ఆహ్లాదం వైపు అడుగు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆహ్లాదం వైపు అడుగు

పర్యాటక కేంద్రాల్లో పెరుగుతున్న సందడి
సెప్టెంబరులో 30శాతం నమోదు

మార్చిలో లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి పూర్తిగా తగ్గిపోయిన పర్యాటకుల సంఖ్య ఇప్పుడిప్పుడే కాస్త పెరుగుతోంది. అన్‌లాక్‌-1 ప్రకటించినప్పటి నుంచి అన్నీ పర్యాటక ప్రాంతాల్లో సందడి మొదలైంది. ఈ సారి వర్షాలు పుష్కలంగా పడటంతో ప్రకృతి అందాలు, జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. వాటిని చూడాలనుకున్నవారు పర్యాటక ప్రాంతాలకు వస్తున్నారు.

ఈనాడు, అమరావతి: సాధారణంగా రాష్ట్రంలో పర్యాటకానికి అక్టోబరు-జనవరి మంచి సీజన్‌. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చల్లని వాతావరణం ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే కొవిడ్‌ నేపథ్యంలో జులై వరకు పర్యాటకుల రాక 10శాతం మాత్రమే ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతూ సెప్టెంబరు ఆఖరుకు 30శాతానికి చేరింది. అక్టోబరు, నవంబరు నెలల్లో 50 నుంచి 60శాతానికి చేరుతుందని ఆ రంగ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో పశ్చిమబంగ నుంచి మన రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారని, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశమూ ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ అంచనా వేస్తోంది.
* అనంతపురం జిల్లాలోని పెన్న అహోబిలంలో నరసింహస్వామి ఆలయం కిందభాగంలో అమ్మవారి పక్కనుంచి వెళుతున్న జలపాతం వద్దకు వారంలో 1200 నుంచి 1500 మంది వస్తున్నారు. అనంతపురం జిల్లాలోని ‘యాడికి కోన జలపాతం’ వద్ద సందడి చేసేందుకు వారాంతంలో సగటున వేయిమంది వస్తున్నారు.
* విశాఖ, చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్టోబరు నెలకు హోటల్‌, రిసార్టుల్లో గదులు ఇప్పటికే బుక్‌ అయిన పరిస్థితి.

జలక్రీడలు సిద్ధం

విశాఖపట్నంలో పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)కు ప్రతి నెలా సగటున రూ.3కోట్ల ఆదాయం వచ్చేది. కొవిడ్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌లో ఆదాయమే లేదు. జూన్‌-8న అన్‌లాక్‌-1 ప్రకటనతో కార్యకలాపాలు ప్రారంభించినా రాబడి అంతగా లేదు. జులైలో 10శాతం, సెప్టెంబరులో 35శాతం వచ్చింది. ఈ సారి విశాఖ బీచ్‌లో పారాగ్లైడింగ్‌, స్కూబాడైవింగ్‌ వంటి జలక్రీడలు ప్రారంభిస్తుండటంతో ఆదాయం ఇంకా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు