close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పడకల కష్టం!

కొన్నిచోట్ల సిఫార్సు ఉంటేనే కేటాయిస్తున్న సిబ్బంది
ప్రభుత్వాసుపత్రుల్లో 25వేలకు పైగా వివిధ రకాల పడకలు ఖాళీ
ఆసుపత్రుల్లో కనిపించని ఖాళీల వివరాల బోర్డులు
ప్రైవేటుకు వెళ్లలేక.. ప్రవేశాలు దొరక్క అవస్థలు
ఈనాడు - అమరావతి, యంత్రాంగం

ఊపిరి ఆడదు.. డొక్కలు ఎగరేసే ఆయాసం.. ఒళ్లంతా మంటలు.. తెరిపి లేకుండా దగ్గు.. ఇన్ని సమస్యలతో పెద్దాసుపత్రికి వెళ్తే అక్కడ ఎవరిని కలవాలో తెలియదు. ఎవరినడిగినా సమాధానం రాదు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే రూ.లక్షల వ్యయం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో 25వేలకు పైగా పడకలు ఖాళీగా ఉన్నట్లు చూపిస్తున్నా.. బాధితులు నేరుగా ఆసుపత్రికి వెళ్తే చేర్చుకోవట్లేదు. సిఫార్సు ఉంటే తప్ప పడకల కేటాయింపు వేగంగా జరగడం లేదు. అధికారంలో ఉన్నవారినో, ఉన్నతాధికారులనో ఆశ్రయించి వారితో ఫోన్లు చేయించిన సందర్భాలలోనే ప్రభుత్వాసుపత్రులలో చేరడం సులభం అవుతోంది. ఎవరూ తెలియని బాధితులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వైరస్‌ నిర్ధారణ పరీక్ష, ఫలితంతో నిమిత్తం లేకుండా లక్షణాలున్నా, అనారోగ్యం తీవ్రంగా ఉన్నా చికిత్స అందించాలని.. ఆరగంటలోనే పడకలు కేటాయించాలన్న ప్రభుత్వ ఆదేశాలు చాలాచోట్ల అమలు కావట్లేదు.
ప్రభుత్వాసుపత్రులలో ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయో తెలియజేసే బోర్డులు కూడా దాదాపు ఎక్కడా ఉండట్లేదు. ఆ విషయం ఎవరిని అడగాలో తెలియక.. ఆసుపత్రిలో ఎలా చేరాలో అర్థం కాక బాధితులు తలపట్టుకోవాల్సి వస్తోంది.

పడకలు ఉన్నా.. లేవని
కాకినాడ జీజీహెచ్‌లో పడకల సంఖ్య తెలిపేలా డిస్‌ప్లే బోర్డులు లేవు. ఆసుపత్రిలో కరోనా వార్డులో రోగులకు చికిత్స సవ్యంగా అందడం లేదని, ఫాలోఅప్‌ సరిగ్గా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ వైద్యకళాశాల కొవిడ్‌-19 ఆసుపత్రిలో పడకలు ఉన్నా ఖాళీలు లేవని చెబుతున్నారు. అమలాపురం కిమ్స్‌లోనూ అదే పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి అమలాపురానికి వచ్చిన బాధితులు అంబులెన్సుల్లోనే గంటలకొద్దీ ఉండాల్సి వస్తోంది. రాజకీయ సిఫార్సులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఐసీయూలో పడకల కొరత ఉంది. ఉన్నవాటి కేటాయింపులో జాప్యం జరుగుతోంది.

