close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మూడో ఏట నుంచే చదువులేంటి?

మానసిక పరిస్థితిపై దుష్ప్రభావం
తొలిదశలో మాతృభాషే మేలు
సంస్కరణలు నిలకడగా ఉండాలి
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి. పూర్వ డైరెక్టర్‌ కృష్ణకుమార్‌

ఎన్‌.విశ్వప్రసాద్‌
ఈనాడు - హైదరాబాద్‌

మూడో ఏడాది నుంచే పిల్లలకు చదవడం, రాయడం, లెక్కలకు సంబంధించిన నైపుణ్యాలను నేర్పించాలని నిర్ణయించడం ఆందోళనకరం. ఇది వారి మానసిక పరిస్థితిపై దుష్ప్రభావం చూపుతుంది. పిల్లలు కేవలం అక్షరాలను గుర్తుపట్టి.. వాటికి సంబంధించిన శబ్దాలను యాంత్రికంగా సాధన చేసే విధానం కంటే, పదాల అర్థాలను వారు ఆసక్తిగా తెలుసుకునే క్రమంలోనే అక్షరాలు గుర్తించడాన్ని నేర్పించడం మంచిదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

విద్యారంగంలో సంస్కరణలను నిలకడగా కొనసాగిస్తేనే మంచి మార్పులు చోటుచేసుకుంటాయని ఆ రంగ ప్రముఖుడు కృష్ణకుమార్‌ అభిప్రాయపడ్డారు. మూడో ఏడాది నుంచే పిల్లలకు చదవడం, రాయడం, లెక్కలకు సంబంధించిన నైపుణ్యాలను నేర్పించాలని నూతన విద్యావిధానం చెబుతున్నదని .. ఇది ఆందోళనకరమని ఆయన వివరించారు. దురదృష్టవశాత్తు.. విద్యారంగంపై కరోనా ప్రతికూల ప్రభావం గురించి కొత్త విద్యావిధానంలో ఒక అంచనా కానీ, దాన్ని ఎలా అధిగమించాలనే మార్గాన్వేషణ కానీ లేవని ఆయన ఎత్తిచూపారు. ఇప్పటికే కరోనా దుష్ఫలితాలు విద్యపై కనిపిస్తున్నాయని,  దీనిపై తక్షణం దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. ఆయన గతంలో జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి) డైరెక్టర్‌గా పనిచేశారు. దిల్లీ యూనివర్సిటీలో ‘ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌’ గానూ వ్యవహరించారు. విద్యపై అనేక పుస్తకాలు రాశారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన నూతన జాతీయ విద్యావిధానంపై ఆయన ‘ఈనాడు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివి..

ఇటీవల నూతన విద్యా విధానాన్ని ప్రకటించిన కేంద్రం విద్యారంగంలో సమూల మార్పులు తెస్తామని చెబుతోంది. ఈ విధానాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు?
విద్య నిరంతర ప్రక్రియ. భారత్‌ వంటి వైవిధ్యభరితమైన, సంక్లిష్టమైన దేశంలో విద్య విభిన్నమైన పాత్రలు పోషిస్తుంది. ఈ రంగాన్ని సంస్కరిద్దామనుకుంటే.. మొదట ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏమిటంటే మన సామాజిక అవసరాలకు తగినట్లుగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దడానికి అవసరమైన సంస్కరణలు కొత్తవిధానంలో ఉన్నాయా.. లేవా? అన్నది. విద్యారంగంలో చేపట్టే సంస్కరణలను ‘ఎంతకాలం నిలకడగా కొనసాగించాం’ అనేదాన్ని బట్టే ఫలితాలు వస్తాయి. అంతేకానీ మొత్తం రంగాన్ని మార్చేయాలనుకునే లక్ష్యాలు పెట్టుకుంటే.. ఉపయోగం ఉండదు.

కొత్త విద్యా విధానంలో భాగంగా పునాది దశలో 3 నుంచి 8 సంవత్సరాల పిల్లలను చేర్చారు. ఇప్పటివరకూ 10+2గా ఉన్న దశలను 5+3+3+4 గా మార్చారు. విద్యార్థులకు బోధించే అంశాలలో.. బోధనా పద్ధతుల్లో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. వీటిపై మీ అభిప్రాయం ఏమిటి.
అతి చిన్న వయసులో.. పిల్లలకు పదాల అర్థాలు తెలియకముందే, వాటిని అన్వయించుకునే ఊహ రాకముందే.. అక్షరాలను శబ్దాలతో మాత్రమే ముడిపెట్టి ఒక డ్రిల్‌ మాదిరిగా నేర్పిస్తే.. అది వారిలో ‘సారాంశాన్ని గ్రహించకుండా చదవడం’ అనే యాంత్రికమైన అలవాటుకు దారి తీస్తుంది. తర్వాత దానిని పోగొట్టడం చాలా కష్టం. విద్యావంతులైన చాలామందిలో చదవడం పట్ల ఏమాత్రం ఆసక్తి లేకపోవడాన్ని మనం గమనిస్తుంటాం. దానికి కారణం ఇదే.

