close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒకే ఓటరు.. ఒకే జాబితా

ఎప్పటికైనా ఈ పద్ధతి అనుసరణీయమే
రాజ్యాంగ సవరణతోనే సాధ్యం
రాష్ట్రాల హక్కులకు భంగం కాదు
‘ఈనాడు’తో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్‌ హెచ్‌.ఎస్‌.బ్రహ్మ
ఈనాడు - హైదరాబాద్‌

‘అన్ని ఎన్నికలకూ ఒకే ఓటరు జాబితాను ఆచరణలోకి తీసుకురాగలిగితే వృథా ఖర్చు తగ్గుతుంది.. బోలెడంత సమయం ఆదా అవుతుంది. అన్ని ఎన్నికలకూ ఓటర్లు వారే అయినప్పుడు ఇన్ని జాబితాలు ఎందుకు? ఒకటే సరిపోతుంది. అయితే, ఆ మేరకు రాజ్యాంగంలో సవరణలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఒకే ఓటరు జాబితా వల్ల రాష్ట్రాలను హక్కులను హరించినట్లూ కాదు. రాష్ట్ర ఎన్నికల సంఘం అస్తిత్వాన్ని ప్రశ్నించినట్లూ కాదు’ అని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్‌ హెచ్‌.ఎస్‌.బ్రహ్మ అన్నారు. ఒకే ఓటరు జాబితా రూపకల్పన దిశగా కేంద్రం యోచిస్తున్న నేపథ్యంలో ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివి..
పార్లమెంటు నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఒకే ఓటరు జాబితాను రూపొందించాలని కేంద్రం భావిస్తోంది కదా? అది ఎంతవరకు ప్రయోజనకరం?
జవాబు: కొంతకాలంగా ఈ ఆలోచన కేంద్రంలో నలుగుతోంది. ఎప్పటికైనా ఈ విధానం రావాల్సిన అవసరం ఉంది. చాలా ప్రయోజనకరం కూడా. వివిధ రకాల ఓటరు జాబితాలను తయారు చేయడానికి ఎంతో సమయం పడుతోంది. ప్రజాధనం ఖర్చవుతోంది. మానవవనరులు వృథా అవుతున్నాయి. వాస్తవంలో అన్ని జాబితాలను తయారు చేసేది స్థానిక యంత్రాంగమే. కేంద్ర ఎన్నికల సంఘం ఏటా ఓటర్ల జాబితాను సవరిస్తుంది.
ఏడాదిలో ఎప్పుడైనా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కూడా. స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితాకు అలాంటి విధానమే లేదు.
ఆచరణలో ఎంత వరకు సాధ్యమంటారు?
జ: ఒకే పాన్‌కార్డు, ఆధార్‌కార్డు సాధ్యం అయినప్పుడు ఉమ్మడి ఓటరు జాబితాకు ఇబ్బంది ఏముంటుంది చెప్పండి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితాలను తయారు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ లేదు. రాష్ట్ర యంత్రాంగాలే రూపొందిస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం అదే యంత్రాంగం మరో జాబితా రూపొందించాల్సిన అవసరమేంటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక రాజకీయాలు ఒకింత సున్నితంగా ఉంటాయి. ప్రతి ఎన్నికల సమయంలో మనం వింటూనే ఉంటాం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశాం. స్థానిక ఎన్నికల్లో ఓటు తొలగించారంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కొత్త విధానం అమల్లోకొస్తే ఇలాంటి ఇబ్బందులుండవు.
స్థానిక సంస్థల ఓటరు జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించింది. దాన్ని కాదనటం వారి హక్కును హరించటం కాదా?
జ: స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రభుత్వం వద్ద పెద్దగా అధికార యంత్రాంగం లేదు. అప్పటి పరిస్థితుల ఆధారంగా వేర్వేరు వ్యవస్థలు, విధానాలను ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా చాలా మార్పులు వచ్చాయి. ఎన్నికల సంఘంలో మార్పుల కోసం కొన్నేళ్లుగా కసరత్తు జరుగుతోంది. చాలా అంశాలు రాజ్యాంగ పరిధిలో ఉండటంతో సంస్కరణలు ఆలస్యం అవుతున్నాయి. ఉమ్మడి ఓటరు జాబితా రూపొందించేందుకు రాజ్యాంగ సవరణ కోసం కూడా కసరత్తు జరుగుతోంది. ఉన్నపళంగా ఎన్నికల సంఘం దీనిని రాష్ట్రాలపై రుద్దదు. రాష్ట్రాలతో మాట్లాడి వాటిని ఒప్పించాకే జరుగుతుంది. ఎప్పటికైనా ఉమ్మడి జాబితా అవసరం.

జమిలి ఎన్నికల వ్యూహంతో కేంద్రం దీనిపై దృష్టి పెట్టిందంటున్నారు? నిజమేనా?
జ: కేంద్రం ఒకే ఓటరు జాబితాను ఎందుకు రూపొందించాలని భావిస్తుందో చెప్పలేను కానీ, ఒకేదఫా ఎన్నికలు నిర్వహించాలన్న యోచన ఎన్నికల సంఘంలో చాలాకాలం నుంచి ఉంది. ప్రభుత్వానికి కూడా నివేదించారు. ఒకేసారి ఎన్నికల వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. ఒకేదఫా ఎన్నికలు, ఒకే ఓటరు జాబితా అనేవి కార్యరూపంలోకి వస్తే పెద్దమొత్తంలో ప్రజాధనం ఆదా అవుతుంది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ల భవిత, వ్యయంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
జ: ఆ వ్యవస్థలకు వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించలేదు. ఏ వ్యవస్థకు ఉండే విధులూ మారవు. జాబితా మాత్రమే ఒక్కటిగా ఉంటుంది. ప్రతి పని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే జరుగుతుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.