు చెందిన ఒకరు ఈ నెల 8న నమూనాలను ఇచ్చారు. ఆయనకు సోమవారం వరకు ఎలాంటి సమాచారం అందలేదు. రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగుల్లో కొందరు ఈ నెల ఏడెనిమిది తేదీల్లో నమూనాలను ఇచ్చారు. ఫలితం కోసం వారికీ నిరీక్షణ తప్పడం లేదు.

వైరస్‌ నిర్ధారణ కోసం నమూనాలనిచ్చిన వారు ఫలితాల కోసం నిరీక్షిస్తూ క్షణమోయుగంలా గడుపుతున్నారు. ఇళ్లలోనే ఉండాలా? ఆస్పత్రుల్లో చేరాలా? తేల్చుకోలేక సతమతమవుతున్నారు. సాధారణ జ్వరంతో బాధపడేవారికి ప్రైవేటు వైద్యం కూడా గగనమవుతోంది. కరోనా పరీక్షల నివేదిక ఉంటేనే చికిత్సనందిస్తామని ప్రైవేటు ఆస్పత్రుల వారు తెగేసి చెబుతున్నారు. కాలక్రమేణా సకాలంలో చికిత్స అందక రోగుల ఆరోగ్యం విషమిస్తోంది.

సత్వర ఫలితాలతోనే ప్రయోజనం
కృష్ణా, గుంటూరు, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలలో నమూనాల పరీక్షల ఫలితాలకు కనీసం 5నుంచి వారం రోజుల సమయం పడుతోంది. మిగిలిన జిల్లాలలో 2,3 రోజుల గడువు తీసుకుంటున్నారు. వైరస్‌ వ్యాపిస్తున్న ప్రారంభ దశలో ఫలితాల వెల్లడికి 24 నుంచి 48 గంటల సమయం పట్టేది. వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నందున అనుమానిత లక్షణాలతో ఉన్న వారు ఎక్కువ సంఖ్యలో నిర్ధారణ పరీక్షలకు వస్తున్నారు. దీనికి తగ్గట్టు వసతులను పెంచి సత్వరం ఫలితాలను వెల్లడించడంపై దృష్టి పెట్టాలనే అభిప్రాయాలున్నాయి.

ముంచుకొస్తున్న ముప్పు
నమూనాలనిచ్చిన వారు ఫలితం తెలిసేంత వరకు విడిగా ఉండేందుకు సిద్ధమవడం లేదు. కొందరు చొరవ చూపుతున్నా ఇళ్లలో సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కరవవుతోంది. ఇంతలోనే ముప్పు ముంచుకొస్తోంది. కుటుంబీకులూ బాధితులవుతున్నారు. ఇరుగుపొరుగు నుంచి కూడా సమస్యలు వస్తున్నాయి.

బయట తిరుగుతూ
వైరస్‌ సోకిన వారిలో 80శాతం మందికి అనుమానిత లక్షణాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో నమూనాలనిచ్చిన వారు బయట తిరుగుతున్నందున వ్యాధి విస్తరిస్తోంది. వారిని ఆలస్యంగా ఆస్పత్రులకు తరలిస్తున్నందున అప్పటివరకు వారితో సన్నిహితంగా
మెలిగినవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పరీక్షల కోసం వారూ బారులు తీరుతున్నారు.

వైద్య సిబ్బందికీ కష్టాలే..
* ప్రభుత్వాస్పత్రుల్లో చేరిన వారి ఫలితం రావడంలోనూ జాప్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నమూనా ఇచ్చిన 24 గంటల్లోనూ ఫలితం రాక అందించాల్సిన చికిత్సపై వైద్యులు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. విజయవాడ జీజీహెచ్‌లో ఒకరు తీవ్ర అస్వస్థతతో చేరారు. నమూనా పరీక్ష ఫలితానికి మూడు రోజులు పట్టింది. ప్రధాన ఆస్పత్రిలోనే నిర్ధారణ పరీక్షకు ఇంత సమయం పట్టడం గమనార్హం.

జాగ్రత్తలు తెలియక ఆందోళన
విజయవాడకు చెందిన ఓ వృద్ధురాలు ఈ నెల 10న నమూనానిచ్చారు. సోమవారం మరణించారు. పరీక్షల ఫలితం ఇంతవరకు అందలేదు. ఈ పరిస్థితుల్లో అంత్యక్రియల నిర్వహణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.
* అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, ఇతర చోట్ల సేకరించిన నమూనాలను పరీక్షా కేంద్రాలకు చేర్చడానికే ఒక్కోసారి రెండు రోజులు పడుతోంది. ఇలాంటి పరిస్థితులు మరికొన్ని జిల్లాలలోనూ కనిపిస్తున్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.