గ్రిడ్‌కు ఇబ్బందేం లేదు..
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
గ్రిడ్‌కు ఇబ్బందేం లేదు..

ముందు జాగ్రత్తగానే విద్యుత్‌ నిలిపివేత
నీరు తగ్గగానే ఎక్కడికక్కడ పునరుద్ధరణ
ముంబయి అనుభవంతో ముందస్తు చర్యలు
ఈనాడు’తో ఇంటర్వ్యూలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌; భారీవర్షాల తాకిడికి కాలనీలు, అపార్టుమెంట్లలోకి వరదనీరు చేరటంతో ముందు జాగ్రత్తగా చాలాచోట్ల విద్యుత్తు సరఫరా నిలిపివేశామని ట్రాన్స్‌కో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. గ్రిడ్‌కు ఇబ్బందేమీ లేదన్నారు. నీటిని తొలగించగానే విద్యుత్తును పునరుద్ధరిస్తామని చెప్పారు. రాజధాని నగరంలో సింహభాగం చీకట్లో మగ్గుతున్న నేపథ్యంలో ఆయన ‘ఈనాడు-ఈటీవీ’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
* ‘‘ముంబయిలో గ్రిడ్‌ దెబ్బతిని ప్రజలు అగచాట్లు పడిన అనుభవం దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌, విద్యుత్‌ మంత్రి జగదీశ్‌రెడ్డిలు మమ్మల్ని అప్రమత్తం చేశారు. ఐఎండీ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకున్నాం. విద్యుత్‌ డిమాండ్‌ అనూహ్యంగా 2,660 మెగావాట్లకు పడిపోయింది. పీక్‌ డిమాండ్‌ కూడా 5,880 మెగావాట్లుగా నమోదయ్యింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ను పర్యవేక్షిస్తూనే ఉన్నాం. పరిస్థితి దారితప్పకుండా చూడగలిగాం. నిజానికి ఈ సీజన్‌లో డిమాండ్‌ 12 వేల మెగావాట్ల దాకా చేరుతుందనుకున్నాం. బుధవారం విద్యుత్‌ డిమాండ్‌ 4,184 మెగావాట్లుగా నమోదయ్యింది.
*రాబోయే రెండు రోజులు భారీ వర్షాలుంటాయని చెబుతున్నారు. గ్రిడ్‌ను 24 గంటల పాటు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాం. డిమాండ్‌ బాగా పెరిగినా, ఇప్పటికంటే ఇంకా తగ్గినా ఇబ్బంది లేదు. 1800 మెగావాట్ల నుంచి 18వేల మెగావాట్ల వరకూ తట్టుకునే సామర్థ్యం గ్రిడ్‌కు ఉంది.
* విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కంట్రోల్‌ రూములను ఏర్పాటుచేశాం. ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో 94408 11244 లేదా 94408 11245, 1912, 180042500028 నంబర్లకు, ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 73820 72104, 73820 72106, 1912. 100 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు’’ అని సీఎండీ వివరించారు.

ఇదే స్ఫూర్తి కొనసాగించండి: సీఎం కేసీఆర్‌
ఈనాడు, హైదరాబాద్‌: భారీ వర్షాలతో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లోనూ విద్యుత్తు పునరుద్ధరణ కోసం సిబ్బంది కష్టపడుతున్నారనీ, వంద శాతం పునరుద్ధరణ కొనసాగే వరకూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ శాఖ అధికారులు, సిబ్బందికి సూచించారు. బుధవారం ఆయన ట్రాన్స్‌కో, జెన్‌కోల సీఎండీ ప్రభాకరరావుతో మాట్లాడారు. జలమయమైన ప్రాంతాలకు సిబ్బంది వెళ్లలేకపోతున్నారనీ, వారు వెళ్లగలిగిన చోట సరఫరాను పునరుద్ధరిస్తున్నామని ముఖ్యమంత్రికి సీఎండీ వివరించారు. క్లిష్ట సమయంలో విద్యుత్తు సిబ్బంది చేస్తున్న కృషిని ఈ సందర్భంగా సీఎం ప్రశంసించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు