close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాజస్థాన్‌ తర్వాత మహారాష్ట్రేనా?

పావులు కదుపుతున్న భాజపా

కమలనాథుల వ్యూహాలపై రాజకీయ విశ్లేషకుల అంచనాలు

రాజేంద్రనాథ్‌ సాఠె

అధికార రాజకీయాల వైకుంఠపాళిలో రాజస్థాన్‌లో ప్రారంభమైన దాగుడుమూతలకు ఇంకా తెరపడలేదు! అక్కడి నాటకీయ పరిణామాలు మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేకిస్తున్న నేపథ్యంలోనే మహారాష్ట్రలో కూడా త్వరలో ఏదో జరగబోతుందనే అలికిడి వినిపిస్తోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవటంలో విజయం సాధించిన కమలనాథులు తాజాగా రాజస్థాన్‌లో వ్యూహాత్మకంగా పావులను కదుపుతున్నారు. వారి తదుపరి లక్ష్యం మహారాష్ట్రేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆ రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలు దీనిని బలపరుస్తున్నాయి కూడా.

కూటమి నేతల ఐక్యతా ప్రదర్శన

తాజా రాజకీయ పరిణామాలతో అప్రమత్తమైన మహారాష్ట్రలోని ‘మహా వికాస్‌ ఆఘాడీ’ ప్రభుత్వంలోని మూడు భాగస్వామ్య పార్టీల నేతలు తరచూ భేటీ అవుతూ చర్చలు మీద చర్చలు జరుపుతున్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ గత వారం నాలుగు రోజుల వ్యవధిలో రెండు సార్లు శివసేన అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, సీనియర్‌ మంత్రి బాలాసాహెబ్‌ థొరాట్‌ కూడా పలు మార్లు ఉద్ధవ్‌తో మంతనాలు జరిపారు. సీనియర్‌ పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారుల బదిలీల విషయంలో, కరోనా లాక్‌డౌన్‌ను రాష్ట్రంలోని పలు నగరాలకు విస్తరించే అంశంలోనూ కూటమిలో తీవ్ర విభేదాలు పొడచూపాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులను తొలగించేందుకు ఈ మూడు పార్టీల నేతలు తీవ్రంగా యత్నిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ క్షణానైనా కూలిపోయేంత బలహీనంగా ఉందన్న విషయం దాని ఆవిర్భావం నుంచీ అందరికీ తెలిసిన రహస్యమే. అయినప్పటికీ కూటమి నేతలు మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ తమ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని, అయిదేళ్లపాటు అధికారంలో కొనసాగుతుందని నమ్మించేందుకు యత్నిస్తూనే ఉన్నారు. శివసేన అధికార పత్రిక సామ్నా కోసం ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ సగానికిపైగా ప్రశ్నలు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వ సుస్థిరతకు సంబంధించినవే కావటం గమనార్హం.

భాజపా సర్వసన్నద్ధత

మరోవైపున భాజపా నేతలు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం ఎప్పుడు కుప్పకూలుతుందా అని ఎదురుచూస్తున్నారు. ‘‘ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని నమ్మటానికి, జీర్ణించుకోవటానికి కొన్ని రోజులు పట్టింది’’ అని మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొన్ని నెలలుగా భాజపా నేతలు తమ మనసుల్లో దాచుకున్న అభిప్రాయాలకు ఫడణవీస్‌ మాటలు అద్దంపట్టాయి. ఠాక్రే ప్రభుత్వం ఎంతోకాలం మనుగడసాగించలేదని నిరూపించేందుకు ఏడు నెలలుగా భాజపా నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దాంతో పాటు ప్రభుత్వంలోని మూడు భాగస్వామ్య పక్షాల మధ్య దూరాన్ని పెంచేందుకు లభించే ఏ ఒక్క అవకాశాన్నీ వారు వదులుకోవటంలేదు. మహారాష్ట్ర ప్రభుత్వంలో తాము నిర్ణయాత్మక పాత్రలో లేమని, కరోనాపై పోరులో ఎదురయ్యే వైఫల్యాలకు తమను ప్రశ్నించరాదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ వ్యాఖ్యానించినప్పుడు ఆ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టేందుకు భాజపా నేతలు యత్నించారు. అంతకుముందు వీర సావర్కర్‌ను రాహుల్‌ విమర్శించిన సమయంలోనూ ఇదే విధమైన ఎత్తుగడను శివసేనపైనా సంధించారు. అధికారం కోసం జాతీయవాదానికి తిలోదకాలు ఇచ్చేశారా అంటూ శివసేన నేతల్ని ప్రశ్నించారు. ఇంత వరకు తమ ప్రయత్నాలు ఏవీ ఫలించనప్పటికీ భాజపా నేతలు వాటిని విరమించుకోలేదు. రాజస్థాన్‌లో సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు ఉదంతం తెరపైకి రావటంతో మహారాష్ట్రలో వారి ఆశలు మరోసారి చిగురించాయి.

