మా జట్టు గట్టిది
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మా జట్టు గట్టిది

సమష్టి కృషితో ముందుకు సాగుతాం
పీసీసీ అధ్యక్షుడి మార్పుపై చర్చించలేదు
‘ఈనాడు’తో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌

పార్టీలో విభేదాలపై మీ పరిశీలన ఏమిటి

అవన్నీ కుటుంబంలో విభేదాల్లాంటివే. ఇక్కడ పార్టీ నేతల మధ్య మరీ పెద్దస్థాయిలో విభేదాలేమీ నాకు కనిపించలేదు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు కీలకం. చర్చల్లో భిన్నాభిప్రాయాలు వస్తాయి. వాటిని విభేదాలుగా భావించకూడదు. ఒకవేళ ఏమైనా ఉన్నా వాటిని సులభంగానే పరిష్కరించుకోవచ్చు.

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో 2023 ఎన్నికల్లో మూడు రంగుల కాంగ్రెస్‌ కండువా ధరించిన నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలన్నది తమ లక్ష్యమని కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ అన్నారు. పార్టీని బలోపేతం చేయడం ఏ ఒక్కరికో సంబంధించిన అంశం కాదని అది సమష్టి కృషితోనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో తెరాసను ఓడించే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఉప ఎన్నికను, ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటామన్నారు. పార్టీని క్షేత్ర స్థాయినుంచి బలోపేతం చేస్తూ రానున్న శాసనసభ ఎన్నికలకు సమాయత్తం చేస్తామని ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో తెలిపారు.
విస్తృత స్థాయి సమావేశాల సారాంశమేంటి?
ముఖ్యనాయకులు, పీసీసీ ముఖ్యనేతలు, శాసన సభ్యులు, అనుబంధ సంఘాల బాధ్యులు, డీసీసీ అధ్యక్షులు, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో విస్తృత స్థాయిలో చర్చించాం. పార్టీని బలోపేతం చేసేందుకు మంచి సూచనలు, సలహాలు వచ్చాయి. నేతల్లో ఎంతో ఉత్సాహం ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు ఉపకరించే పలు అంశాలను గుర్తించాం. ప్రత్యేక కార్యాచరణతో వాటిని అమలు చేస్తాం. వికేంద్రీకరణ విధానం అనుసరిస్తాం.  

తెలంగాణ కాంగ్రెస్‌ లక్ష్యం ఏమిటి?
తెలంగాణ కలను సాకారం చేసింది కాంగ్రెసే. రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో విజయం సాధించడమే మా ముందున్న లక్ష్యం. తెరాస ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం. వారిని చైతన్య పరుస్తాం. 2023లో భారీ మెజార్టీతో గెలుపొందడానికి వ్యూహాలను సవరించుకుని ముందుకు వెళ్తాం. నాయకులు, కార్యకర్తల్లో మంచి జోష్‌ ఉంది.. నాయకులకు స్థాయి, శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. వీటన్నింటి సమన్వయంతో విజయం సాధిస్తాం. సరైన స్థానాల్లో తగిన వారిని ఉంచినపుడే సత్ఫలితాలు వస్తాయి.

కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు ఉంటుంది?
కార్యకర్తలే పార్టీకి ఊపిరి. నాయకులు, కార్యకర్తల మధ్య అనుసంధానం కీలకం. దీన్ని ముందుగా సాధించాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచీ తెలంగాణలో కాంగ్రెస్‌కు బలమైన పునాది ఉంది. కార్యకర్తల బలం, అంకితభావం ఉన్న నాయకత్వం ఉన్నాయి. కొంతమంది నాయకులు, ప్రజాప్రతినిధులు దూరమైనా కార్యకర్తలు కాంగ్రెస్‌తోనే ఉన్నారు.
రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ఏఐసీసీ పాత్ర ఎలా ఉంటుంది?
మాది జాతీయ పార్టీ. ప్రధాన నిర్ణయాల్లోనే ఏఐసీసీ జోక్యం ఉంటుంది. అనేక అంశాలను రాష్ట్ర నాయకత్వానికే వదిలిపెడతాం. 80 శాతం నిర్ణయాలు పీసీసీ స్థాయిలోనే జరుగుతాయి. ఉదాహరణకు ఉప ఎన్నికల అభ్యర్థుల నిర్ణయం జిల్లా స్థాయిలో తీసుకుంటారు. కొన్ని కీలక నిర్ణయాలను మాత్రం దిల్లీ ఆమోదించాల్సి ఉంటుంది.

