అవన్నీ సర్దుకునే ప్రకంపనలే..
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అవన్నీ సర్దుకునే ప్రకంపనలే..

రాజధానిలో అధిక వర్షపాతంతోనే స్వల్పభూకంపాలు... ఆందోళన వద్దు
‘ఈనాడు’తో ఎన్‌జీఆర్‌ఐ ముఖ్య శాస్త్రవేత్త డా.శ్రీనగేశ్‌

భూగర్భ జలాలను యథేచ్ఛగా తోడేస్తుండటం భూకంపాలు పెరగడానికి కారణమని కచ్చితంగా చెప్పలేం. భూకంపాలు రావడానికి చాలా కారణాలుంటాయి. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 6గా నమోదయిందంటే 11 కిలోమీటర్ల పొడవు, రెండుమూడు కిలోమీటర్ల వెడల్పు, 10 కిలోమీటర్ల లోతున అది విస్తరించి ఉంటుంది. ప్రస్తుతం ఏర్పడుతున్నవి మీటర్లలోపే ఉన్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌: భూప్రకంపనలు భాగ్యనగరాన్ని కొద్దిరోజులుగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. బోరబండ, గచ్చిబౌలిలో భయాలు తొలగకముందే ఇటీవల రాజేంద్రనగర్‌ పరిధిలో మూసీకి చేరువలోను, తాజాగా టీఎన్జీవోస్‌ కాలనీలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో భూమిలోపల నుంచి భారీ శబ్దాలు వస్తున్నాయి. అయితే.. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఏర్పడుతున్నవి చాలా సూక్ష్మ భూకంపాలని, అధిక వర్షాలతో భూమి లోపల సర్దుబాటుతో వస్తున్నాయని, భయపడాల్సింది లేదని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌  శ్రీనగేశ్‌ భరోసా ఇస్తున్నారు. భూకంపాలపై మరిన్ని విషయాలను ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో వెల్లడించారు.
*  భూకంపాల ముప్పు అంతగా లేని జోన్‌లో హైదరాబాద్‌ ఉంది. అక్టోబరు 2 నుంచి ఇక్కడ ప్రకంపనలు మొదలయ్యాయి. మొదట బోరబండ ప్రాంతంలో కనిపించాయి.  దీనికి కొనసాగింపుగానే ఇతర ప్రాంతాల్లోనూ చూస్తున్నాం. రెండువారాల మా పరిశీలనలో బోరబండలో వస్తున్నవి సూక్ష్మ భూకంపాలని తేలింది. వాటి తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై ఒకటి కంటే తక్కువే. ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. అక్కడ సూక్ష్మ భూకంపాలు 2017లోనూ వచ్చాయి. అప్పుడు 135 సార్లు ప్రకంపనలు నమోదు చేశాం. గతంలో నమోదైన చోటకు దూరంగా ఈసారి రాజేంద్రనగర్‌ పరిధి మూసీ సమీపంలో శనివారం కంపనలు వచ్చాయి. మరింత అధ్యయనం చేయాల్సి ఉంది.
* అత్యధిక వర్షపాతం నమోదైన మర్నాడే గచ్చిబౌలి సమీప టీఎన్జీవోకాలనీలో భూప్రకంపనలు కనిపించాయి. అక్కడి పరిస్థితిని రెండు సిస్మోగ్రాఫ్‌ పరికరాలతో పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటివరకు 20 నుంచి 25సార్లు చిన్నపాటి ప్రకంపనలు రికార్డయ్యాయి. భూకంప లేఖినిపై వాటి తీవ్రత 0.4 - 0.5 మాత్రమే. అప్పుడు వచ్చే శబ్దాలతోనే భవనాలు కదిలినట్లుగా అన్పించే అవకాశముంది. సూక్ష్మ భూకంపాలను తట్టుకునేలా ఎత్తైన భవనాల నిర్మాణం ఉంటుంది. ఆకాశహర్మ్యాల్లో ఉంటున్నవారు ఆందోళన చెందాల్సిన పనిలేదు.
* చిన్నచిన్న భూకంపాలు ఒకచోట వస్తుంటాయి. అవన్నీ క్లస్టర్‌గా అవుతాయి. 2017లో బోరబండలో, అంతకుముందు వనస్థలిపురం, నెల్లూరులో వచ్చాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. అత్యధిక వర్షపాతం నమోదైన సందర్భాల్లో చిన్నచిన్న భూకంపాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో వార్షిక వర్షపాతం 80 సెం.మీ.పైగా ఉంటే 120 సెం.మీ. వరకు కురిసింది. అధిక వర్షపాతం నమోదయినప్పుడు భూమిలోకి పొరల్లోంచి నీరు ఇంకి సర్దుబాటవుతుంది. ముఖ్యంగా గుట్టలు, రాళ్లున్న చోట పగుళ్లు, పొరలు, రంధ్రాల ద్వారా లోపలికి ఇంకుతుంది. సాధారణ వర్షపాతమైతే ఇదివరకే ఉన్న పగుళ్లలో నీరు సర్దుకుంటుంది. కానీ అధిక వర్షం పడినప్పుడు ఇంకేందుకు అది కొత్తదారులు వెతుకుతుంది. ఈ క్రమంలో ప్రకంపనలు వస్తుంటాయి. దీన్నే హైడ్రోసిస్మోసిటీ అంటాం.
* భవనాలు భద్రంగా ఉంటే స్వల్ప భూకంపాలతో పెద్దగా ముప్పుండదు. హైదరాబాద్‌ జోన్‌-2లో 4.5 తీవ్రత కంటే తక్కువ ముప్పున్నా అంతకంటే ఎక్కువ తీవ్రత పెరిగితే ఏంటనే కోణంలో సన్నద్ధం కావాలి. ర్యాపిడ్‌ విజువల్‌ స్క్రీనింగ్‌(ఆర్‌వీఎస్‌) చేయాలి. ప్రాంతాలను ఎంపికచేసి అక్కడక్కడ భవనాలను ఈ సర్వేలో పరీక్షిస్తారు. హైదరాబాద్‌కూ ఇది అవసరం. జనాభా లెక్కల్లోనే ఇళ్లు ఎలాంటివి అనే గణాంకాలు నమోదు చేస్తున్నారు. వీటినే మరింత లోతుగా పరిశీలించాలి. విపత్తుల శాఖతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రేయిన్‌గేజ్‌ మాదిరి  భూకంపలేఖినుల ఏర్పాటు హైదరాబాద్‌ వంటి నగరాలకు అవసరం లేదు.