అక్టోబరు నాటికి మహారాష్ట్రలోనూ భాజపా ప్రభుత్వం ఏర్పడుతుందని అంతర్గత చర్చల్లో ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే దేవేంద్ర ఫడణవీస్‌ హావభావాల్లోనూ మార్పులుచోటు చేసుకున్నాయి. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని తాము కూల్చాల్సిన అవసరం లేదని, భాగస్వామ్య పక్షాల్లోని వైరుద్ధ్యాలతో అదే పతనమవుతుందని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కరోనా వ్యాప్తి నివారణలో ఠాక్రే ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడిలో వైఫల్యానికి శివసేనే పూర్తి బాధ్యత వహించాలని భాజపా వ్యూహకర్తలు పదేపదే చెబుతున్నారు. బహుశా ఈ ఎత్తుగడ మూడు పార్టీల కూటమి కన్నా భాజపాతో కలిసేందుకే మొగ్గుచూపిన ఎన్‌సీపీలోని అజిత్‌ పవార్‌ వర్గానికి దగ్గరయ్యేందుకు కావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

శివసేన అప్రమత్తత

భాజపా వ్యూహాలను, ఎత్తుగడలను శివసేన తనదైన శైలిలో తిప్పికొడుతోంది. ఫడణవీస్‌ రాష్ట్ర పర్యటనలను ‘వినాశకర పర్యటనలు’గా రాష్ట్ర మంత్రి, ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే అభివర్ణిస్తున్నారు. భాజపాయేతర పార్టీల పాలన కొనసాగుతున్న రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు భాజపా కుయుక్తులు పన్నుతుందని, ఇది దేశంలోని పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో విమర్శించింది.

ఠాక్రే వ్యవహార శైలి మారేనా

దేశంలో కల్లా మహారాష్ట్రలో కరోనా విజృంభణ అధికంగా ఉంది. అత్యధిక కేసులు, అత్యధిక మరణాలు ఇక్కడే నమోదవుతున్నాయి. ఇది ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వ వైఫల్యంగా భాజపా ఎత్తిచూపుతోంది. మరోవైపున ఉద్ధవ్‌ వ్యవహార శైలినీ ఆ పార్టీ విమర్శిస్తోంది. కరోనా సమస్య తలెత్తినప్పటి నుంచీ ఆయన తన స్వగృహం మాతోశ్రీకే పరిమితమయ్యారు. మంత్రాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికీ రావటంలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ‘ఇంటి వద్ద నుంచే పని విధానానికి’ ఉద్ధవ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ జోకులు పేలుతున్నాయి. ఠాక్రే తన మంత్రివర్గ సహచరులకూ అందుబాటులో ఉండటంలేదనే విమర్శలు వస్తున్నాయి. కీలక, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో ఉద్ధవ్‌ అధికారులపైనే అధికంగా ఆధారపడుతున్నారు. ఇదే విషయమై ఎన్సీపీ మంత్రి ఒకరు మంత్రి మండలి సమావేశంలో గట్టిగా నిలదీశారు. ఈ పరిణామాలన్నిటినీ భాజపా తనకు అనుకూలంగా మలచుకోవాలని యత్నిస్తోంది. కరోనా కేసుల ఉద్ధృతి మరింత పెరిగితే కూటమి ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల వరకూ అసంతృప్తి విస్తరించే అవకాశం ఉంది. వీరిని ఆకర్షించి తమవైపునకు తిప్పుకోవాలని భాజపా ఆశిస్తోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌ ..తాజాగా రాజస్థాన్‌ పరిణామాలను గమనిస్తే భాజపా ఆశలను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.