ఇక రాయడం విషయానికి వస్తే.. అది ప్రధానంగా మన ఆలోచనలను ఇతరులకు తెలపడానికే కదా! రాత ప్రక్రియ తమకు అవసరం అనే ఆలోచన, ఆసక్తి కలిగే దశలో పిల్లలకు నేర్పిస్తే అర్థవంతమైన ప్రక్రియ అవుతుంది. మరీ చిన్న వయసులో నేర్పిస్తే అది యాంత్రికమైన నైపుణ్యంగానే తయారవుతుంది. అంకెలు.. లెక్కలకూ ఇదే వర్తిస్తుంది. పిల్లలకు ప్రపంచంలోని విషయాలను అర్థం చేసుకోవడానికి గణితం ఒక సాధనం. తనకు కనిపించే వస్తువులు, తదితరాలతో తనకున్న సంబంధాన్ని అన్వయించుకునే క్రమంలో లెక్కలు అవసరం అవుతాయి. అంతకంటే ముందే మరీ చిన్నపిల్లలతో అంకెలను బిగ్గరగా వల్లెవేయించి.. తర్వాత వాటితో లెక్కలు చేయించడం ప్రారంభిస్తే వారికి సమస్య అవుతుంది. తమకు కనిపించే అంశాలతో.. తమకు ఆసక్తి ఉండే విషయాలతో వారు అంకెలను అనుసంధాన పరుచుకునే ప్రక్రియ దెబ్బతింటుంది. దీనివల్ల దీర్ఘకాలిక దుష్ఫలితాలుంటాయి. గణితం మీద ఆసక్తి తగ్గిపోవచ్చు కూడా. ఇక ప్రతిపాదిత దశల్లో చివరిది నాలుగేళ్ల డిగ్రీ కోర్సు. కొద్ది సంవత్సరాల కిందట దిల్లీ విశ్వవిద్యాలయం ఇలాంటి డిగ్రీని ప్రవేశపెట్టి విరమించుకుంది. దాని వైఫల్యానికి కారణాలపై అధ్యయనం చేయకుండా, అదే ప్రయోగాన్ని మళ్లీ చేపట్టడం వల్ల ఉపయోగం ఉండదు.

అవకాశం ఉన్నచోటల్లా కనీసం అయిదో తరగతి వరకూ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలని నూతన విద్యావిధానం పేర్కొంది. 8 వరకు కానీ, అంతకు మించిన తరగతుల వరకూ కానీ మాతృభాషలో బోధన ఉత్తమమని నిర్దేశించింది. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖమంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ ఒక ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడుతూ పాఠశాలల్లో ఏభాషలో బోధించాలనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని పేర్కొన్నారు. బోధనా భాషకు సంబంధించి ప్రభుత్వ విధానంపై మీరేమనుకుంటున్నారు.
పాఠశాల తొలి దశలో ఒక చిన్నారి మాట్లాడే భాష ఆ చిన్నారికి తగిన పునాది ఏర్పడేందుకు విస్తృతమైన అవకాశాలు ఇస్తుంది. వలసపాలన సాగిన అనేక దేశాలలో ‘బోధనా భాష’ అనే అంశం ఎప్పటినుంచో చర్చలో ఉంది. దీని వల్లనే పిల్లలకు తొలిరోజుల్లో భాషను బోధించే పద్ధతులకు సంబంధించి ఉన్న నిజమైన సమస్యలు మరుగున పడుతున్నాయి. మన వ్యవస్థ కూడా ‘బోధనా భాష’ అనే ప్రశ్న వద్దే చిక్కుకుపోయింది. ఈ అంశాన్ని సరిగా అర్థం చేసుకోనంత కాలం వివిధ రాష్ట్రాలలోనూ, కేంద్రీయ విద్యాలయాల్లోనూ ఇప్పుడున్న పద్ధతుల్లో మార్పులు రావు.

ఉన్నత విద్యాసంస్థలను భిన్నమైన అనేక అంశాలను బోధించే విశ్వవిద్యాలయాలుగా, కళాశాలలుగా, విజ్ఞాన కేంద్రాలుగా మార్చాలని నూతన విద్యావిధానం నిర్దేశిస్తోంది. ఏదో ఒక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండే ప్రస్తుత కళాశాలలన్నీ డిగ్రీలు మంజూరు చేయగల స్వయం ప్రతిపత్తి సంస్థలుగా మారతాయి. ఈ మార్పులు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి.
ప్రస్తుత ఉన్నత విద్యారంగ పరిస్థితిని గమనిస్తే అది ఎంతగా నాశనమైందో అర్థం అవుతుంది. ఎన్నో ఏళ్లుగా అధ్యాపకుల కొరత కొనసాగుతోంది. కొత్త ఆలోచనలు చేసేముందు ఉన్న పరిస్థితిని ఎలా మెరుగుపెట్టాలనే దానిపై దృష్టిపెట్టాలి. ప్రైవేటు రంగంలో వాణిజ్య ధోరణి తీవ్రంగా ఉంది. నియంత్రించాల్సిన వ్యవస్థలు విఫలమయ్యాయి. ఇలా ఎందుకు జరిగిందో పరిశీలించుకోకుండా ముందుకు వెళ్లడం అసాధ్యం.

సంస్కృత భాషకు నూతన విద్యావిధానం ప్రాధాన్యాన్ని ఇచ్చింది. ప్రతి విద్యార్ధి మూడు భాషలు నేర్చుకోవాలన్న సూత్రం అమలుకు ఈ భాషనూ సిఫారుసు చేసింది. దీనిపై మీ అభిప్రాయం.
సంస్కృతం చాలా ముఖ్యమైన భాష. దాని బోధనను మెరుగుపర్చాలని గతంలో అనేక కమిటీలు గట్టిగా చెప్పాయి. ఈ భాషపై పరిశోధనకు అవకాశాలను కల్పించాలి. నిధులూ ఇవ్వాలి.

విద్యార్థులు ఏమేరకు నేర్చుకున్నారో అంచనా వేసే ప్రక్రియలో, పరీక్షల విధానాల్లో నూతన విధానం అనేక మార్పులను నిర్దేశించింది. వాటిపై మీ అభిప్రాయం ఏమిటి?
ఈ విషయంలో గతంలో అనేక కమిటీలు లెక్కలేనన్ని సిఫార్సులు చేశాయి. బోర్డు పరీక్షలకు సంబంధించి మదింపు విధానాన్ని మెరుగుపర్చేందుకు ‘నేషనల్‌ ఫోకస్‌ గ్రూప్‌ ఆన్‌ ఎగ్జామినేషన్‌ రిఫార్మ్స్‌’ (2005) ఒక స్పష్టమైన వ్యూహాన్ని అందించింది. అయితే కేంద్ర బోర్డులు కానీ, రాష్ట్ర ప్రభుత్వాల బోర్డులు కానీ తమ విధానాలను మెరుగుపర్చుకునే ప్రయత్నాలు చేయలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.

జాతీయ విద్యా విధానం-1968 చేసిన సిఫారసు ప్రకారం స్ధూల జాతీయోత్పత్తి (జి.డి.పి)లో 6 శాతాన్ని విద్యపై ఖర్చు పెట్టాలి. 1986లో ప్రకటించిన విధానంలోనూ ఈ విషయం మళ్లీ చెప్పారు. కానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జి.డి.పిలో 4.43 శాతాన్నే ఖర్చుచేస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ ఖర్చును 6 శాతానికి చేర్చాలని ప్రస్తుత విధానం పేర్కొంటున్నది. కొత్తగా పెంచే నిధులతో విద్యారంగ అవసరాలు తీరుతాయా?
విద్యారంగంపై వెచ్చించే నిధులపై గతంలో వేసిన అంచనాలు కరోనా వల్ల వాస్తవ రూపం దాల్చగలవనే నమ్మకం లేదు. ఆరు శాతం అంకె అనేది అర్ధశతాబ్దం కిందట కొఠారి చెప్పినది. ఎన్నాళ్లయినా అది ఆచరణలోకి రావడమే లేదు.

విద్యారంగంలో వాణిజ్య ధోరణులను నివారించడానికి అనేక విధాలుగా కృషిచేయనున్నట్లు కొత్త విద్యావిధానం ప్రకటించింది. ఇందుకోసం ‘తేలికగానే ఉండే పటిష్ఠ’ (లైట్‌ బట్‌ టైట్‌) ప్రక్రియను అనుసరించనున్నట్లు పేర్కొంది. ఇది వాణిజ్య ధోరణులను నియంత్రించగలదా?
దేశంలో సరళీకృత విధానాలను విద్యారంగానికీ అన్వయించినప్పటి నుంచి వాణిజ్య ధోరణి ఉత్పన్నమైంది. ప్రైవేటు, ప్రభుత్వ విద్యారంగాల ప్రయోజనాలు, లక్ష్యాల మధ్య తేడాను మనం విస్మరిస్తున్నాం. సమస్యను పరిష్కరించేందుకు కృషిచేయాలంటే ముందుగా మనం ఈ విషయాన్ని గుర్తించడం అవసరం.

