close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సుందర.. సుదృఢ..

భారీ భూకంపాలను తట్టుకునేలా ఆలయ నిర్మాణం

అలనాటి అయోధ్యాధీశుడు, అలవైకుంఠపుర అవతార పురుషుడు కొలువుదీరనున్న సుందర మందిరమిది. ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు అయిన శ్రీరామచంద్ర మూర్తి దర్శనమివ్వనున్న ఆలయమిది. సరయూ నది తీరంలో అయోధ్య పురిలో దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఆ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు. రామతత్వం మూర్తీభవించి ఉండే ఈ ఆలయం.. పటిష్ఠతకూ పర్యాయ పదంగా నిలవబోతోంది. వెయ్యేళ్లయినా దాని పటిష్ఠత దెబ్బతినదు. భూకంపాలు వచ్చినా చెక్కుచెదరదు. ఇక్కడి భూసారాన్ని 200 అడుగుల లోతు వరకు తవ్వి పరీక్షించారు. రిక్టరు స్కేలుపై 10 వరకు తీవ్రత ఉండే భూకంపం వచ్చినా ఏమీ కాకుండా ఉండేలా ఆలయ డిజైన్‌ను రూపొందించారని నిపుణులు చెబుతున్నారు.
ఇనుము ఉపయోగించకుండా..
అయోధ్యలో ఆలయాన్ని రాజస్థాన్‌ నుంచి తెప్పించిన శాండ్‌ స్టోన్‌తో నిర్మించనున్నారు. ఇందుకోసం దాదాపు 1.75 లక్షల ఘనపుటడుగుల రాయి అవసరం అవుతుంది. నిర్మాణంలో ఇనుము ఉపయోగించకపోవడం మరో ప్రత్యేకత.
ఈ ఆలయం ప్రధాన ద్వారం వద్ద ఎంత దూరంలో నిల్చున్నా.. రాముడి విగ్రహం కనిపించేలా తీర్చి దిద్దుతున్నారు. అబ్బురపరిచే ఆకృతిలో నిర్మించనున్న అయోధ్య రామ మందిరం నాణ్యతలోనూ దానికదే సాటిగా నిలవనుంది.
30 ఏళ్ల కిందటే డిజైన్‌
ప్రస్తుత రామమందిర డిజైన్‌ 1989లోనే రూపొందింది. దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో చేయి తిరిగిన సోమ్‌పుర కుటింబీకులు రామమందిరానికి డిజైన్‌ అందించారు. 1989లో అప్పటి విశ్వ హిందూ పరిషత్‌ అధిపతి అశోక్‌ సింఘాల్‌.. బిర్లా కుటుంబం ద్వారా చంద్రకాంత్‌ సోమ్‌పుర (78)ను సంప్రదించి అయోధ్యలో రామమందిరానికి డిజైన్‌ అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని ఆయన నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ పెద్ద ఎత్తున భద్రత ఉంది. దీంతో ఆయన భక్తుడి వేషధారణలో వెళ్లి భూమిని తన కాలి అడుగులతో కొలిచారు. ఆ తర్వాత మందిర డిజైన్‌ను రూపొందించారు. ఆ తర్వాత అలహాబాద్‌ కుంభమేళా జరిగినప్పుడు సాధువులు, మఠాధిపతులు ఈ డిజైన్‌ను పరిశీలించి ఆమోదం తెలిపారు.


నాగర శైలిలో..

భారత్‌లో ఆలయాల నిర్మాణానికి ప్రధానంగా 3 రకాల శైలులను (నాగర, దక్షిణాది, మిశ్రమ) అనుసరిస్తారు. అయోధ్య రామాలయాన్ని నాగర శైలిలో నిర్మించనున్నారు. ఉత్తర, పశ్చిమ భారత్‌లో ఎక్కువగా ఈ శైలిని అనుసరిస్తారు. రామాలయ నిర్మాణంలో ఇనుము, సిమెంట్‌ వాడరు. కేవలం రాతి పలకలను వాడతారు. రాతిపలకను వేదికగా చేసుకుని ఆలయాన్ని నిర్మించడం నాగర శైలి ప్రత్యేకత. ఈ వేదికపైకి చేరుకోవడానికి మెట్లు ఉంటాయి. సాధారణంగా నాగర శైలిలో పెద్ద పెద్ద ప్రహరీలు ఉండవు.


