close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇప్పుడే అసలు సవాల్‌!

పెరుగుతున్న రద్దీ...
జాగ్రత్తలు తప్పనిసరి

త్వరలో చలికాల ప్రవేశం
 కరోనా తొలిగిపోలేదంటున్న నిపుణులు   

ఈనాడు- హైదరాబాద్‌

హైదరాబాద్‌లో ఇటీవల దుర్గం  చెరువు వద్ద తీగల వంతెనను ప్రారంభించారు. ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. వేల సంఖ్యలో గుమిగూడారు. మాస్కు కూడా పెట్టుకోకుండానే తిరిగారు. సెల్ఫీలు తీసుకోవడానికి యువత పోటీ పడ్డారు. ఆదివారం కూడా అదే పరిస్థితి.
నగరంలో ఏ మార్కెట్లోకి వెళ్లినా ఇదే పరిస్థితి. మునుపటి మాదిరిగానే గుంపులుగా జనం. మనకేం కాదులే.. మనకు రాదులే అనే భావన...

కరోనా భయంతో జీవితాన్ని ఆపేసుకోలేం. ఈ క్రమంలో కచ్చితంగా  జాగ్రత్తలు పాటించక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి దాకా లాక్‌డౌన్‌లో పాటించిన నిబంధనల కంటే.. ఇప్పుడు అనుసరించాల్సిన స్వీయ నియంత్రణలే మరీ మరీ  ముఖ్యమని చెబుతున్నారు.

కొవిడ్‌పై ఆంక్షల సడలింపుతో క్రమేణా జనజీవన స్రవంతి గాడిలో పడుతోంది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పొద్దుపోయే దాకా వ్యాపార సముదాయాలు తెరిచే ఉంచుతున్నారు. క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. జనం పూర్వం మాదిరిగా ఉద్యోగ, ఉపాధి వేటలో మునిగిపోతున్నారు. మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. సిటీ బస్సులూ రోడ్డెక్కాయి. హోటళ్లు, రెస్టారెంట్లకు ఆమోదం లభించింది. త్వరలో సినిమా ప్రదర్శనలకూ, తదితర వినోదాలకూ కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొద్దిరోజుల్లోనే పండుగల సీజన్‌ ప్రారంభమవుతోంది. శీతాకాలం సమీపిస్తోంది. ఇప్పుడే అసలు సవాల్‌ మొదలైందని చెబుతున్నారు నిపుణులు. గత 7 నెలలుగా కరోనా వైరస్‌ రూపంలో ఎంతోమందిని కబళిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతున్న సమయంలో.. జాగ్రత్తలు తీసుకోకుంటే వైరస్‌ విజృంభించడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెంచగా... 4 నెలలుగా పాజిటివ్‌ల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకూ రాష్ట్రంలో పాజిటివ్‌ శాతం 6గా నమోదైంది. అయితే కొవిడ్‌ కేసుల నమోదు స్వల్పంగా తగ్గిందేగానీ.. కరోనా వైరస్‌ ముప్పు పూర్తిగా తొలగిపోలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సీజనల్‌ వ్యాధుల ముప్పు
వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో.. సీజనల్‌ వ్యాధులు విజృంభించడానికి అవకాశం ఉంటుంది. వర్షాలు తగ్గుముఖం పట్టగానే నీటి నిల్వలపై దోమలు వృద్ధి చెందే అవకాశాలెక్కువ. ఉన్నట్టుండి డెంగీ, మలేరియా వంటి వ్యాధులు విజృంభిస్తే.. అవి కరోనా వైరస్‌కు తోడై ప్రజారోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతుందని ఆరోగ్యశాఖలో ఆందోళన నెలకొంది. అందులోనూ ఒకే వ్యక్తిలో ఏకకాలంలో కరోనా, డెంగీ రెండూ సోకితే.. అప్పుడు ముప్పు తీవ్రత మరింత అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో సీజనల్‌ ఫ్లూ కూడా విజృంభిస్తుంది. జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకూ దారితీసే ప్రమాదముంది.
*  జూన్‌లో 62,277 నమూనాలను పరీక్షిస్తే.. 22 శాతం పాజిటివ్‌లు నమోదయ్యాయి.
*  జులైలో 3,77,019 నమూనాలకు 13 శాతం కేసులు బయటపడ్డాయి.
*  ఆగస్టులో 9,58,876 నమూనాలకు   7 శాతం కేసులు వచ్చాయి.
*  సెప్టెంబరులో ఏకంగా 16,26,598 నమూనాలను పరీక్షించగా 4 శాతం కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.
*  అక్టోబరు 7వ తేదీ నాటికి 3,40,995 నమూనాల్లో 4 శాతం పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


తప్పనిసరి జాగ్రత్తలివి..

* మరికొన్నాళ్లు మాస్కు వాడక తప్పదు.
* బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువమంది గూమిగూడకూడదు.
* జనసమూహాల్లోకి వెళ్లకపోవడమే మంచిది.
* ముఖ్యంగా కొవిడ్‌ లక్షణాలున్నవారు జనంలోకి వెళ్లొద్దు.
* బయటకు వెళ్లిన ప్రతిసారీ, ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు మాస్కు తప్పనిసరిగా ధరించాలి.
* కచ్చితంగా ఆరు అడుగుల వ్యక్తిగత దూరం పాటించాలి.
* ఏ వస్తువును, వ్యక్తిని తాకినా వెంటనే చేతులను సబ్బుతోగానీ, శానిటైజర్‌తోగానీ శుభ్రంగా కడుక్కోవాలి.


అజాగ్రత్తతో పెను ముప్పు

* కొందరి అజాగ్రత్త కారణంగా వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది.
* కొందరు మాస్కులు పెట్టుకున్నప్పటికీ వాటిని కిందకు వదిలేస్తున్నారు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఎదుటివారికి వినబడాలనే ఉద్దేశంతో మాస్కు తీసి మరీ మాట్లాడుతున్నారు. నిజానికి మాట్లాడేటప్పుడే తప్పనిసరిగా మాస్కు ధరించాలి. లేకుంటే వైరస్‌ సోకే ప్రమాదం ఉంది.
* బస్తీల్లో, మార్కెట్లు, రైతుబజార్లలో వ్యక్తిగత దూరం పాటించడంలేదు.
* ఆటోలు, టాక్సీల్లో ఐదారుగురు కలిసి వెళ్తున్నారు.
* పల్లెల్లోనూ కరోనా నిబంధనలను పాటించడంలేదు. వీటిపై ఎక్కువమంది గ్రామీణులకు కనీస అవగాహన కూడా లేదు.
* వివాహాది శుభకార్యాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా కలిసి మెలిసి తిరుగుతున్నారు.


మళ్లీ విజృంభించే అవకాశం
-డాక్టర్‌ ఎంవీ రావు, ప్రముఖ జనరల్‌ ఫిజీషియన్‌

బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లో వైరస్‌ తగ్గినట్టే తగ్గి, జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తిరిగి విజృంభిస్తోంది. మన దేశంలో ఇంకా మొదటి దశే పూర్తవలేదు. కేరళలో బాగా తగ్గిన కేసులు.. ఇటీవల ఉన్నట్టుండి పెరిగాయి. జనజీవనం సాధారణ స్థితికి రావడానికి ఆంక్షలు ఎత్తేశారేగానీ.. కరోనాకు కాదు. కొవిడ్‌ ముప్పు తొలగిపోలేదు. మన రాష్ట్రంలో కేసులు తగ్గుతుండడం శుభ పరిణామమే. అది ఇలాగే కొనసాగాలంటే.. ఈ సమయంలో ప్రజలు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంది.


మాస్కుతోనే మనకు రక్ష
-డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

మాస్కే మనకు రక్షగా నిలుస్తుంది. మాస్కు లేకుండా ఎవరైనా మాట్లాడుతుంటే.. వారిని ధరించమని చెప్పండి. వినకపోతే అక్కణ్నించి వెళ్లిపోవడం మంచిది. ఎందుకంటే దగ్గు, తుమ్ముల ద్వారానే కాదు.. మాట్లాడుతుంటే తుంపర్ల ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. జనసమూహం ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లొద్దు. ప్రజలు కరోనా నివారణ చర్యలు పాటిస్తూ వ్యాప్తిని అడ్డుకోవడంలో సహకరించాలి. సాధారణ జీవనాన్ని సాగించడానికి బయటకు రావడం అవసరం. అయితే జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిద్దామా.. లేక నిబంధనలను ఉల్లంఘించి తిరిగి స్వేచ్ఛను కోల్పోదామా? అనేది మన చేతుల్లోనే ఉంది.


జిల్లాల్లో  ప్రస్తుత కేసులు

* జీహెచ్‌ఎంసీ 7,920
* కరీంనగర్‌ 1,186
* మేడ్చల్‌ 1,709
* నల్గొండ 1,040
* రంగారెడ్డి 2,372
* వరంగల్‌ నగర 1,049
*  భద్రాద్రి కొత్తగూడెం 582
*  జగిత్యాల 503
*  కామారెడ్డి 530
*  ఖమ్మం 835
*  మహబూబాబాద్‌ 557
*  నిజామాబాద్‌ 793
*  పెద్దపల్లి 506
*  సంగారెడ్డి 708
*  సిద్దిపేట 696
*  సూర్యాపేట 603


6

1000  పైగా పాజిటివ్‌ కేసులున్న జిల్లాలు


10

500 మందికి పైగా బాధితులున్న జిల్లాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.