అమ్మో.. ఒంగోలు జీజీహెచ్‌లోనా?
సిఫార్సు లేకుంటే ఒంగోలు జీజీహెచ్‌లో అడ్మిషన్‌ దొరకడం గగనం. యద్దనపూడికి చెందిన వృద్ధురాలికి చీరాలలో పరీక్ష చేయిస్తే 24న పాజిటివ్‌ వచ్చింది. ఒంగోలులోని ప్రైవేట్‌ కొవిడ్‌ ఆసుపత్రికి వెళ్తే చేర్చుకోవడానికి అంగీకరించినా.. చివర్లో ఆక్సిజన్‌ బెడ్లు ఖాళీ లేవని చెప్పడంతో అర్ధరాత్రి జీజీహెచ్‌కి తీసుకెళ్లారు. అక్కడ మూడో అంతస్థులో పడక కేటాయించడంతో బాధితురాలి పరిస్థితి వర్ణనాతీతం. ఐదు రోజుల కిందట ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో జీజీహెచ్‌కు రాగా.. వరండాలో కింద పడుకోబెట్టి ఆక్సిజన్‌ ఇచ్చారు. కావలి ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆక్సిజన్‌ స్థాయి 80 వరకూ పడిపోవడంతో అడ్మిషన్‌ కోసం రాగా 2 గంటలు ఎవరూ పట్టించుకోలేదు. తెలిసినవారితో ఫోన్‌ చేయిస్తే అప్పుడు చేర్చుకున్నారు. ‘‘కేసులు ఎక్కువగా ఉన్నందున పడకలు ఖాళీ ఉండట్లేదు. శ్వాసకోశ సమస్యలతో వచ్చేవారికి కొంత ఆలస్యమైనా ఆక్సిజన్‌ పడకలు ఇస్తున్నాం. మరో 400 ఆక్సిజన్‌ పడకలు రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తాయి’’ అని జీజీహెచ్‌ పర్యవేక్షణాధికారి డాక్టర్‌ శ్రీరాములు తెలిపారు.

కనిపించని బోర్డులు
గుంటూరు జీజీహెచ్‌లో చేర్చుకోడానికి కొన్నిసార్లు గంట వరకూ సమయం పడుతోంది. బాధితుల వివరాలు నమోదు చేసుకొని, చేర్చుకోవడంలో జాప్యం జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. పడకల లభ్యత వివరాలు తెలియజేసే బోర్డు లేదు. తెనాలి జిల్లా ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. మంగళగిరిలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఓ రోగి ఆస్థమాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా వెంటిలేటర్‌ పడక సకాలంలో కేటాయించలేదు. పడక లభించినా అక్కడి పరిస్థితులు చూసి బెంబేలెత్తిన కుటుంబసభ్యులు రెండు రోజుల తరువాత విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా.. ‘అవసరానికి అనుగుణంగా పడకలు ఇస్తున్నాం, వైరస్‌ కేసులు పెరిగినప్పుడు చిన్న సమస్యలొచ్చినా పరిష్కరిస్తున్నాం.’ అని వివరించారు.

ఆదివారం మధ్యాహ్నానికి రాష్ట్రవ్యాప్త సమాచారం ఇలా..


నెల్లూరులో చేరాలన్నా.. డిశ్ఛార్జి కావాలన్నా..

నెల్లూరు జీజీహెచ్‌లో అడ్మిషన్‌ పొందాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. ఊపిరాడని స్థితిలోని వచ్చినా.. వైరస్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకు రమ్మని పంపేస్తున్నారు. మనుబోలులోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పక్షం రోజుల కిందట కొవిడ్‌తో జీజీహెచ్‌లో చేరడానికి వచ్చి గంటపాటు అవస్థలు పడ్డారు. చివరకు అధికారులకు ఫోన్‌ చేశాక పడక లభించింది. గత వారం ముత్తుకూరుకు చెందిన ఓ వ్యక్తి ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరాతీస్తే ఎక్కడా ఖాళీ లేదని సమాధానం వచ్చింది. చివరకు జీజీహెచ్‌లో అడ్మిషన్‌ లభించినా ఆక్సిజన్‌ పెట్టి తదుపరి చికిత్సలో జాప్యం చేశారు. దాంతో తిరుపతి స్విమ్స్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయన్ను డిశ్ఛార్జి చేయడానికి 4 గంటలు పట్టింది. ‘‘అవసరాలకు తగ్గట్లుగానే పడకలున్నాయి. చికిత్సలో ఎటువంటి సమస్యల్లేవు. సిబ్బంది కొరత లేదు’’ అని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.