టీఎన్‌జీవోస్‌ కాలనీలో 20 ప్రకంపనలు

రాయదుర్గం, న్యూస్‌టుడే: గచ్చిబౌలి టీఎన్‌జీవోస్‌ కాలనీ ప్రాంతం, మై హోం విహంగ పరిసర ప్రాంతాల్లో మళ్లీ భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి దాటాక, ఆదివారం మధ్యాహ్నం ప్రకంపనలు వచ్చినట్లు వారు తెలిపారు. జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) రెండు చోట్ల ఏర్పాటుచేసిన భూకంప లేఖినిపై 20 వరకు ప్రకంపనలు రికార్డయ్యాయి. ఈ నెల 14న ప్రకంపనలు ఆరంభమయ్యాయని, రోజూ మూడు, నాలుగేసి సార్లు శబ్దాలతో ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. మళ్లీ శనివారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు మూడు సార్లు, ఆదివారం భవనాలు కంపించినట్లు ఆందోళన ప్రకటించారు. ఎన్‌జీఆర్‌ఐ ముఖ్య శాస్త్రవేత్త శ్రీనగేశ్‌ ఆ ప్రాంతాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. టీఎన్‌జీవోస్‌ కాలనీ ప్రాంతంలో, గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో భూకంప లేఖిని(రిక్టర్‌ స్కేల్‌)ని ఏర్పాటు చేశారని, స్కేలుపై 20 వరకు ప్రకంపనలు రికార్డు అయినట్లు తెలిపారు. రాజేంద్రనగర్‌ పరిధి మూసీ సమీప ప్రదేశాల్లోనూ శనివారం ప్రకంపనలు వచ్చినట్లు ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు తెలిపారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు