close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శనివారం రాత్రికి పూతుప్పల్లిలో ఉంటా

ఆదివారమంతా నియోజకవర్గ సమస్యల పరిష్కారంపైనే దృష్టి 

సీఎంగా ఉన్నా ఈ క్రమం తప్పలేదు 

ప్రజలతో నా అనుబంధం రాజకీయాలకు అతీతం

  అందుకే వరుసగా 11 సార్లు గెలిపించారు 

‘ఈనాడు’ ముఖాముఖిలో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ

ఈనాడు - హైదరాబాద్‌

ప్రస్తుత పోటీ రాజకీయాల్లో ఓ నియోజకవర్గం నుంచి ఒకసారి గెలవడమే గొప్ప అన్న పరిస్థితి ఉన్న తరుణంలో ఏఐసీసీ కార్యదర్శి, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ ఒకే నియోజకవర్గం నుంచి ఓటమన్నది లేకుండా 11 సార్లు వరుసగా గెలిచి చరిత్ర సృష్టించారు. నియోజకవర్గ ప్రజా సేవలో దిగ్విజయంగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇందుకు కేరళలోని కొట్టాయం జిల్లాలోని పూతుప్పల్లి నియోజకవర్గం వేదికగా నిలిచింది. తనకు దక్కిన ఘనతకు అక్కడి ప్రజలు తనను సొంతవాడిగా భావించడమే కారణమంటున్నారు చాందీ. ఈ ఐదు దశాబ్దాల్లో ఎక్కడున్నా...ఏ హోదాలో ఉన్నా నియోజకవర్గం...ఆ ప్రజలను మరువలేదని ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖిలో ఊమెన్‌చాందీ తెలిపారు. ఆయన వెల్లడించిన మరికొన్ని విశేషాలు...
* ఐదు దశాబ్దాలుగా పూతుప్పల్లిలో మీ విజయరహస్యం?
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాభిమానమే. 1970లో 26 ఏళ్ల వయసులో యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్న సమయంలో పూతుప్పల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశాను. ప్రజలే నా పుస్తకాలు.. సామాజ్య జనంతో మాట్లాడమే నా జ్ఞానం. అదే సమస్యలకు పరిష్కారం చూపి మరింత ప్రజా సేవ చేయగలిగేలా చేసింది. 50 ఏళ్లలో ఏనాడూ ప్రజలను నేను మరువలేదు. పనులు, సమస్యల పరిష్కారం కోసం ఎర్నాకుళం, తిరువనంతపురానికి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడటం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఏ పదవిలో ఉన్నా, ఎంత హోదాలో ఉన్నా, దేశంలో ఎక్కడ ఉన్నా శనివారం రాత్రి పూతుప్పల్లి చేరుకుంటాను. ఆదివారం నా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను. వారి సమస్యల పరిష్కారంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి అన్నీ అక్కడే నిర్ణయం అవుతాయి. సీఎంగా ఉన్నా ఆదివారం నియోజకవర్గానికి వెళ్లడం మానలేదు. నియోజకవర్గంలో ప్రజలతో నా అనుబంధం రాజకీయాలకు అతీతమైంది. అదే నన్ను అక్కడ శాశ్వతంగా ఉండేలా చేసింది. నియోజకవర్గ ప్రజల కుటుంబాల్లో ఏ కార్యక్రమానికి పిలిచినా అందుబాటులో ఉంటే అప్పుడే వెళ్తాను...కుదరకపోతే తర్వాత వెళ్లి కలుస్తాను.. అతి తక్కువ  సందర్భాల్లో విధిలేని పరిస్థితిలో లేఖ రాస్తాను.
* 1970 నాటికి ఇప్పటికి వచ్చిన మార్పు ఏంటి?
ఊహించలేనంత మార్పు ఉంది. గతంలో మెజార్టీ సాధనకు ప్రజల అభిమానంతో, విలువలతో కూడిన రాజకీయ ప్రాతిపదిక ఉండేది. ఇప్పుడు ఎలాగైనా మెజార్టీ సాధిస్తే చాలనే విధానం ఉంది.
* మీ మొదటి ఎన్నికల వ్యయం ఎంత?
1970లో నా ఎన్నికల వ్యయం రూ.22,500. విరాళాల రూపంలో రూ.1,300 వచ్చింది. ఎన్నికల వ్యయం అంతా ప్రజలే చూసుకున్నారు.
* ప్రజాప్రతినిధుల వైఖరిలో మార్పులెలా ఉన్నాయి?
ఒకప్పుడు రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు విలువలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎన్నికల ప్రణాళిక(మ్యానిఫెస్టో)లే ఎన్నికలను శాసించేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మ్యానిఫెస్టోలకు విలువ లేకుండా పోయింది.
* నియోజకవర్గ అభివృద్ధిలో మీ ప్రాధాన్యాలు?
తాగునీరు, విద్యుత్‌ సమస్యలకు పరిష్కారం..మెరుగైన రహదారులు, విద్య
* రాజకీయాల్లోకి యువత గురించి..?
అంకితభావం, సామర్థ్యం కలిగిన యువత రాజకీయాల్లోకి వస్తున్నారు. వారిని ప్రోత్సహించాలి.
* భవిష్యత్‌ కార్యాచరణ ఏమిటి?
పార్టీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటాను.
* రాజకీయాల్లో మీకు సంతృప్తి లభించిందా?
1970 నుంచి వరుసగా 50 ఏళ్లు శాసనసభ్యుడిగా ఉండటమే కాకుండా మంత్రిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా పార్టీ అందించిన అన్ని అవకాశాలను కేరళ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, పార్టీ బలపడేందుకు ఉపయోగించాను. పార్టీ నేతగా, ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లో నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను.
* ఏపీలో కాంగ్రెస్‌ బలోపేతంపై..?
రాష్ట్రంలో బూత్‌ స్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేసే కార్యాచరణ అమలు చేస్తున్నాం.
 * అమరావతి, మూడు రాజధానుల ప్రతిపాదనపై  మీ అభిప్రాయం?
కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చించాం. ఈ అంశంపై పీసీసీ స్పందిస్తుంది.

స్వర్ణోత్సవాలు నిర్వహించిన ప్రజలు

ఓటమన్నది ఎరుగక ఒకే నియోజకవర్గం నుంచి 11 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన ఊమెన్‌చాందీ, రెండు సార్లు కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీఎంగా, మంత్రిగా, ప్రతిపక్షనేతగా వ్యవహరించిన చాందీ కేరళలోని కొట్టాయం జిల్లాలోని పూతుప్పల్లి నియోజకవర్గంలో 1970 నుంచి గెలుస్తూనే ఉన్నారు. ఇటీవల శాసనసభ్యుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఊమెన్‌చాందీ నియోజకవర్గంలో ప్రజలు స్వర్ణోత్వవాలు నిర్వహించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.