close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సేవకు..దూరం లేదు

ఆ వైరస్‌

కంప్యూటర్లలోనైతే వారు ఇప్పటికల్లా యాంటీ వైరస్‌ సృష్టించేవాళ్ళే! కానీ ఏం చేస్తాం... వచ్చింది మాయదారి వైరసాయె! అలాగని ఖాళీగా కూర్చోలేదు...కరోనాపై పోరులో తమవంతు చేయందిస్తున్నారు మన సాఫ్ట్‌వీరులు!

ఇటలీలో కరోనా స్వైరవిహారం చేస్తున్న రోజులు... చదువుకోసం అక్కడికెళ్ళిన సికింద్రాబాద్‌ వాసి అఖిల్‌ లాక్‌డౌన్‌ కారణంగా రాలేని పరిస్థితి... ఇంతలో.. జ్వరం దగ్గు మొదలయ్యాయి...
అక్కడ వైద్యానికి ప్రయత్నించినా కుదరలేదు... కరోనా భయంతో మానసికంగా కుంగిపోయాడు... దీంతో తెలిసిన వారు... హైదరాబాద్‌లోని తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ (టిటా) అధ్యక్షుడు సందీప్‌ మక్తాలకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. ఇక్కడి డాక్టర్‌ ద్వారా ఫోన్లో మాట్లాడించి... అధీకృత ప్రిస్కిప్షన్‌ పంపిస్తే... అక్కడ అఖిల్‌ మందులు కొనుక్కొని వాడి... కోలుకున్నాడు.

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూనే సమాజసేవలో పాలుపంచుకుంటున్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని టెలీ మెడిసిన్‌ విధానంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణ, ఐటీ అక్షరాస్యత కోసం ఏర్పాటైన తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ (టిటా), ఫోరం ఫర్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌ (ఫోర్‌ ఇట్‌) సంస్థలు వేర్వేరుగా టెలీ మెడిసిన్‌ సేవలు అందిస్తున్నాయి. టిటా సంస్థ టీ-కన్సల్ట్‌ పేరిట యాప్‌ ఆధారిత సేవలను, ఫర్‌ ఇట్‌ ఫోరం ఫర్‌ పీపుల్స్‌ హెల్త్‌ పేరిట టెలీ సేవలు అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 35 వేల మంది ప్రజలకు ఇప్పటిదాకా ఉచిత వైద్యసేవలు కల్పించాయి. ఆపదలో ఉన్న వారి ఇళ్లకు మందులు కూడా పంపించాయి. ఈ ప్రజావైద్యంలో పాలుపంచుకునేందుకు 700 మంది వైద్యులు తమ విశ్రాంత సమయాన్ని కేటాయిచారు.


నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం కుడిగళ్ల గ్రామానికి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలికి జ్వరం, దగ్గు మొదలైంది. లాక్‌డౌన్‌ కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి. స్థానికంగా వైద్యులు చికిత్స చేసేందుకు ముందుకు రాలేదు. కుటుంబ సభ్యులు ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించారు. దీంతో అక్కడి ఆశా వర్కర్‌ టీ-కన్సల్ట్‌ యాప్‌ ద్వారా టిటాను సంప్రదించింది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మౌనిక ఆమెకు అవసరమైన వైద్యాన్ని సూచించారు. మందులన్నీ ఆశావర్కర్‌ ద్వారా పంపించారు. ఈ వైద్యంతో ఆమె కోలుకుంది.


లాక్‌డౌన్‌లో ఖమ్మంకు చెందిన నాలుగు నెలల గర్భిణి హైదరాబాద్‌ నుంచి సొంతూరుకు వెళ్లింది. కడుపులో కవలలు ఉండటంతో సమస్యలు వచ్చాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చినందున ఆమెవల్ల కరోనా వస్తుందన్న కారణంతో ఖమ్మంలోని కొన్ని ఆస్పత్రులు అత్యవసర వైద్యానికి నిరాకరించాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులు ‘ఫోరిట్‌’ సంస్థ టెలిమెడిసిన్‌ సేవలకు ఫోన్‌ చేసి, సహాయం చేయాలని కోరారు. వెంటనే ఆ సంఘం స్థానిక గైనకాలజిస్టును సంప్రదించి పరిస్థితిని వివరించారు. ఆమె ముందుకు వచ్చి గర్భిణికి అత్యవసర వైద్యాన్ని అందించారు. ఫోరిట్‌ సేవలతో ఆమెకు సకాలంలో వైద్య అందింది.


ఒక ఫోన్‌కాల్‌తో..

లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడి ఇటలీ నుంచి వచ్చిన కాల్‌తో మాలోనూ ఆలోచన మొదలైందంటారు టిటా అధ్యక్షుడు సందీప్‌ మక్తాల! ఇలాంటి పరిస్థితి విదేశాల్లోని మనవారికే కాకుండా... స్వదేశంలోనూ చాలామందికి ఉంటుందనే ఉద్దేశంతో టిటా... టి- కన్సల్ట్‌ యాప్‌ను రూపొందించింది. ‘‘మా బృందంలోని మిత్రుల సహాయంతో ‘టీ-కన్సల్ట్‌’ పేరిట ఆండ్రాయిడ్‌ యాప్‌ను రూపొందించాం. తొలుత 13 మంది పల్మనాలజిస్టులు ఈ సేవలకు ముందుకు వచ్చారు. సేవలు విస్తృతం కావడంతో 500 మందికి పైగా వైద్యులు తమకు తీరిక వేళల్లో వైద్య సలహాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు’’ అని సందీప్‌ మక్తాల వివరించారు. వీరి సేవల గురించి తెలుసుకున్న నారాయణపేట  కలెక్టర్‌ హరిచందన- జిల్లా అంతటా టి-కన్సల్ట్‌ సేవలు అందించాలని టిటాను కోరారు. ఈ మేరకు మక్తల్‌ మండలంలోని 39 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి నోడల్‌ అధికారిగా నూరుశాతం టెలీ మెడిసిన్‌ సేవలు అందించారు.  గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల్లోని ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలకు టిటా అవగాహన కల్పిస్తోంది. ‘‘ఎవరైనా అనారోగ్య సమస్యతో వచ్చినపుడు నేరుగా సీహెచ్‌సీలోని వైద్య నిపుణుడితో మాట్లాడి ఈ-ప్రిస్కిప్షన్‌ అందించేలా చేస్తున్నాం. రైతులు తమ పంటల సమస్యలపై వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలతో సంప్రదించేలా ప్రాజెక్టును ఇందులో భాగం చేశాం’’ అని సందీప్‌ తెలిపారు.


ఎవరింట్లో వారే ఉంటూ..

ఐటీ ఉద్యోగులు ఎవరింట్లో వారు ఉంటూనే ఫర్‌ ఇట్‌ ఆధ్వర్యంలో ఒక బృందంగా వైద్య సేవలు అందిస్తున్నారు.‘‘లాక్‌డౌన్‌తో మేమంతా ఇళ్లకే పరిమితమయ్యాం. ఒంటరితనం ఎంత బాధగా ఉంటుందో తెలుసు. పేదలకు జ్వరం వచ్చినా ఇంటి నుంచి బయటకు రాలేని, మందులు తీసుకోలేని పరిస్థితి. గర్భిణులు చాలా కష్టాలు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో టెలీ మెడిసిన్‌ (040-48214595/ వాట్సప్‌ నెంబర్‌ 9494438534) తీసుకురావాలని ఫోరం ఫర్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌ (ఫోర్‌ఇట్‌) నిర్ణయించింది.’’ అని ఆ సంస్థ అధ్యక్షుడు కిరణ్‌చంద్ర తెలిపారు. ‘‘మా బృంద సభ్యులు ప్రజల నుంచి వచ్చిన కాల్స్‌ను తీసుకుని, వైద్యులతో కాన్ఫరెన్సు కలిపి మాట్లాడించారు. ఈ తరహాలో 194 మంది ఐటీ నిపుణులు, వలంటీర్లు తమ సేవలు అందించారు. ఉచిత సేవలు అందించడానికి 290 మంది డాక్టర్లు ముందుకు వచ్చారు. కొందరు విశ్రాంత ఉద్యోగులకు దాతల సహాయంతో మందులు అందించారు. అంబులెన్సులు కరోనా సేవలకు పరిమితం కావడంతో క్షేత్రస్థాయిలో ముందుకు వచ్చిన సామాజిక కార్యకర్తలు, వలంటీర్లు తమవంతు సహాయం చేశారు. 24 వేల మంది వరకు టెలీ మెడిసిన్‌ వైద్య సేవలు పొందారు. ‘‘వెబ్‌సైట్‌ www.peoples-health.in ద్వారా నేరుగా వాట్సప్‌ కాల్‌ చేసుకునే అవకాశముంది. ఈ సేవలను నిరంతరం కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నాం.’’ అని కిరణ్‌చంద్ర వివరించారు.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.