మూడున్నరేళ్లలో పూర్తి

మూడు నుంచి మూడున్నర సంవత్సరాల్లో పూర్తిచేయాలని నిర్ణయించారు. స్తంభాలను, ఇతర పలకలను చెక్కే పనులు ఇప్పటికే దాదాపు 40 శాతం వరకు పూర్తయ్యాయి. ఎల్‌అండ్‌టీకి నిర్మాణ బాధ్యత అప్పగించారు.


స్తంభాలు: 366
అంతస్తులు: 3
మొదటి అంతస్తులో 160,
రెండో అంతస్తులో 132,
మూడో అంతస్తులో 74


ఎంత మంది భక్తులు?

ఒకేసారి 10 వేల మంది భక్తులు దర్శించుకొనేందుకు వీలుగా డిజైన్‌ చేశారు. ఆలయ ఆవరణలో దాదాపు లక్ష మంది భక్తులు ప్రార్థన చేసుకోవచ్చని అయోధ్యలోని హనుమాన్‌గఢీ సీనియర్‌ పూజారి మహంత్‌ రాజు దాస్‌ చెప్పారు.


సింహద్వారం

ఏనుగులు, సింహాల ఆకృతులతో అత్యంత కళాత్మకంగా చెక్కుతారు.


ఇవీ ఆలయ విశేషాలు

మొత్తం విసీˆతర్ణం: 67 ఎకరాలు ప్రధాన మందిరం: 2.77 ఎకరాల్లో
ఇతర ఆలయాలు: ప్రధాన ఆలయం రాముడిది కాగా చుట్టు పక్కల సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నడు, కృష్ణుడు, హనుమాన్‌ ఆలయాలు కూడా ఉండే అవకాశాలున్నాయి. ఇతర దేవుళ్లు, దేవతల మందిరాలను ఏర్పాటు చేయడంతో పాటు రామాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తారు. ఆలయ సముదాయంలో ఉపన్యాస వేదిక, వేద పాఠశాల, సంత్‌ నివాస్‌, యాత్రి నివాస్‌లు నిర్మిస్తారు. గోశాల, ధర్మశాల తదితర నిర్మాణాలనూ చేపడతారు.
ఐదు మండపాలు: ఆలయంలో ఐదు మండపాలు- నృత్య మండపం, రంగ మండపం, కూదు మండపం, కీర్తన మండపం, ప్రార్థన మండపం ఉంటాయి. వీటికి ఐదు గుమ్మటాలుంటాయి. గర్భగుడికి శిఖరం ఉంటుంది. ఐదు ప్రవేశ ద్వారాలుంటాయి. 5 గుమ్మటాలు ఉండే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. గర్భగుడి చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసుకోవచ్చు. భక్తులు ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని దేవుడిని ప్రార్థించుకోవడానికి ఏర్పాట్లుంటాయి.
నక్షత్రవాటిక: 27 నక్షత్రాలకు సూచికగా ఆలయ ప్రాంగణంలో 27 మొక్కలను నాటుతారు. భక్తులు తమ తమ జన్మనక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం, దేవుడిని ప్రార్థించుకోవడం ఈ నక్షత్రవాటిక ఏర్పాటు ఉద్దేశం. వాల్మీకీ రామాయణంలో ప్రస్తావించిన వివిధ వృక్ష జాతులనూ నాటుతారు.
రామకథ కుంజ్‌ పార్కు: ఆవరణలో రామకథ కుంజ్‌ పార్కును ఏర్పాటు చేస్తారు. రాముడి జీవిత విశేషాల ఆధారంగా దీన్ని తీర్చిదిద్దుతారు. ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన విశేషాలను ప్రదర్శించేందుకు ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.