తెరాసను కాంగ్రెస్‌ ఎలా ఎదుర్కొంటుంది?
తెలంగాణ ఏర్పడినా ఇక్కడి ప్రజల కలలు సాకారం కాలేదు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుంది. తెరాసను కాంగ్రెస్‌ మాత్రమే ఓడించగలదు. పార్టీకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. తెలంగాణలో పాలన నలుగురి చేతిలోనే ఉంది. తెరాస ప్రభుత్వ రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై మేం పోరాడతాం. అన్ని అంశాలను ప్రజలకు వివరిస్తాం.

ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికపై మీ కార్యాచరణ?
దుబ్బాకలో కాంగ్రెస్‌ పోటీ చేస్తుంది. మండలి ఎన్నికలపై ఉప సంఘం వేశాం. అది అందరితో చర్చిస్తుంది. నియోజకవర్గ స్థాయిల్లో ఓటర్ల నమోదుకు శ్రీకారం చుడుతున్నాం. మండలి ఎన్నికలపై రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని ఏఐసీసీ ఆమోదానికి తీసుకెళ్తాం. సమష్టి బాధ్యతతోనే చక్కటి ఫలితాలు అందుతాయి. చిన్న చిన్న యుద్ధాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఉప ఎన్నికలు చిన్నవిగా కనబడినా ఇవి పార్టీకి ఎంతో కీలకమైనవి. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత లేదా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లేదా ముఖ్యనేతలు రెండు లేదా మూడు గ్రామాల బాధ్యతలు తీసుకోవాల్సి రావడం చాలా చిన్న అంశంగా కనిపించవచ్చు. కానీ వాటి ప్రభావం పార్టీ శ్రేణులపై చాలా ఎక్కువగా ఉంటుంది.

పీసీసీ అధ్యక్షుడి మార్పు ఆలోచన ఉందా?
అది ఏఐసీసీ అధ్యక్షురాలి పరిధిలోని అంశం. పీసీసీ అధ్యక్షుడి మార్పు అంశంపై ఇప్పటివరకూ చర్చ జరగలేదు. సోనియాగాంధీతో సమావేశమైన తర్వాతే దీనిపై సమాధానం చెప్పగలను. క్రికెట్‌లో టాస్‌ వేసేటప్పుడే జట్టు నాయకుడు కీలకం. మ్యాచ్‌ గెలవడమనేది సమష్టి బాధ్యత. కాంగ్రెస్‌ అనేది జట్టు. ఎవరి పాత్ర వారు చక్కగా నిర్వర్తిస్తే జట్టు విజయం సాధిస్తుంది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై మీ కసరత్తు ఎలా ఉంది?
ఇప్పటికే దీనిపై విస్తృతంగా చర్చించాం. వార్డుల వర్గీకరణ, ఓటర్ల జాబితాలపై అనేక అభ్యంతరాలు ఉన్నాయి. వాటిపై న్యాయపరంగా, రాజకీయంగా కూడా పోరాడుతాం. స్థానిక నాయకులతో చర్చించి కార్యాచరణను రూపొందిస్తాం.
ఏఐసీసీ అప్పగించిన కీలక బాధ్యతలపై మీ అభిప్రాయం?
పార్టీని పటిష్ఠమైన స్థాయిలో నిలపడమే లక్ష్యం. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నేత రాహుల్‌గాంధీ ఎంతో విశ్వాసంతో అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తాను. అందరు కలిస్తేనే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురాగలం. పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని వెళ్తూ ప్రజల మద్దతు సాధిస్తాం. పార్టీని జట్టుగా ముందుకు తీసుకెళ్లడం నా బాధ్యత.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు