close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చిక్కుల నుంచి హక్కుల వైపు..

‘గ్రామకంఠం’లో..  ఆవాసాలకు పాస్‌పుస్తకాలు
ఆ భూములు కొనుగోలు చేసినవారికీ మంచి రోజులు!
ఈనాడు - హైదరాబాద్‌

గ్రామకంఠానికి చెందిన భూముల్లో గృహాలు నిర్మించుకున్నవారికి మంచి రోజులు కనిపిస్తున్నాయి. ఈ భూములను కొనుగోలు చేసిన వారికీ ఆశలు మొలకెత్తుతున్నాయి. అయితే, కంఠం పక్కనగల సర్వే నంబర్లలో ఇళ్లు కట్టుకున్న వారికి మాత్రం కాస్త ఇబ్బందులు తప్పేలా లేవని తెలుస్తోంది.
రాష్ట్రంలో దాదాపు డెబ్బై శాతం గ్రామాల్లోని ఇళ్లు గ్రామకంఠం స్థలాల్లో నిర్మించినవే. రెవెన్యూ రికార్డుల్లోనూ వీటిని ‘గ్రామకంఠం స్థలాలు’గా నమోదు చేసి ఉన్నారు. తాజాగా నిర్వహిస్తున్న ఆస్తుల నమోదు ప్రక్రియలోనూ భూమి స్వభావాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. దాదాపు డెబ్బై ఏళ్ల క్రితం కేటాయించిన ఈ భూముల్లో.. తాజా ప్రక్రియతో నిర్మాణదారులకు ఆ నివాసాల(స్ట్రక్చర్‌)కు సంబంధించిన పాసుపుస్తకాలు దక్కనున్నాయి. భూములపైనా పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు దక్కాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

సాదాబైనామా కిందనే ఎక్కువ
* గ్రామాల్లో ఆస్తుల క్రయవిక్రయాలు ఎక్కువగా సాదాబైనామాల కిందనే జరిగాయి. తాజా ఆస్తుల నమోదు ప్రక్రియలో ఇలాంటివన్నీ తెరపైకి వస్తున్నాయి. గతంలో ఒక దఫా సాదాబైనామాకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో చాలా మంది అనుమతి తీసుకుని పంచాయతీ ద్వారా మ్యుటేషన్లు పొందారు. మరోమారు అవకాశం ఇస్తే గ్రామకంఠంలో భూమి కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నవారికి పూర్తిస్థాయి హక్కులు   దక్కనున్నాయి.
* గ్రామకంఠంలో గతంలో భూములను పొందిన వారిలో చాలా మంది ప్రస్తుతం జీవించి లేరు. వారి పేర్ల స్థానంలో వారి వారసుల పేర్లను పంచాయతీ రిజిస్టర్లలో మార్పు చేసి ఉండకపోతే ఇప్పుడు కొంత సమస్య ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాటి భూ యజమాని లేదా అతని భార్య ఉంటే వారికి హక్కులు వర్తిస్తాయని, వారి కుటుంబ సభ్యులకు హక్కులు దక్కాలంటే తప్పనిసరిగా  స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సిబ్బంది సూచిస్తున్నారు.

సర్వే నంబర్లలోని నివాసాలకు అనుమతి కావాల్సిందే...
ప్రస్తుతం గ్రామకంఠాన్ని దాటి నివాసాలు విస్తరించాయి. వ్యవసాయ భూముల్లో చాలా వరకు నివాస గృహాలు ఏర్పడ్డాయి. ప్రస్తుత నమోదు ప్రక్రియ ద్వారా.. వ్యవసాయ భూములకు సంబంధించిన ఈ సర్వే నంబర్లలోని గృహాలకు హక్కులు కల్పించే అవకాశాలు కనిపించడం లేదు. వీటిలో నిర్మించిన ఇళ్లకు పట్టణ ప్రణాళికా విభాగం (డీటీసీపీ), వ్యవసాయేతర రంగానికి భూ వినియోగం (నాలా) అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ అనుమతులు పొందాకే గృహనిర్మాణాలకు అనుమతి ఇస్తారు. ఇవేమీ లేకుండా ఇళ్లు కట్టుకున్నవారు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నారు. వీటివిషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గృహాల సమాచారాన్ని మాత్రం నమోదు చేస్తున్నారు.

నోటరీ భూములకు హక్కులూ కష్టమే!
రూ. వంద తదితర బాండ్‌ పేపర్లపై ఒప్పందంతో భూములు కొనుగోలు చేసుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారూ పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నారు. సాదాబైనామా తీరులోనే నోటరీ ఒప్పందాలపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి స్థలాల్లో నిర్మించే నివాసాలకు అనుమతులు జారీచేస్తే తప్ప హక్కులు పొందడం కష్టమని సిబ్బంది చెబుతున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.