పిల్లలు మధ్యలోనే చదువు మానేయడం అనేది మనం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య. జాతీయ నమూనా సర్వే ప్రకారం 2017-18లో దేశంలో, 6 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు ఉండి బడికి దూరంగా ఉన్న పిల్లల సంఖ్య 3.22 కోట్లు. 2030 నాటికి సెకండరీ స్థాయి వరకూ పిల్లలు వంద శాతం బడికి వెళ్లేలా చూడటం నూతన విద్యావిధానం లక్ష్యం. ఇది సాధ్యమని మీరు భావిస్తున్నారా?
ప్రాథమిక స్థాయిలో ఒకప్పుడు బాగా ఎక్కువగా ఉన్న ఈ సమస్య తీవ్రత సర్వశిక్ష అభియాన్‌, విద్యాహక్కు చట్టాల వల్ల కొంత తగ్గింది. ప్రాథమికోన్నత స్థాయినుంచి ఇప్పటికీ ఎక్కువ ఉంది. ప్రత్యేకించి బాలికల్లో, ఆర్థికంగా.. సామాజికంగా వెనుకబడ్డవాళ్లలో ప్రబలంగా ఉంది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిన ఎక్కువ. కరోనా వల్ల ఈ సమస్య మళ్లీ తీవ్రరూపం దాల్చనుంది.

ఎంఫిల్‌ డిగ్రీని ఆపేయబోతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
కోర్సులను, అధ్యయనాంశాలను ఎంచుకోవడంలో విద్యార్ధులకు సరళమైన అవకాశాలుండాలని నొక్కిచెప్పిన నూతన విద్యావిధానం ఎంఫిల్‌ను నిషేధించడం వింతగా ఉంది.

దేశంలోని ఉన్నత విద్యారంగం మొత్తాన్ని నియంత్రించేందుకు ‘హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ అనే వ్యవస్థ ఏర్పాటు కానుంది. దీని గురించి మీరేమంటారు?
ఇలాంటి వ్యవస్థను గతంలోనే యశ్‌పాల్‌ కమిటీ ప్రతిపాదించింది. అయితే దానికి నియంత్రణ స్వరూపం లేదు. ఇప్పుడు కొత్తగా పెట్టే వ్యవస్థ నియంత్రణ కోసమే అయితే.. కేంద్రీకరణ ధోరణి పెరుగుతుంది.


సదుపాయాలు సమకూరిస్తే చిన్న పాఠశాలలు మెరుగు
విద్యారంగ ప్రముఖుడు కృష్ణకుమార్‌

ప్రశ్న: అధికారిక లెక్కల ప్రకారం దేశంలో 2016-17లో 1,08,017 ఏకోపాధ్యాయ బడులు ఉన్నాయి. విసిరేసినట్లు ఎక్కడెక్కడో ఉండే ఇలాంటి చిన్న బడుల వల్ల బోధనా ప్రక్రియపై వ్యతిరేక ప్రభావం పడుతోందని నూతన విద్యావిధానం అభిప్రాయపడింది. కొన్ని బడులను గ్రూపుగా మార్చడం, కలిపివేయడం వంటి వినూత్నమైన చర్యల ద్వారా ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు పేర్కొంది. ఈ పరిష్కారంపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు: కేంద్రం 1986లో వెలువరించిన విద్యావిధానం కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండకూడదనే చెప్పింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను, ప్రాథమిక సదుపాయాలను సమకూరిస్తే చిన్న పాఠశాలలు బాగా పనిచేస్తాయి.

ప్రశ్న: ప్రపంచ విద్యాభివృద్ధి ఎజెండా ప్రకారం 2030 నాటికి భారత దేశం అందరికీ సమాన స్థాయిలో నాణ్యమైన విద్యను అందుబాటులో ఉంచాల్సి ఉంది. దేశ విద్యా రంగాన్ని నూతన విద్యావిధానం దిశగా నడిపించగలదా?
జవాబు: ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చే ప్రాధాన్యంపై ఇది ఆధారపడి ఉంటుంది. విద్యను మనం అందరికీ అందుబాటులోకి తీసుకురాదల్చుకోవాలి. మన సామాజిక పరిస్థితుల్లో అది నిర్వహించగలిగిన పాత్రను ముందుగా గుర్తించడం చాలా కీలకం. ప్రస్తుతం మనం అనేక ఇతర దేశాల్లాగేే... నియంత్రణ దృక్పథంలో చిక్కుకుపోయాం. ఎంతమంది ఎలా ఉత్తీర్ణులయ్యారు? ఎలాంటి ఫలితాలు పొందారు? అనే అంశానికే మన వ్యవస్థ పరిమితం అవుతోంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.