close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అపర చాణక్యుడు

ఐదడుగుల 4 అంగుళాల ఎత్తుతో నలుగురి మధ్య పొట్టిగా కనిపించే ప్రణబ్‌ ముఖర్జీ..సమకాలీన భారతీయ రాజకీయాల్లో మాత్రం ఆజానుబాహుడు.

ఎంతటి విపత్కర సమస్యనైనా ఓర్పు, నేర్పుతో పరిష్కరించగల దిట్ట. రాజకీయం, ఆర్థికం, చరిత్రలో తలపండిన భీష్మాచార్యుడాయన. పార్లమెంటు చర్చల్లో సహస్రావధానం చేయగల చాణక్యుడు. ఏ అంశంలోనైనా కసరత్తు లేకుండానే కత్తులు ఝళిపించగల సవ్యసాచి. పశ్చిమబెంగాల్‌ యాసతో ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలరు. ఆయన మాటల్లో కనిపించేంత పస ప్రస్తుతం ఏ భారతీయ రాజకీయ నాయకుడిలోనూ లేదనడం అతిశయోక్తి కాదు.

యూపీఏలో బాహుబలి
పార్టీలోనూ, పార్లమెంట్‌ వ్యవహారాల్లోనూ సంక్షోభాలు తలెత్తినప్పుడల్లా కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ముందు గుర్తొచ్చేది ప్రణబ్‌ముఖర్జీనే. అప్పట్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరి.. ఆ పదవిలో కొనసాగాలన్న పట్టుదలతో ఉన్నప్పుడు ఆయన్ను తప్పించే బాధ్యత సోనియా ప్రణబ్‌కే అప్పగించారు. ప్రణబ్‌ తన నివాసంలో చాణక్యం ప్రదర్శించి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత ఏడాది సోనియా విదేశీయత అంశాన్ని లేవనెత్తిన శరద్‌పవార్‌, తారిఖ్‌ అన్వర్‌, పి.ఎ.సంగ్మాలను ఎదుర్కొనే బాధ్యతను మళ్లీ ప్రణబ్‌కే అప్పగించారు. ఈ పనినీ సమర్థంగా నిర్వర్తించారు. ఏఐసీసీ తీర్మానాలన్నీ దాదాపుగా ఆయనే రూపొందించేవారు.

2004 నుంచి 2014వరకు పదేళ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏ సమస్య వచ్చినా ముందుండి ఎదుర్కొన్న బాహుబలి ప్రణబ్‌. పార్టీ పరంగాను, ప్రభుత్వ పరంగాను ఎదురయిన కష్టనష్టాలన్నింటినీ ఆయనే పరిష్కరించారు. సుమారు 25 పార్టీల సమాహారంతో కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఒడుదొడుకులు లేకుండా నడిపించడంలో ప్రణబ్‌ పోషించిన పాత్ర అనితర సాధ్యం. 2004-14 మధ్య కాలం ప్రణబ్‌ ముఖర్జీ రాజకీయ జీవితంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేశ రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన పవర్‌ కారిడార్‌గా చెప్పుకొనే నార్త్‌, సౌత్‌ బ్లాక్‌ల్లో హోంశాఖ తప్ప అన్ని మంత్రిత్వశాఖలు నిర్వహించారు. మన్మోహన్‌సింగ్‌ బైపాస్‌ సర్జరీ చేయించు కున్నప్పుడు 2009లో ప్రధానమంత్రిగానూ కొన్నాళ్లు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. పదేళ్లపాటు మన్మోహన్‌సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ అధికార కూటమి లోక్‌సభాపక్ష నేతగా దిగువ సభలో మొదటి ఆసనంలో కూర్చొని రాజకీయాలను నడిపించారు. అత్యంత కీలకమైన చర్చల్లో ప్రతిపక్షాలను తన మేథో సంపత్తితో ఢీకొని నిలువరించారు.

నిగర్వి..
భేషజాలు, అహంకారం అయనలో మచ్చుకైనా కనిపించవు. ఎంత ఎత్తుకు ఎదిగినా బెంగాలీ భాష, సంస్కృతి మరువని మనిషి. చరిత్రను తవ్విపోయడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. ఆయనో నడిచే ఎన్‌సైక్లోపీడియా. పార్లమెంటులో చర్చలో పాల్గొనాలంటే చాలామంది ముందే రాసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రణబ్‌ముఖర్జీకి అదేమీ అవసరం ఉండదు. ఏ ఘట్టాన్నైనా తేదీలతో సహా ఉటంకించి ఎదుటివారిని నిలువరించగల సత్తా ఆయన సొంతం.


మత స్వేచ్ఛ, స్త్రీ-పురుష సమానత్వం, ఆర్థిక సమానత్వంతో భారత్‌ ఆధునిక దేశంగా అవతరిస్తుంది. చిన్న చిన్న లోపాలున్నా భారత్‌ అలాంటి ఆధునిక దేశంగా అవతరిస్తోంది. దేశంలో ఏ మతవిశ్వాసమూ ప్రమాదంలో పడలేదు.

- ప్రణబ్‌ ముఖర్జీ


పనిలోనే ఆనందం

లుపెరగకుండా పని చేయడం ఆయన నైజం. 24 గంటల అమెరికా ప్రయాణం చేసి వచ్చిన తర్వాతకూడా విమానాశ్రయం నుంచి నేరుగా ఆఫీసుకెళ్లి దస్త్రాలన్నింటిపై సంతకాలు చేసిన తర్వాతే ఇంటికెళ్లడం ఆయనకు అలవాటు. ఇల్లు, కార్యాలయం, పగలు, రాత్రి అన్న తేడాలేకుండా పని చేయడం ఆయనకే చెల్లు.

- ఈనాడు, దిల్లీ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.