close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వాస్తవాధీన రేఖను మార్చే కుట్ర

45 ఏళ్ల తర్వాత సరిహద్దులో పేలిన తూటా
ఈనాడు-ఇంటర్నెట్‌ డెస్క్‌

రిహద్దుల్లో డ్రాగన్‌ తెంపరితనం రోజురోజుకూ పెరిగిపోతోంది. తాను నిబంధనలు ఉల్లంఘిస్తే భారత్‌ ప్రశ్నించకూడదనే ధోరణి నుంచి బయటకు రాలేకపోతోంది. తన బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా నిలిచిన భారత్‌ను చూసి చైనాకు ఏంచేయాలో పాలుపోవడం లేదు. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న వాస్తవాధీన రేఖను రణరంగంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఫలితంగా అక్కడ సోమవారం రాత్రి తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిగాయి. భారత్‌-చైనాల సరిహద్దుల్లో తుపాకులు వాడకూడదనే ఒప్పందానికి ఇది తూట్లు పొడిచి.. వివాదాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. సరిహద్దులో చివరిసారిగా తుపాకులు వినియోగించిందీ డ్రాగన్‌ సైనికులే. 1975లో పీఎల్‌ఏకు చెందిన కొంతమంది.. తులుంగ్‌ లా వద్ద భారత్‌ ఆధీనంలోని భూభాగంలోకి చొరబడ్డారు. అక్కడ గస్తీ కాస్తున్న అస్సాం రైఫిల్స్‌ జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారత్‌-చైనా సరిహద్దు వద్ద శాంతిని పునరుద్ధరించడానికి చాలా ఒప్పందాలు జరిగాయి. వీటిల్లో 1996లో జరిగిన ఓ ఒప్పందం ప్రకారం ఇరుపక్షాలు కాల్పులు జరపకూడదు. వాస్తవాధీన రేఖకు రెండు కిలోమీటర్ల వరకు జీవ, రసాయన ఆయుధాల వినియోగం, పేలుడు కార్యకలాపాలు, తుపాకులతో వేటాడడం నిషేధం. చిన్న ఫైరింగ్‌ రేంజిల్లో మాత్రం సైన్యం.. కాల్పుల సాధన చేసుకోవచ్చు. తాజాగా సోమవారం పాంగాంగ్‌ సరస్సు వద్ద జరిగిన ఘటన ఈ ఒప్పందానికి తూట్లు పొడిచింది.

 

డ్రాగన్‌ దుందుడుకు వ్యాఖ్యలు
సరిహద్దుల వెంట కాల్పులు జరిగాయని చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ తొలుత ప్రకటించింది. మన సైన్యం కాల్పులకు దిగితే కనీసం ‘ప్రతి చర్య’గా జరిపామని చెబుతుంది. చైనాయే కాల్పులకు దిగి, తప్పును భారత్‌పై నెట్టేలా ప్రయత్నించిందని గ్లోబల్‌ టైమ్స్‌ కథన కోణాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఆ పత్రిక పలు దుందుడుకు వ్యాఖ్యలు చేస్తోంది. ‘‘మేము భారత్‌ను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు అనుసరిస్తున్న చైనా విధానం హద్దులు దాటింది! అతివిశ్వాసంతో పీఎల్‌ఏను, చైనా ప్రజలను కవ్విస్తున్నారు. ఇది కొండ అంచులపై శీర్షాసనం వేసినట్లుంది’’ అంటూ ట్వీట్‌ చేసింది. ఆ పత్రిక సంపాదకుడు హు షిజిన్‌ తన వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాలోనూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ‘‘నా అంచనా ప్రకారం.. 1962కు ముందు తరహాలోనే చైనాను భారత్‌ చాలా తక్కువ అంచనా వేస్తోంది. చైనా యుద్ధం చేయలేదని తీర్మానించుకుంది. కానీ, చైనా సైన్యం ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధమయింది. ఘర్షణలో విజయం సాధించగలమన్న విశ్వాసంతో ఉంది. ఇరు వర్గాలు సైనిక ఘర్షణకు దిగితే.. భారత్‌ 1962 కంటే దారుణమైన ఓటమిని చవిచూస్తుంది’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


ఇదంతా దేనికంటే...

గస్టు 29 అర్ధరాత్రి భారత్‌ తన భూభాగంలోని కీలక పర్వతాలపై పట్టు సాధించిన తర్వాత చైనాకు ఉక్కపోత పెరిగిపోయింది. ఇవి పాంగాంగ్‌ సరస్సులో కీలకమైన ఫింగర్‌ 4కు వ్యతిరేక దిశలో ఉంటాయి. ఈ శిఖరాలపై నుంచి స్పంగూర్‌ సరస్సు.. చుట్టుపక్కల మైదాన ప్రాంతాలు భారత్‌ గురిలోకి వస్తాయి. డ్రాగన్‌ దళాలు భారత్‌ భూభాగంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే ఇక్కడి నుంచి ముందే గుర్తించవచ్చు. దీంతో భవిష్యత్తులో భారత భూభాగాలను ఆక్రమించుకోవడం కష్టమవుతుందని చైనా ఇరకాటంలో పడింది. దీనికితోడు భారత్‌ కూడా సమాన సంఖ్యలో ఆయుధాలు, బలగాలను మోహరిస్తుండటంతో డ్రాగన్‌ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. చైనా తాజా దూకుడు చర్య.. కీలక శిఖరాలను భారత్‌ నుంచి స్వాధీనం చేసుకోవడానికి చేసిన విఫలయత్నంగా మిగిలిపోయింది. ఈ ఘటనకు కొద్దిరోజుల ముందే పాంగాంగ్‌ సరస్సును అంతర్జాతీయ పర్యాటకుల కోసం తెరిచినట్లు వీడియోలను చైనా విడుదల చేసింది. ఆ సరస్సు తమదే అన్నట్లు ప్రపంచ దేశాల్లో ప్రచారం చేసుకోవడానికి ఇలాంటి వ్యూహాలను పన్నింది. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు వీసాలు జారీ చేస్తే.. భవిష్యత్తులో పాంగాంగ్‌ తమదేనని చూపే యత్నం చేయవచ్చనేది ఆ వ్యూహం సారాంశం..!

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.